బుడతడి బిర్యానీ కోరికతో మారిన మెనూ.. కేరళ అంగన్వాడీల్లో సరికొత్త వంటలు

కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో ఒక బుడతడు తన ముద్దుముద్దు మాటలతో అందరి దృష్టిని ఆకర్షించాడు.;

Update: 2025-06-04 16:30 GMT

కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో ఒక బుడతడు తన ముద్దుముద్దు మాటలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అంగన్‌వాడీలో ఉప్మాకు బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ అతను చేసిన అభ్యర్థన వీడియో లక్షలాది మందిని చేరి వైరల్ అయ్యింది. ఆ చిన్నారి కోరిక ఇప్పుడు కేరళలోని వేలాది అంగన్‌వాడీ కేంద్రాలకు ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కేరళ ప్రభుత్వం ఆ వీడియోను సీరియస్‌గా తీసుకుని, అంగన్‌వాడీల మెనూల్లో పెను మార్పులు చేసింది.

అంగన్‌వాడీల్లో కొత్త రుచులు

నిన్న (మంగళవారం) అంగన్‌వాడీల పునఃప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేరళ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి వీణా జార్జ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అంగన్‌వాడీ కేంద్రాలకు సరికొత్త మెనూను అధికారికంగా ప్రకటించారు. ఈ మెనూలో పిల్లలు ఎంతో ఇష్టపడే, రుచికరమైన వంటకాలను చేర్చడం విశేషం. అవేంటంటే.. ఎగ్ బిర్యానీ, పులావ్, దాల్ పాయసం, సోయా డ్రై కర్రీ, లడ్డూలను చేర్చింది.

కేరళ చరిత్రలోనే తొలిసారిగా, అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకే రకమైన మెనూను అమలు చేయడం ఇదే మొదటిసారి అని మంత్రి వీణా జార్జ్ ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాదు, చిన్నారుల పోషకాహార స్థాయిలను మరింత పెంచేందుకు, వారానికి రెండుసార్లు అందించే పాలను ఇకపై మూడుసార్లు అందిస్తామని కూడా ఆమె ప్రకటించారు.

ఈ మెనూ మార్పుల వెనుక అలప్పుళకు చెందిన శంకు అనే చిన్నారి కీలక పాత్ర పోషించాడు. గత ఫిబ్రవరిలో శంకు తన ఇంట్లో బిర్యానీ తింటూ, "అంగన్‌వాడీలో ఉప్మా వద్దమ్మా.. బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలి" అని తన తల్లిని అడిగాడు. శంకు తల్లి ఆ సంభాషణను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది వెంటనే వైరల్‌గా మారింది.

ఈ వీడియో మంత్రి వీణా జార్జ్ దృష్టికి వెళ్ళింది. ఆమె వెంటనే దీనిపై సానుకూలంగా స్పందించి.. "ప్రస్తుతం అంగన్‌వాడీలలో అందిస్తున్న ఆహారాన్ని పరిశీలిస్తాం. పిల్లలకు మరింత మెరుగైన ఆహారాన్ని అందించేలా మార్పులు చేస్తాం" అని ఫేస్‌బుక్‌లో ఒక వీడియో ద్వారా హామీ ఇచ్చారు. శంకు వీడియోపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందించి, అంగన్‌వాడీ పిల్లలకు మంచి ఆహారం అందించాలని కోరారు. వారి కోరికలన్నీ ఇప్పుడు వాస్తవరూపం దాల్చాయి.

Full View
Tags:    

Similar News