బలం చూపటానికి గులాబీ బాస్ రెడీగా లేరా?
అందరిది ఒక దారి అయితే తనదంటూ ప్రత్యేక దారి అన్నట్లుగా వ్యవహరించటం గులాబీ బాస్ కేసీఆర్ కు కొత్తేం కాదు.;
అందరిది ఒక దారి అయితే తనదంటూ ప్రత్యేక దారి అన్నట్లుగా వ్యవహరించటం గులాబీ బాస్ కేసీఆర్ కు కొత్తేం కాదు. సాధారణంగా రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రజా సమస్యల మీదా.. ప్రజలతో తరచూ అందుబాటులో ఉండటంతో పాటు.. నిత్యం పలువురిని కలుస్తూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. కానీ..కేసీఆర్ మాత్రం అందుకు భిన్నం. తాను కలవాలని అనుకున్నప్పుడు మాత్రమే కలిసే అవకాశాన్ని ఇస్తారు. ఒకవేళ.. పరిస్థితులు డిమాండ్ చేస్తున్నా.. ఆయన స్పందించకుండా ఉండిపోతారు. మొత్తంగా మిగిలిన వారి మాదిరి ఎక్కువ యాక్సిస్ ఇవ్వకుండా.. లిమిటెడ్ ఎడిషన్ మాదిరి ఆయన.. అరుదుగా కలుస్తుంటారు.
పవర్ లో ఉన్నప్పుడు ఈ తరహా తీరు అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయానికి దారి తీసిన ముఖ్య కారణాల్లో బయటకు రాకపోవటం..కలవకపోవటం.. అహంకారం ఎక్కువైనట్లుగా జరిగిన ప్రచారం ఆయన ఓటమికి కారణమైందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. నిజానికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు.. పార్టీ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పుడు పార్టీ నేతల్లోనూ.. క్యాడర్ లోనూ జోష్ తీసుకురావటానికి భారీ కార్యక్రమాల ఏర్పాటుకు మించింది ఇంకేం ఉంటుంది?
అదేం సిత్రమో కానీ కేసీఆర్ మాత్రం ఆ తరహా కార్యక్రమాల నిర్వహణ విషయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రోజు పార్టీ ప్లీనరీ నిర్వహించాల్సి ఉంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించటానికి బదులుగా.. కేవలం ఆహ్వానం ఉన్న వారు మాత్రమే ప్లీనరీకి హజారు కావాలన్న హుకుం జారీ చేశారు. ఈ తరహా ప్రకటనలు నేతలు.. క్యాడర్ మనో స్థైర్యాన్ని దెబ్బ తీసేలా చేస్తుందని చెప్పాలి. ఇక్కడే చంద్రబాబు తీరును ప్రస్తావించాల్సి ఉంటుంది.
పార్టీ ప్రతికూలతను ఎదుర్కొంటున్నప్పుడు..అధికారంలో లేని గడ్డు పరిస్థితుల్లో భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించటం చంద్రబాబులో కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. పార్టీ వ్యవస్థాపక దినోత్సవమైన మహానాడును ఆయన తూచా తప్పకుండా నిర్వహిస్తుంటారు. ఇలాంటివి పార్టీ నేతల్లోనూ.. క్యాడర్ లోనూ కొత్త ఉత్సామాన్ని ఇవ్వటంతోపాటు.. రాజకీయ ప్రత్యర్థులకు తమ బలాన్ని చూపే అవకాశంగా చెప్పొచ్చు.
కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కేసీఆర్ అండ్ కో అందుకు సిద్ధంగా లేని పరిస్థితి. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం వేళ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని పార్టీ స్పష్టం చేసింది. కేవలం రాష్ట్ర స్థాయి ప్రతినిధుల భేటీని మాత్రమే నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన కేటీఆర్.. మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్లీనరీని వాయిదా వేసినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పెట్టిందే వేసవిలో అయినప్పడు ఎంతడలు ఉండకుండా ఎప్పుడు ఉంది? అన్న ప్ర్రశ్నతో పాటు.. నిజంగానే ఎండ తీవ్రత మీద అంత ఆందోళన ఉంటే.. ప్లీనరీని రద్దు చేయకుండానే.. ఇండోర్ స్టేడియం లోనో.. హెచ్ ఐసీసీలో కానీ పెద్ద ఎత్తున నిర్వహించొచ్చు.
కాదంటే.. భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటం ద్వారా ఎండ కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించేలా చేయాలే తప్పించి.. ప్లీనరీని ఎత్తేయకూడదు. కానీ.. ప్లీనరీని భారీగా నిర్వహించటం మానేశారు సరే.. నిర్వహించే కార్యక్రమం ఏదైనా అందరూ పాల్గొనేలా ఉండాలి. అంతే తప్పించి.. ఆహ్వానాలు పంపినోళ్లు మాత్రమే రావాలన్న కట్టడి పార్టీకి మేలు చేయదన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. గులాబీ బాస్ మనసులో ఏమున్నట్లు?