బర్త్ డే వేళ చంద్రబాబుకు డిస్కౌంట్ ఇవ్వని గులాబీ బాస్
గులాబీ బాస్ కేసీఆర్ మాట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మిగిలిన రాజకీయ అధినేతలకు భిన్నంగా ఆయన శైలి ఉంటుంది.;
గులాబీ బాస్ కేసీఆర్ మాట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మిగిలిన రాజకీయ అధినేతలకు భిన్నంగా ఆయన శైలి ఉంటుంది. ప్రజల్లో ఉండాల్సిన నాయకుడు.. తనకు నచ్చినప్పుడు.. తన వ్యూహానికి తగ్గట్లు మాత్రమే బయటకు రావటం తప్పించి..మిగిలిన వేళలో కంటికి కనిపించని తత్త్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఈ సూత్రానికి భిన్నంగా కేసీఆర్ తీరు కనిపిస్తూ ఉంటుంది. శారీరక కష్టం కంటే మానసిక కష్టానికే కేసీఆర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారన్న విషయం ఆయన తీరును చూస్తే అర్థమవుతుంది.
ఉద్యమ నాయకుడిగా ఏళ్లకు ఏళ్లుగా వ్యవహరించినా..ముఖ్యమంత్రిగా పదేళ్లు పాలించినా.. ఏ దశలో అయినా.. ఆయన తీరు ఒకేలా ఉంటుంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్న రాజకీయ నాయకుడి ప్రాథమిక లక్షణానికి దూరంగా కేసీఆర్ ఉంటారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా.. ప్రజలకు దూరంగా ఉంటూ.. తనకు నచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తే.. వారికి ప్రజల్లో పెద్దగా ఆదరణ ఉండదు.
అందుకు భిన్నంగా కేసీఆర్ తీరు ఉండటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. ఎంత కాలం ప్రజలకు దూరంగా ఉన్నా.. ఒక్కసారి ప్రజల్లోకి వచ్చినంతనే.. కనెక్టు కావటం.. తన మాటల ప్రభావంలో పడిపోయేలా చేసే తత్త్వం ఆయనకు మాత్రమే సొంతమని చెప్పాలి. అప్పటివరకు కేసీఆర్ మీద ఉండే కంప్లైంట్లు మొత్తం.. ఆయన నోటి నుంచి వచ్చే నాలుగు మాటల తర్వాత కనిపించకుండా పోతుంటాయి. ఈ తరహా మేజిక్ ను మరోసారి ప్రదర్శించారు తాజాగా నిర్వహించిన జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభతో.
ఈ సభలో మాట్లాడిన కేసీఆర్.. ఎప్పటిలానే భావోద్వేగాల్ని టచ్ చేసేలా మాట్లాడారు. తన అమ్ములపొదిలో ఆయుదమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని..ఆ సందర్భంగా సమైక్య రాష్ట్ర పాలకుల్ని తన పదునైన మాటల్ని సంధించారు. పనిలో పని ఎప్పటిలానే చంద్రబాబు మీదా విమర్శలు గుప్పించారు. సమైక్య రాష్ట్రంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చీల్చి చెండాడారు. ఇక్కడ ప్రశ్న ఏమంటే.. రాష్ట్రం వచ్చి పుష్కరం దాటేసింది. పదేళ్లు నాన్ స్టాప్ గా అధికారాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాను కోరుకున్నట్లుగా చేసేందుకు అవసరమైన సమయాన్నితెలంగాణ ప్రజలు ఇచ్చారు.
అలాంటప్పుడు.. అందులో సక్సెస్ కాలేక.. తాను తీసుుకొచ్చిన తెలంగాణలో.. తనను తెలంగాణ ప్రజలు తిరస్కరించిన వేళ.. అందుకు కారణాల మీద వర్కువుట్ చేసే కన్నా..తన తప్పుల్ని పక్కన పెట్టేసి.. సమైక్య రాష్ట్రంలోని పాలకుల తప్పులను ఎత్తి చూపటం ద్వారా ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలన్న తీరు కేసీఆర్ మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.
నిజానికి సమైక్య పాలకుల తీరు.. వారేం చేశారు? ఏం చేయలేదు? లాంటివి ముగిసిన చరిత్ర. అయినప్పటికీ.. దాన్నే పట్టుకొని ముందుకు పోతున్న తీరు చూస్తే.. కేసీఆర్ రాజకీయం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. నిన్నటి జగిత్యాల సభ సందర్భంగా చంద్రబాబును తీవ్రంగా విమర్శించటం బాగానే ఉన్నా.. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కూడా ఆయన్ను విమర్శల నుంచి మినహాయింపు ఇవ్వకపోవటం గమనార్హం.
ఇటీవల కాలంలో పేరున్న ప్రముఖ నేతలు సైతం తమ రాజకీయ శత్రుత్వాన్ని పక్కన పెట్టి పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పటం కనిపిస్తుంది. ఆ పని కేసీఆర్ చేయాలని ఆశించటం తప్పే అవుతుుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకున్న ఫర్లేదు.. పుట్టినరోజున కాస్తంత విమర్శల వేడిని తగ్గిస్తే ఏమవుతుంది? అన్నది ప్రశ్న. కేసీఆర్ తీరు చూస్తే.. ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తన రాజకీయ ఎజెండాకు అనుగుణంగానే తప్పించి.. భావోద్వేగ మాటలు మాట్లాడే గులాబీ బాస్.. రాజకీయంగా వ్యక్తిగత సంబంధాల విషయంలో ఆ తీరును ప్రదర్శించరనన విషయం అర్థమవుతుంది. ఈ కారణంగానే.. చంద్రబాబుకు బర్త్ డే డిస్కౌంట్ ను గులాబీ బాస్ ఇవ్వలేదని చెప్పక తప్పదు.