కోర్టు ఏం చెబుతుందో చూద్దాం: కేసీఆర్‌పై సీఎం రేవంత్
ఈ పిటిషన్లను బుధవారం సాయంత్రం హైకోర్టులో దాఖలు చేయగా.. గురువారం ఉదయం రిజిస్ట్రీ వీటికి నెంబర్లు కేటాయించారు.;
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిని నిశితంగా గమనించాలని, ఆయన ఎలాంటి అడుగులు వేస్తున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అనే విషయాలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదిక ను సవాల్ చేస్తూ.. మాజీ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ సహా.. అప్పటి జలవనరులశాఖ మంత్రి హరీష్‌రావులు ప్రత్యేకంగా వేర్వేరు పిటిషన్లు వేశారు. అసలు ఘోష్ కమిషనే రాంగ్ అన్నది పిటిషన్లలో వారు పేర్కొన్న కీలక విషయం.
ఈ పిటిషన్లను బుధవారం సాయంత్రం హైకోర్టులో దాఖలు చేయగా.. గురువారం ఉదయం రిజిస్ట్రీ వీటికి నెంబర్లు కేటాయించారు. అనంతరం.. సాయంత్రం ఈ పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేపడుతుందని రిజిస్ట్రీ ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై నిశితంగా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి లీగల్ టీంకు సూచించినట్టు సమాచారం. ''ఆయనకు ఉన్న స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. మీరు నిశితంగా గమనించండి. హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందో.. ఎలాంటి ఆదేశాలు చేస్తుందో.. అసలు ఏం చెబుతుందో కూడా వినండి. తర్వాత.. మనం ఒక నిర్ణయానికి వద్దాం.'' అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్టు సమాచారం.
అయితే.. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికే కొట్టి వేయాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును కోరడం గమనార్హం. తమ విజ్ఞాపనలు, విన్నపాలను పరిగణనలోకి తీసుకోకుండా.. రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగానే ఈ కమిషన్ విచారణ సాగిందన్నది ఆయన పేర్కొన్న విషయం. అంతకాదు.. విధానపరమైన నిర్ణయాలను సమీక్షించే అధికారం కోర్టులకు కూడా లేనప్పుడు.. కమిషన్‌కు ఎలా ఉంటుందని కూడా ప్రత్యేక ప్రశ్నను కేసీఆర్ లేవనెత్తారు. ఈ పరిణామాల క్రమంలో హైకోర్టు వ్యవహరించే తీరు, అసలు కమిషన్ రిపోర్టుపై ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుంది..? అనేవి ఆసక్తిగా మారాయి.
నిర్ణయం తేడా కొడితే!
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను సంక్షిప్తీకరించి 65 పేజీల్లో రూపొందించిన నివేదికను సభలో ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి అన్నీ సమా యత్తం కూడా చేసుకుంటున్నారు. తద్వారా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వ్యవహరించిన తీరును సభాముఖంగానే తెలంగాణ సమాజానికి వివరించాలన్నది ఆయన ప్రయత్నం. అయితే.. ఇప్పుడు హైకోర్టులో అసలు కమిషన్ రిపోర్టునే రద్దు చేయాలని కేసీఆర్ ప్రధానంగా కోరడం.. దీనికి హైకోర్టు కనుక సానుకూలంగా స్పందిస్తే.. రేవంత్ నిర్ణయం తేడా కొడుతుంది. అయినప్పటికీ.. వేరే రూపంలో దీనిపై చర్చ పెట్టే దిశగా కూడా ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.