కవిత యాత్ర...కేసీఆర్ కాదు ఆయనతో !

ఇక కవిత తన రాష్ట్రవ్యాప్త యాత్రలో ఎక్కడా బీఆర్ఎస్ రంగు రుచి వాసన లేకుండా జాగ్రత్త పడుతున్నారు అని అంటున్నారు.;

Update: 2025-10-14 19:28 GMT

తెలంగాణ రాజకీయాల్లో మరో కుదుపుగానే దీనిని చూడాల్సి ఉంటుంది. ఎంతో సున్నితమైన సెంటిమెంట్ కి పెట్టింది పేరు తెలంగాణా అన్నది అందరికీ తెలిసిందే. భావోద్వేగాలకు పెట్టింది పేరుగా పోరు గడ్డగా తెలంగాణాకు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉంది. బిడ్డా అని అప్యాయంగా పిలిచి అందరినీ హత్తుకునే వారే శతృవుల మీద అంతే భీకరంగా కత్తులు దూస్తారు. అందుకే తెలంగాణా ఉద్యమం ఎపుడూ వసివాడకుండా అంతిమ లక్ష్యం సాధించింది.

కవిత సొంత ఎజెండా :

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి బయటకు వచ్చిన కవిత ఇపుడు సొంత అజెండాతో ముందుకు కదులుతున్నారు. ఆమె తన ఇమేజ్ ని బిల్డప్ చేసుకోవడంతో పాటు తెలంగాణాలో ఉన్న రాజకీయ సామాజిక ఆర్ధిక పరిస్థితులను అంచనా వేయడానికి ఒక భారీ రాష్ట్రవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర పూర్తి అయ్యేనాటికి రెండు విషయాలు స్పష్టం అవుతాయని అంటున్నారు. కవిత ఇమేజ్ ఏ మాత్రం ఉంది అన్నది ఒకటి అయితే తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం ఎలా ఉంది, ఏ వైపునకు సాగనుంది అన్నది కూడా అర్ధం అవుతుందని భావిస్తున్నారు.

జయశంకర్ పటంతో :

ఇక కవిత తన రాష్ట్రవ్యాప్త యాత్రలో ఎక్కడా బీఆర్ఎస్ రంగు రుచి వాసన లేకుండా జాగ్రత్త పడుతున్నారు అని అంటున్నారు. తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఅర్ ఫోటో లేకుండానే ఆమె ఈ యాత్రకు సిద్ధపడుతున్నారు. అదే సమయంలో తెలంగాణా మేధావిగా ఉద్యమానికి స్పూర్తిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటంతోనే ఆమె తన యాత్రను సాగించనున్నారు అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఇది ఆశ్చర్యకరమైనది అని అంటున్నారు. కేసీఅర్ పేరు మాట ఊసూ లేకుండా ఆయన బిడ్డ రాష్ట్రంలో పర్యటించడం అంటే ఇది ఒక సంచలనమే. అదే సమయంలో తెలంగాణా మలి విడత ఉద్యమంలో కేసీఆర్ కి ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఆయనకు అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ఆమె ఈ యాత్ర చేపట్టడం అంటే పూర్తిగా తెలంగాణా అస్తిత్వం కోసమే తన యాత్ర అని చాటి చెప్పడానికి అంటున్నారు.

వివిధ వర్గాలతో కలసి :

ఇదిలా ఉంటే కవిత వివిధ వర్గాలతో కలసి ఇప్పటికే చర్చలు జరిపారు. అంతే కాదు యూనివర్సిటీ విద్యార్ధులు మేధావులు వివిధ సామాజిక ఉద్యమ కారులతో పాటు అనేక ప్రజా సంఘాల నాయకులు తెలంగాణా ఉద్యమ కాలంలో చురుకుగా పనిచేసిన వారితో కూడా ఆమె చర్చలు జరిపారు అని అంటున్నారు. ఇక తన పర్యటనలో ఆమె విద్యార్ధులు మేధావులు వివిధ సమూహాలతో సమావేశాలు నిర్వహిస్తారు అని అంటున్నారు.

తెలంగాణా సాకారం తర్వాత :

తెలంగాణా రాష్ట్రం అన్నది ఒక కల. అది సాధించి పదకొండేళ్ళు పూర్తి అయ్యాయి. రెండు ప్రభుత్వాలను ప్రజలు చూశారు. మరి వారి ఆశలు ఎలా ఉన్నాయి, వారి ఆకాంక్షలు ఎలా ఉన్నాయి, వారికి రాష్ట్రంలో ఏ విధంగా అభ్యుదయం జరిగింది వంటివి కవిత ఈ సందర్భంగా ఆరా తీస్తారు అని అంటున్నారు. ప్రజల నాడిని పట్టుకుంటారని అంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ ఫోటో లేకుండా కవిత చేపడుతున్న ఈ యాత్రకు ఏ విధంగా స్పందన వస్తుందో ఏమిటి అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News