లేడీ బాస్‌లు: తెలంగాణ సమాజం ఆశీర్వదిస్తుందా?
తెలంగాణ సమాజంలో మహిళ నాయకులు ప్రాతినిధ్యం వహించిన పార్టీలకు పెద్దగా ఆదరణ లేదన్నది గత చరిత్ర చెప్పిన ప్రధాన విషయం.;
తెలంగాణ సమాజంలో మహిళ నాయకులు ప్రాతినిధ్యం వహించిన పార్టీలకు పెద్దగా ఆదరణ లేదన్నది గత చరిత్ర చెప్పిన ప్రధాన విషయం. మొదట్లో టిఆర్ఎస్ పార్టీని పెట్టుకుని కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటిలో ప్రధానంగా `తల్లి తెలంగాణ` కీలకంగా మారింది. ఆ పార్టీ అధ్యక్షురాలుగా సీనియర్ నటి విజయశాంతి వ్యవహరించారు. అయితే ఆ పార్టీ ప్రజల్లో ప్రభావం చూపించలేకపోయింది. ప్రజలు ఒకరకంగా ఆ పార్టీని ఆదరించలేదు. వ్యక్తిగతంగా తల్లి తెలంగాణ తరఫున ఒకే ఒక్కసారి విజయశాంతి విజయం దక్కించుకున్నప్పటికీ ఆ తర్వాత ఎవరు ఆ పార్టీ తరపున గెలిచిన సందర్భం లేదు.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భాలు కూడా లేవు. దీంతో తల్లి తెలంగాణ వ్యవహారం అటకెక్కింది. అనంతరం దీనిని బీఆర్ఎస్‌లో విలీనం చేసి ఆమె బీఆర్ఎస్ నాయకురాలుగా మరోసారి మెదక్ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం వివిధ పార్టీలు మారారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన జగన్ సోదరి వైయస్ షర్మిల కూడా వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఒకరకంగా ఆమె పాదయాత్ర చేశారు. ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నించారు.
కేసీఆర్ హయాంలో పలు ఉద్యమాలకు కూడా షర్మిల శ్రీకారం చుట్టారు. నిరుద్యోగ సమస్య మీద అదేవిధంగా రైతుల సమస్య మీద, ధాన్యం కొనుగోలు విషయంలో కూడా షర్మిల పలు ఉద్యమాలు చేశారు. అయినా తెలంగాణ ప్రజలు ఆమెను పెద్దగా ఆదరించలేదు. అంతే కాదు పార్టీలో కూడా కీలక నాయకులు అంటూ ఎవరు చేరింది లేదు. అంటే ఒక రకంగా అటు విజయశాంతి ఇటు షర్మిల ఇద్దరు కూడా చాలా ఆశలతో సొంత పార్టీలు పెట్టుకున్నప్పటికీ విజయం దక్కించుకోలేకపోయారు. అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని కూడా ఆకట్టుకోలేకపోయారు.
ఇక ఇప్పుడు కేసిఆర్ కుమార్తెగా కవిత రాజకీయ ప్రవేశం విభిన్నంగా చేస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థతో తెలంగాణ సమాజానికి చేరువైన కవిత ఇప్పుడు అదే పేరుతో పార్టీని స్థాపించనున్నారన్న చర్చ కూడా నడుస్తుంది. ఈనెల చివరి వారంలో ఆమె ప్రజలను కలుసుకునేందుకు జన జాగృతి పేరుతో యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించనున్నారు. అయితే, విజయశాంతికి- షర్మిలకు- కవితకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. తండ్రి వేసిన పునాదులపై నిలబడి ప్రజాప్రతినిధిగా విజయం దక్కించుకున్న కవిత.. ఇటీవల కాలంలో తండ్రితో విభేదించక పోయినా పార్టీ నాయకులతో విభేదించి బయటికి వచ్చారు.
తండ్రిని కూడా ఇప్పుడు ఆమె పరోక్షంగా విభేదించారు. తన తండ్రి ఫోటో తనకు అవసరం లేదని చెప్పారు. ఇలాంటి సమయంలో ఇప్పటివరకు కేసీఆర్ కుమార్తెగా ఆమె తెచ్చుకున్న గుర్తింపు.. ఆమె తెచ్చుకున్న పేరు.. ఇప్పుడు ఒంటరిగా నిలబెట్టుకుంటారా.. ఒంటరిగా ఆమె తన ప్రస్తానాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారా.. అనేది ప్రశ్న. తెలంగాణ జాగృతి రేపు పార్టీగా అవతరిస్తే ఆమెకు ఎంతమంది మద్దతుగా నిలుస్తారు? ఏ సామాజిక వర్గం ఓట్లను ఆమె దక్కించుకోగలుగుతారు? అనేది ఆసక్తిగా మారింది.
మహిళా నాయకులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని తెలంగాణ సమాజంలో కవిత ప్రస్థానం ఈ విధానాన్ని సమూలంగా మార్చి.. మహిళా ప్రాతినిధ్యంలో ఒక పార్టీని పుంజుకునేలా ఏ మేరకు ఆమె సక్సెస్ అవుతారన్నది చూడాలి. ఈ విషయం ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి ఏం జరుగుతుందో అనేది చూడాలి.