ఎర్రన్నల ఇలాకాలో 9 లక్షల ఓట్లు తొలగింపు

ఇక కేరళలో మూడు నెలల పాటు సర్ ప్రక్రియ నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 4 నుంచి మొదలైన ఈ ప్రక్రియ జనవరి 30 దాకా కొనసాగింది.;

Update: 2026-02-21 18:30 GMT

ఎర్రన్నలకు ఇపుడు దేశంలో ఉన్న ఏకైక అధికారిక రాష్ట్రం కేరళ. వరసగా రెండు సార్లు అక్కడ లెఫ్ట్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు అయింది. దాంతో పాటు కేరళ మాత్రమే ఆశాదీపం గా ఉంది. ఈసారి అయితే హ్యాట్రిక్ సాధించి మళ్లీ ఎర్ర జెండా పాతాలని ఎల్డీఎఫ్ నాయకత్వం చూస్తోంది. ఇదిలా ఉంటే మరో వైపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలసి ఉంటున్నా కేరళ విషయానికి వచ్చేసరికి రాజకీయ ప్రత్యర్ధులు గా మారిపోతున్నారు. ఈసారి ఎలాగైనా కేరళలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ బలంగా ఆశిస్తోంది. ఈ రెండు కూటముల మధ్యలో బీజేపీ కూడా తన రాజకీయ జాతకాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. 15 శాతం పైగా ఓటు షేర్ బీజేపీకి ఉండడంతో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని డబుల్ చేసుకోవాలని చూస్తోంది. అధిక సీట్లు సాధించి తాము కింగ్ మేకర్ అయినా కావాలని భావిస్తోంది.

సర్ ప్రక్రియతో :

ఇదిలా ఉంటే దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలలో కూడా సర్ ని నిర్వహించారు. మొత్తం మీద సర్ ప్రక్రియ పూర్తి అయింది. తుది జాబితా వెలువడింది. ఈ తుది జాబితాలో చూస్తే కేరళలో ఏకంగా తొమ్మిది లక్షల ఓట్లు తొలగించారు. ఇవన్నీ అనర్హత కలిగిన ఓట్లుగా తేల్చారు. తొమ్మిది లక్షల ఓట్లు అంటే చిన్న విషయం అయితే కాదు కానీ సర్ ప్రక్రియ ద్వారా ఓటర్ జాబితా ప్రక్షాళన అని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది మరో వైపు విపక్ష పార్టీలు అయితే సర్ ప్రక్రియతో తమకు అనుకూలమైన ఓట్లు తీసేస్తున్నారు అని విమర్శిస్తున్నాయి.

మూడు నెలల పాటు :

ఇక కేరళలో మూడు నెలల పాటు సర్ ప్రక్రియ నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 4 నుంచి మొదలైన ఈ ప్రక్రియ జనవరి 30 దాకా కొనసాగింది. తుది జాబితా తరువాత కేరళలో మొత్తం ఓటర్లు 2. 69 కోట్ల దాకా ఉన్నారు అని తేలింది. ఇక సర్ ప్రక్రియ ద్వారా తొమ్మిది లక్షల ఓట్లను తొలగించారు. ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించిన అనంతరం సవరించిన మీదట ఈ తుది జాబితాను తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది.

స్త్రీ ఓటర్లు ఎక్కువ :

దాంతో ప్రస్తుతం కేరళలో ఉన్న తుది జాబితాను పరిశీలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య 2,69,53,644గా ఉంది. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,31,26,04 ఉంటే మహిళా ఓటర్ల సంఖ్య 1,38,27,319 మంది ఉన్నారు. అంటే మహిళా ఓటర్లే ఏడు లక్షల దాకా అధికం అన్న మాట. వీరే రేపటి ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తారు అన్న మాట. ఇక 227 మంది ఇతర జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇందులో 18-19 ఏళ్ల లోపు ఓటర్లు 4,24,518 మంది ఉన్నారని లెక్క తేల్చారు.

వాళ్ళందరికీ ఓట్లు :

ఇదిలా ఉంటే అంతా పారదర్శకంగా నిర్వహించామని ఎన్నికల సంఘం చెబుతోంది. తుది జాబితాను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆధికారులు, అలాగే అసిస్టెంట్ అధికారులు దగ్గర చూసుకోవచ్చునని సందేహాలు ఉంటే చెక్ చేసుకోవచ్చు అని ఈసీ చెబుతోంది అంతే కాదు కేరళ ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా వెళ్ళి తనిఖీ చేసుకోవచ్చునని చెబుతోంది. ఇక కొత్త ఓటర్లకు చోటు కల్పించారు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 నిండితే వారందరికీ ఓటు హక్కుని కల్పించారు. వీరే రేపటి ఎన్నికల్లో తమ తీర్పుని ఇవ్వనున్నారు. మరి ఈ జాబితా మీద లెఫ్ట్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News