షర్మిలను చిన్న గీత చేసిన కవిత !

వెనకటికి మహామంత్రి తిమ్మరుసును ఒక పెద్ద గీతను చిన్నగా చూపించడం ఎలా అని ఎవరో అడిగితే దాని కంటే పెద్ద గీతను గీయడమే అని అద్భుతమైన సలహా ఇచ్చారుట.;

Update: 2025-05-26 03:00 GMT

వెనకటికి మహామంత్రి తిమ్మరుసును ఒక పెద్ద గీతను చిన్నగా చూపించడం ఎలా అని ఎవరో అడిగితే దాని కంటే పెద్ద గీతను గీయడమే అని అద్భుతమైన సలహా ఇచ్చారుట. తిమ్మరుసు మహా మంత్రి. పైగా చాణక్యుడు మాదిరిగా వ్యవహరించే నేర్పు ఉన్న వారు. అందువల్ల ఆయన వ్యూహాలు ఆలోచనలు పక్కాగా ఆధునిక రాజకీయాల్లో రాజకీయ నేతలు ఫాలో అవుతూంటారు.

ఇదిలా ఉంటే సొంత చెల్లెలుకు అన్యాయం చేశారని రోడ్డున పడేశారు అని ఇప్పటిదాకా ఆంధ్రా రాజకీయాల్లో జగన్ చుట్టూ ఒక సెంటిమెంట్ ఎమోషన్ ని క్రియేట్ చేసి రాజకీయంగా టార్గెట్ చేసి విపక్షాలు బాణాలు వేస్తూ వస్తున్నాయి. షర్మిల అయితే అదే తన రాజకీయ ఆస్తిగా అస్తిత్వంగా మార్చుకుని జగన్ ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంతగానూ పెడుతున్నారు. జగన్ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి కూడా షర్మిల కాంగ్రెస్ లో నాయకత్వం వహించి సొంత చెల్లెలుకు అన్యాయం చేశారు అన్న సెంటిమెంట్ ని రగిలించడమే కారణం అని కూడా విశ్లేషకులు చెబుతారు.

అయితే జగన్ కి ఇక మీద ఆ బాధా బెడదా లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఇదే తెలుగు నాట తెలంగాణాలో మరో చెల్లెలు ఇంతకంటే ఎక్కువగా రాజకీయ మనోవేదన అనుభవిస్తున్నారు. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణా తెచ్చిన యోధుడు కేసీఆర్ కుమార్తె. ఆమె లేఖ సంధించి మరీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఏకరువు పెట్టారు. దాంతో కవిత రాజకీయ రూట్ ఏమిటో ఆమెకు బీఆర్ఎస్ లో ప్లేస్ ఏమిటో కూడా అంతా గమనిస్తున్నారు.

ఇక కవిత విషయానికి వస్తే ఆమె మంచి వక్త. నాయకత్వ పటిమ ఉన్న నాయకురాలు. అన్నింటికీ మించి ఫైర్ బ్రాండ్. అలాంటి మహిళా నేతకే సొంత పార్టీలో తండ్రి అధినాయకుడుగా ఉండగానే ఇబ్బందులు ఉన్నాయంటే ఇక ఏపీలో జగన్ విషయంలో షర్మిలకు నిజంగా అన్యాయం జరిగినా అది చాలా చిన్న ఇష్యూగానే మారిపోతుంది అని అంటున్నారు.

జగన్ వైసీపీలో షర్మిల పాత్ర పరిమిత స్థాయిలో ఉంది. జగన్ రెక్కల కష్టం ఆయన పదహారు నెలల జైలు జీవితం నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఇలా ఆయన చుట్టూనే వైసీపీ అల్లుకుని ఉంది అన్నది ఎవరైనా చెబుతారు. ఇక పార్టీకి జగన్ సోదరిగా షర్మిల చేసిన రాజకీయ ప్రచారం కానీ ఇతరత్రా కానీ చూసుకున్నపుడు ఆమెకు ఏ పదవీ ఇవ్వలేదు అన్నది అంతా అంటూ వచ్చారు. మరి కవిత 2005 నుంచి పార్టీలో ఉన్నా ఆమెకే సరైన అవకాశాలు దక్కలేదు అన్న చర్చ రేగుతున్న వేళ షర్మిలతో పోలిక పెడితే కవిత మీదనే సానుభూతి వెళ్తోంది అని అంటున్నారు.

పైగా కేసీఅర్ తన రాజకీయ వారసత్వం కేటీయార్ కే వెళ్ళాలని కోరుకుంటున్నారు అని ప్రచారం సాగుతున్న నేపథ్యం ఉంది. మరో వైపు చూస్తే 2009లో వైఎస్సార్ కూడా తన రాజకీయ వారసుడిగా జగన్ నే జనం ముందుకు తెచ్చి కడప ఎంపీగా గెలిపించుకున్నారని గుర్తు చేస్తున్నారు దానిని జగన్ మరింతగా తన శ్రమను జత కలిపి ఈ రోజుకు ఈ స్థితికి చేరుకున్నారు అని అంటున్నారు.

దాంతో జగన్ సొంత పార్టీలో చెల్లెమ్మకు అన్యాయం చేశారని అన్నా కవిత ఎపిసోడ్ ముందు అది అంతలా ఎక్కేది కాదని అంటున్నారు. ఉద్యమ నాయకురాలిగా తెలంగాణా జాగృతి సమితి ప్రెసిడెంట్ గా కవిత చేసిన పోరాటాలు కూడా అంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక తెలంగాణా చూస్తే రాజకీయంగా చైతన్యవంతమైన గడ్డగా చెబుతారు. అక్కడే కవిత ఇబ్బందులు పడుతూంటే ఏపీలో షర్మిల విషయంలో జగన్ చేసిన అన్యాయం ఏమిటి పాపం ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఇంకో వైపు చూస్తే రాజకీయాల్లో చెల్లెళ్ళకు పరిమితమైన స్థానం ఉంటుందని పొరుగున ఉన్న డీఎంకేలో కూడా రుజువు అయింది అని అంటున్నారు. అక్కడ స్టాలిన్ తన చెల్లెలు కనిమోళికి ఎంపీ సీటు మాత్రమే ఇచ్చారు. వారసుడిగా కుమారుడిని ప్రమోట్ చేస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా ఇది అంతటా జరిగే సహజసిద్ధమైన ప్రక్రియగానే చూస్తున్నారు.

మొత్తం మీద ఏపీలో ఇప్పటికే సొంత అజెండాతో కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీని వెనక్కి నెట్టి షర్మిల రాజకీయాలు చేస్తోంది అన్న చర్చ ఉంది. అంతే కాదు 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత సెంటిమెంట్లు ఎమోషన్లూ అన్నీ కూడా వాడసిన అస్త్రాలు అయిపోయాయి. ఇపుడు తెలంగాణాలో కవిత రాజకీయం పైనే అంతా ఆసక్తి ఉంది. దాంతో ఆ పెద్ద గీత ముందు ఏపీలో షర్మిల పాలిటిక్స్ చిన్న గీత అవుతోంది అని అంటున్నారు

Tags:    

Similar News