బనకచర్లను టేకప్ చేసిన గులాబీ బాస్.. ఇక రచ్చ రచ్చేనా?
ఇంతకాలం సీఎం రేవంత్ కోరుకున్నా.. స్పందించని కేసీఆర్.. తాజాగా బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు చేయాలంటూ పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్.. హరీశ్ రావుకు దిశానిర్దేశం చేయటం.. అందుకు అవసరమైన పోరాటాల్ని ఉద్ధ్రతం చేయాలని చెప్పినట్లుగా చెబుతున్నారు.;
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావటం ద్వారా తెలంగాణకు హ్యాట్రిక్ సీఎంగా మారి.. తిరుగులేని రికార్డును తన పేరు మీద క్రియేట్ చేసుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ ఎంతో తపించారు. తెలంగాణ పితామహుడిగా ఆయన నెత్తిన పెట్టుకున్న తెలంగాణ ప్రజలు.. ఆయన పదేళ్ల పాలనపై విసుగుతో ప్రత్యామ్నాయం వైపు చూడటంతో.. కేసీఆర్ సారు ఫామ్ హౌస్ కే పరిమితం కావాల్సి వచ్చింది. మిగిలిన రాజకీయ అధినేతల తీరుకు భిన్నంగా.. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండకుండా.. తన పరివారంతో పార్టీని నడుపుతున్న వైనం తెలిసిందే.
తాను ఫామ్ హౌస్ కే పరిమితం అవుతూ.. పార్టీ ముఖ్యనేతలైన కేటీఆర్.. హరీశ్ రావు అండ్ కోతో పార్టీ కార్యక్రమాల్ని చేపట్టారు. పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. సమస్యలపై మాట్లాడాలని కోరటం.. దానికి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం తెలిసిందే. సీఎం రేవంత్ మాటలకు కేటీఆర్.. హరీశ్ రావులు స్పందిస్తూ.. సీఎంకు తాము సరిపోతామని.. తమ అధినేత అవసరం లేదని చెప్పినా.. అదంతా ఆకట్టుకున్నది లేదు.
ఓటమి తర్వాత ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యల మీదా.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని కేసీఆర్ సారు నిలదీయాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నా.. అదేమీ సాకారం కాలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల బనకచర్ల ప్రాజెక్టు మీద మొదలైన రచ్చ మీదా ఇప్పటివరకు మౌనంగా ఉన్న కేసీఆర్.. తాజాగా అందుకు పుల్ స్టాప్ పెడుతూ.. బనకచర్ల ప్రాజెక్టును ప్రభుత్వం ఆపేలా ఒత్తిడి తెచ్చే కార్యాచరణను సిద్ధం చేయటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.
ఇంతకాలం సీఎం రేవంత్ కోరుకున్నా.. స్పందించని కేసీఆర్.. తాజాగా బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు చేయాలంటూ పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్.. హరీశ్ రావుకు దిశానిర్దేశం చేయటం.. అందుకు అవసరమైన పోరాటాల్ని ఉద్ధ్రతం చేయాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం.. రాజీ లేని రీతిలో పోరాటాన్ని షురూ చేయాలని..తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసేలా ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును సిద్ధం చేసిందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న విషయాన్ని ఆయన చెప్పినట్లుగా చెబుతున్నారు.
బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేసేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని చెబుతూ.. అందుకు ఏమేం చేయాలో కేటీఆర్.. హరీశ్ రావుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండేళ్లు ఏ అంశం మీదా ఇంత క్లియర్ గా ఆదేశాలు ఇవ్వని కేసీఆర్.. అందుకు భిన్నంగా బనకచర్ల ప్రాజెక్టుపై పోరు ఇష్యూను టేకప్ చేయటమంటే.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచేలా ప్లాన్ డిసైడ్ చేశారని చెప్పాలి. ఇంతకాలం సీఎం రేవంత్ అడగటమే కానీ.. కేసీఆర్ స్పందించింది లేదు. అందుకుభిన్నంగా కేసీఆర్ స్వయంగా బనకచర్ల ప్రాజెక్టును ఆపేలా చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేయటంతో.. సీఎం రేవంత్ కొత్త పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాలి.
ఏయే అంశాల్ని టేకప్ చేయాలి? ఎలా ప్రజల్లోకి వెళ్లాలన్న దానిపై కేటీఆర్.. హరీశ్ రావులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా చెబుతున్నారు. అందులో కీలకమైన పాయింట్లను చూస్తే..
- బనకచర్లతో తెలంగాణ రైతులకు శాశ్వత అన్యాయం జరుగుతుంది. రేవంత్ సర్కారు దుర్మార్గపు వైఖరిని ఎండగట్టాలి.
- చంద్రబాబు.. మోడీ ప్రయోజనాల్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ తహతహలాడుతున్నారు.
- కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి.. వానాకాలం నాట్లు అయిపోతున్నా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలి.
- ప్రభుత్వం వెంటనే కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద గోదావరి జిలాల్ని ఎత్తిపోయాలి.
- పంప్ లను ఆన్ చేయాలి. చెరువులు.. కుంటలు.. రిజర్వాయర్లను నింపాలి.
- కాంగ్రెస్.. బీజేపీలు పరస్పర విమర్శలతో కాలయాపన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని గాలికి వదిలేస్తున్నాయి. ఈ రెండు పార్టీల తీరును గట్టిగా నిలదీయాలి.
ఇలా.. పలు అంశాలపై పార్టీ శ్రేణులు గళం విప్పాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి.తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే విషయంలో కేసీఆర్ కున్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రా వ్యతిరేక ఆయుధాన్ని చేపట్టిన కేసీఆర్ మరసారి తన మేజిక్ ను రిపీట్ చేస్తారా? తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ ఆగ్గిని రగులుస్తారా? తాను అనుకున్నట్లుగా బనకచర్ల ప్రాజెక్టు పేరుతో మళ్లీ తన సత్తా చాటుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నలుగా చెప్పాలి. తన బలమైన సెంటిమెంట్ అస్త్రాన్ని అందిపుచ్చుకొని రేవంత్ సర్కారు మీద యుద్ధానికి శంఖారావం పూరించిన వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరమని చెప్పక తప్పదు.