ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్.. హరీశ్ కు కొత్త పేరు

‘నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ దాదాపు వంద రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్య తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.;

Update: 2025-09-04 04:40 GMT

‘నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ దాదాపు వంద రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్య తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ అధినేత కం తన తండ్రికి రాసిన లేఖను కావాలనే కొందరు లీక్ చేశారని ఆమె మండిపడ్డారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో రెండు రోజుల క్రితం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ లైన్ దాటి పార్టీకి చెందిన కీలక నేతల మీద కవిత చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై వేటు వేసేందుకు కేసీఆర్ వెనుకాడరన్న విసయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే కవిత మీద వేటు పడటం.. ఈ నేపథ్యంలో తన పార్టీ పదవితో పాటు.. తనకున్న ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. ఎక్కు పెట్టిన వైనం చూస్తే.. మాజీ మంత్రి కం మేనబావ అయిన హరీశ్ రావు.. మరొకరు రాజ్యసభ సభ్యుడు సంతోష్ మీదనే ఆమె మాటల గురి మొత్తం ఉన్న విషయం అందరికి అర్థమవుతుంది.

గులాబీ పార్టీకి ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు మీద ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. హరీశ్ ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ అని ఎక్కెసం చేసేశారు. ఇక.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ మీద ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్న కారణాన్ని చూపి తనను సస్పెండ్ చేశారని.. ప్రజా సమస్యల మీద పోరాడితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయా? అన్నదిప్పుడు కవిత ప్రశ్న.

తన సంజాయిషీ తీసుకోకుండానే తనను నేరుగా ఉరి తీశారని.. ప్రజల వద్దకు వెళతానని.. తన తల్లితో మాట్లాడకుండా చేశారంటూ బాధను వ్యక్తం చేసిన కవిత.. గతానికి భిన్నంగా ఈసారి తన మాట తీరులో కాస్తా మార్పును తీసుకొచ్చారు. తాను.. తన తండ్రి.. తన సోదరుడు ఒక జట్టుగా ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో హరీశ్.. సంతోష్ లను వేరే జట్టుగా.. పార్టీకి ఎప్పుడైనా సమస్యే అన్న అంశాన్ని ప్రస్తావించారు.

ఈ సందర్భంగా రక్త సంబంధాన్ని ఆమె తెర మీదకు తీసుకొచ్చారు. ఎంత అన్నా.. ఎవరేం చెప్పినా.. తాను, తన తండ్రి.. తన అన్న ఒక్కటేనని ఆమె చెప్పారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే తమ బంధం పోదన్న ఆమె.. తనను టార్గెట్ చేసి పార్టీ నుంచి బయటకు పంపారని.. వారు కుట్ర చేసి తన తండ్రిని.. తన అన్నను మోసం చేసే అవకాశం ఉందంటూ మండిపడ్డారు. పార్టీకి ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావుకు ఆమె కొత్త పేరు పెట్టేశారు. హరీశ్ ను బబుల్ షూటర్ అంటూ ఆమె చేసిన విమర్శ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. హరీశ్.. సంతోష్ లకు ధనార్జన తప్పించి మరింకేమీ ఉండదని.. త్వరలోనే తన తండ్రిని.. సోదరుడ్ని పార్టీ నుంచి గెంటేస్తారంటూ ఆమె తన అంచనాను వెల్లడించారు. మొత్తంగా తన మాటలతో తన టార్గెట్ ఎవరన్న విషయాన్ని కవిత క్లియర్ గా చెప్పేశారు. మరి.. కవిత విరుచుకుపడిన హరీశ్.. సంతోష్ లు ఆమె చేసిన వ్యాఖ్యలపై ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News