రివర్సు సుంకం వేసి.. ట్రంప్ కు మోడీ దమ్ము చూపాలన్న మాజీ సీఎం
అగ్రరాజ్యం అమెరికా మన ఎగుమతుల మీద యాభై శాతం సుంకం విధిస్తోందన్న ఆయన.. ‘‘మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి.;
నిన్న మొన్నటి వరకు భారత విదేశాంగ విధానం ఏ మాత్రం బాగోలేదంటూ.. అందరిని శత్రువుల్ని చేసుకుంటున్నట్లుగా విమర్శలు చేసిన వారి నోరు మూయించిన ప్రధాని మోడీ.. ఇప్పుడు ఆయన ప్రత్యర్థ్యులు సైతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు దమ్ము చూపాలని కోరుతున్నారు. మన మీద సుంకాలు వేసిన అమెరికాకు రివర్సులో మరిన్ని సుంకాలు వేయాలని.. అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోడీ తన దమ్ము చూపాలని కోరారు. యావత్ దేశం మీ వెంటే ఉందంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
అగ్రరాజ్యం అమెరికా మన ఎగుమతుల మీద యాభై శాతం సుంకం విధిస్తోందన్న ఆయన.. ‘‘మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. ట్రంప్ తల వంచుతాడో లేదో చూడండి’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇటీవల అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం మినహాయింపు ఇచ్చిన నిర్ణయాన్ని తప్పు పట్టారు.
అమెరికా పత్తి దిగుమతి వల్ల మన రైతులకు మార్కెట్లో రూ.900 కంటే తక్కువ ధర వస్తుందన్న ఆయన.. ‘అమెరికా రైతులు ధనవంతులు అవుతారు. గుజరాత్ రైతులు బీదవారు అవుతారు. పత్తి పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్ లేకపోవటంతో రైతులు అప్పుల బారిన పడతారు. చివరకు ఆత్మహత్యలు చేసే పరిస్థితి వస్తుంది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు విత్తనాలు.. ఎరువులు కొనుగోలు చేసేందుకు అప్పులు తీసుకున్నారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు అప్పు ఎలా తీర్చాలని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వానికి దాసోహమైందంటూ ఆరోపించిన కేజ్రీవాల్.. ట్రంప్ యాభై శాతం సుంకం విధించారని.. మోడీ వంద శాతం సుంకం విధించాలని కోరారు. మరి.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రధానమంత్రి మోడీ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ప్రశ్నగా మారింది.