కేసీఆర్ లోని బడబాగ్ని బద్దలు...జగిత్యాల నుంచే జగడం !
కేసీఆర్ కి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్ధి. అదే విధంగా కాంగ్రెస్ లో దశాబ్దాలుగా ఉన్న జీవన్ రెడ్డి రేవంత్ తీరుని అందులో ఉంటూ అనేక ఏళ్ళుగా వ్యతిరేకిస్తున్నారు.;
కేసీఆర్ ని రాజకీయ వ్యూహకర్త అంటారు. ఆయన మౌనంగా ఉన్నా అది కూడా వ్యూహమే. అదే పనిగా మాట్లాడినా అది కూడా రాజకీయ సమరమే. అలా తన కత్తికి రెండు వైపులా పదును ఉందని చాటి చెప్పే నాయకుడు కేసీఆర్ జగిత్యాల నుంచి గర్జించబోతున్నారు. చాలా కాలం తరువాత ఒక భారీ బహిరంగ సభను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే కేసీఆర్ ఇలాంటి సభలో మాట్లాడి ఏడాది అయింది. గత ఏడాది పార్టీ వార్షికోత్సవాల తరువాత మధ్యలో ఒకసారి మీడియా మీట్ తప్పించి కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు, కేరాఫ్ ఫాం హౌజ్ అన్నట్లుగానే ఆయన రాజకీయం సాగిపోయింది.
జీవన్ రెడ్డి కోసం :
కేసీఆర్ సమకాలీనుడు దిగ్గజ నేత అయిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కోరిక మేరకు ఒక భారీ బహిరంగ సభను ఆయన సొంత ఇలాకాలోనే నిర్వహించేందుకు గులాబీ పార్టీ అంగీకరించింది. దాని ఫలితమే జగిత్యాలలో భారీ సభ. అంతే కాదు కేసీఆర్ సమక్షంలోనే తాను గులాబీ కండువా కప్పుకుంటాను అని జీవన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పెద్దాయనే తరలివచ్చి జీవన్ రెడ్డిని సాదరంగా బీఆర్ఎస్ లోకి ఆహ్వానించబోతున్నారు. అలా జగిత్యాల సభకు రాజకీయంగా ఎంతో విశేషం ఏర్పడుతోంది.
ఇద్దరి టార్గెట్ ఒక్కరే :
కేసీఆర్ కి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్ధి. అదే విధంగా కాంగ్రెస్ లో దశాబ్దాలుగా ఉన్న జీవన్ రెడ్డి రేవంత్ తీరుని అందులో ఉంటూ అనేక ఏళ్ళుగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఇక ఉండలేక ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ ఎస్ లో చేరుతున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో అటు కేసీఆర్ ఇటు జీవన్ రెడ్డి ఇద్దరూ బద్ధ ప్రత్యర్థిగానే భావిస్తున్నారు. అలాంటి ఇద్దరు దిగ్గజ నేతలు ఒక్కటై ఒకే వేదిక మీదకు చేరి రేవంత్ రెడ్డి మీద గట్టిగా మాట్లాడబోతున్నారు. ఇంకా చెప్పాలీ అంటే గర్జించబోతున్నారు అని అంటున్నారు.
నిప్పులే కురిపిస్తారా :
మాటల మరాఠీగా పేరు గడించిన కేసీఆర్ జగిత్యాల సభ నుంచి నిప్పులే కురిపిస్తారు అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన అనేక అంశాలను సైతం తన స్పీచ్ లో క్రోడీకరించి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయన బలంగా గురి పెట్టబోతున్నారు. ఇక ఈ సభ ద్వారా కేసీఆర్ కొన్ని లక్ష్యాలను సాధించబోతున్నారు అని అంటున్నారు. ఒకటి బీఆర్ఎస్ బలంగా ఉందని చాటే యత్నం. జీవన్ రెడ్డి చేరిక ఆరంభం మాత్రమే అని రానున్న రోజులలో మరింత మంది చేరుతారు అన్నది క్యాడర్ కి సందేశం ఇవ్వడం ద్వారా వారిలో ఆశావహ దృక్పధం నింపడం. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి సవాల్ విసరడం. బీఆర్ఎస్ మళ్ళీ లేస్తుందని అధికారం అందుకుంటుందని స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నం చేడం. ఇక తెలంగాణాలో ప్రజలకు బీఆర్ఎస్ ఒక బలమైన ఆల్టర్నేషన్ గా ఉందని కాంగ్రెస్ కి అసలైన ప్రత్యర్ధి బీఆర్ఎస్ అన్న సంకేతాన్ని అందించడం ఇలా అనేక రకాలైన లక్ష్యాలను పెట్టుకుని మరీ కేసీఆర్ ప్రసంగం ఉంటుందని అంటున్నారు.
రూట్ మ్యాప్ రెడీ :
జగిత్యాల సభ అన్నది ఒక విధంగా బీఆర్ ఎస్ ఆవిర్భావ సభ లాంటిదే అంటున్నారు. ఈ సభ తరువాత వేరేగా అంతటి సభను నిర్వహించరని 27న జరిగేది పార్టీ ప్రతినిధుల సభ మాత్రమే అంటున్నారు. దాంతో రానున్న రెండున్నరేళ్ళలో బీఆర్ ఎస్ పోరాటానికి సంబంధించిన రూట్ మ్యాప్ ని కూడా వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకాలం మౌనంగా ఉన్న కేసీఆర్ లో రగులుతున బడబాగ్ని బద్ధలు అయ్యే వేదికగా కూడా జగిత్యాల సభ అంటున్నారు. ఇక మీదట జగడమే అని కాంగ్రెస్ సర్కార్ ని సవాల్ చేసేలా ఈ మీటింగ్ సాగుతుందని చెబుతున్నారు. చూడాలి మరి.