'కల్మా అంటే ఏమిటో తెలియదన్నాం.. అంతే నాన్నను కాల్చేశాడు'.. పహల్గామ్ బాధితురాలి ఆవేదన

పహల్గామ్‌ ఉగ్రదాడి ఎంత భయంకరంగా జరిగిందో కళ్లారా చూసిన ఒక కేరళ మహిళ ఆ దుర్ఘటనను వివరించింది.;

Update: 2025-04-25 08:24 GMT

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో అమాయకులైన టూరిస్టులు 26మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తన తండ్రిని కోల్పోయిన కేరళకు చెందిన ఆర్తీ మీనన్ ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకుంటూ, "మేము చుట్టూ ఉన్నవాళ్లంతా పరుగులు తీస్తుండడం చూశాం. అక్కడంతా గందరగోళంగా ఉంది" అని చెప్పింది. "ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి 'కల్మా' అన్నాడు. దాని అర్థం మాకు తెలియదని చెప్పగానే ఆ వ్యక్తి మా నాన్నను కాల్చేశాడు" అని ఆమె తెలిపింది.

పహల్గామ్‌ ఉగ్రదాడి ఎంత భయంకరంగా జరిగిందో కళ్లారా చూసిన ఒక కేరళ మహిళ ఆ దుర్ఘటనను వివరించింది. తుపాకీ పేలిన శబ్దం వినిపించగానే అందరూ పరుగులు తీశారని.. అక్కడ అప్పటి ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం గందరగోళంగా మారిందని ఆమె చెప్పింది. ఇంతలో ఒక ఉగ్రవాది వారి దగ్గరకు వచ్చి 'కల్మా' (ముస్లింల పవిత్ర వచనం) చెప్పమని అడిగాడు. దాని అర్థం వారికి తెలియకపోవడంతో, ఆ ఉగ్రవాది వారి కళ్లముందే ఆమె తండ్రిని కాల్చి చంపేశాడు.

ఆ యువతి ఇంకా మాట్లాడుతూ.. "ఒక తుపాకీ శబ్దం వినిపించగానే అది ఏమిటని మా నాన్నను అడిగాను. ఆయనకు కూడా నాకు తెలియదు అన్నారు. తర్వాత మరిన్ని కాల్పుల శబ్దాలు వినిపించడంతో మేం పరిగెత్తడం మొదలుపెట్టాం. చుట్టూ ఉన్నవాళ్లంతా పరుగులు తీస్తుండడం చూశాం. అక్కడంతా గందరగోళంగా ఉంది. అప్పుడు సడన్‌గా ఒక తుపాకీ పట్టుకున్న వ్యక్తి మా వైపు రావడం నేను చూశాను. మా పక్కన రెండు మూడు గుంపుల వాళ్లు ఉన్నారు. ఆ వ్యక్తి వాళ్లను ఏదో అడుగుతున్నాడు. తర్వాత వాళ్లపై కాల్పులు జరుపుతున్నాడు. అది చూసి నేను భయపడిపోయాను. మా నాన్నతో ఆ వ్యక్తి మన వైపు వస్తున్నాడని అన్నాను. మా నాన్న మాత్రం ప్రశాంతంగా 'చూద్దాం ఏం జరుగుతుందో' అన్నారు. ఆ వ్యక్తి మా దగ్గరకు వచ్చి 'కల్మా' అన్నాడు. దాని అర్థం మాకు తెలియదని చెప్పగానే ఆ వ్యక్తి మా నాన్నను కాల్చేశాడు... కాశ్మీర్‌ ప్రజలు చాలా మంచివాళ్లు. సెంట్రల్ గవర్నమెంట్, జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ కూడా మాకు చాలా సహాయం చేశారు" అని కన్నీటి పర్యంతం అయింది.

ఈ దాడిలో కేవలం ఆమె తండ్రి మాత్రమే కాదు, పెళ్లయిన కొద్ది రోజులకే తన భార్యతో కలిసి కాశ్మీర్‌కు వెళ్లిన 26 ఏళ్ల నేవీ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, స్థానిక ప్రజలు కూడా ఉన్నారు. అమాయక టూరిస్టులపై జరిగిన ఈ దారుణమైన దాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Tags:    

Similar News