కవితను రిజెక్టు చేసిన మరో పార్టీ
ఒక పార్టీలో పేరున్న నేత ఏదైనా కారణంతో ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇతర పార్టీలు సదరు నేతను తమ పార్టీలో చేర్చుకోవటానికి ఆసక్తి చూపుతుంటాయి.;
ఒక పార్టీలో పేరున్న నేత ఏదైనా కారణంతో ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇతర పార్టీలు సదరు నేతను తమ పార్టీలో చేర్చుకోవటానికి ఆసక్తి చూపుతుంటాయి. ఒకవేళ కుదరకపోతే.. కామ్ గా ఉంటాయి. అందుకు భిన్నంగా ఒక నేతను తమ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఒకటి తర్వాత ఒకటి చొప్పున ప్రధాన పార్టీలు రెండు ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తెగా సుపరిచితమైన కవిత విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల కాలంలో పార్టీ మీదా.. పార్టీలోని కొందరు నేతల మీదా ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ సుప్రీం కం ఆమె తండ్రి కేసీఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకొని.. పార్టీ నుంచి సస్పెండ్ చేయటం తెలిసిందే. వేటు పడిన వేళ.. కవిత స్పందించటం.. బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు.. సంతోష్ లపై సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణ మీద ఆమె ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా.. కవితను తమ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకునేది లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో అడుగు పెట్టనిచ్చే ప్రసక్తి లేదని కుండబద్ధలు కొట్టేశారు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ రథసారధి మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కవితను తమ పార్టీలోకి చేర్చుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
ఆ మాటకు వస్తే కవితను మాత్రమేకాదు.. అవినీతి మరకలు ఉన్న కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరినీ పార్టీలోకి చేర్చుకోమని వెల్లడించారు. తాను చెప్పే మాటలకు పార్టీ అధినాయకత్వం (ఏఐసీసీ) నుంచి ఆదేశాలు ఉన్నట్లుగా చెప్పారు. రాష్ట్రాన్ని హరీశ్ రావు.. సంతోష్ రావులు ఎలా దోచుకున్నారో చెప్పి కవిత మంచిపని చేశారని.. అయితే.. ఇప్పుడు మాట్లాడుతున్న ఆమె.. అప్పట్లోనే మాట్లాడి ఉంటే సెల్యూట్ చేసే వాళ్లమన్న ఆయన.. పార్టీలోకి మాత్రం కవితను ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోలేమని తేల్చేశారు.
కవితను తమ పార్టీల్లో చేర్చుకోమని రెండు రోజుల వ్యవధిలో రెండు జాతీయ పార్టీలు (బీజేపీ..కాంగ్రెస్) స్పష్టం చేయటం చూస్తే.. కవితను తమ పార్టీల్లో చేర్చుకుంటే మైలేజీ కంటే డ్యామేజే ఎక్కువ అవుతుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పాలి. దీనికి తోడు పార్టీ మీద కొత్త తరహాలో యుద్ధాన్ని ప్రకటించిన కవిత వెనుక జాతీయ పార్టీలు ఉన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవితను తమ పార్టీల్లోకి రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పటం ద్వారా.. ఆమెకు తమ నుంచి ఎలాంటి మద్దతు లేదన్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేయటమే ప్రధాన లక్ష్యమని చెప్పక తప్పదు. తర్వాతి రోజుల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చే రాజకీయ విమర్శలను బలంగా ఎదుర్కొనేందుకు వీలుగా ముందే కవిత విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.