కల్వకుంట్ల కవిత....రెడ్లను ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

తెలంగాణా రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వైఖరి ఆమె రాజకీయ ధోరణి ప్రత్యర్ధులను ఎంచుకునే విధానం అదే సమయంలో ఆమె చేస్తున్న విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి.

Update: 2026-08-31 17:36 GMT

తెలంగాణా రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వైఖరి ఆమె రాజకీయ ధోరణి ప్రత్యర్ధులను ఎంచుకునే విధానం అదే సమయంలో ఆమె చేస్తున్న విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆమె తన సొంత కష్టాలను జనంలో పెడుతూ కన్నీరు పెడుతున్నారు. ఆమె తనను బీఆర్ఎస్ ఎందుకు సస్పెండ్ చేసింది అని ప్రశ్నిస్తున్నారు. తండ్రి కేసీఆర్ కి తనకు మధ్య చిచ్చు పెట్టారంటూ కొందరు నేతల మీద విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకించి రెడ్లను ఆమె టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆమె ఎందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నారు అన్నదే ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

సోషల్ మీడియా కోసమా :

ఇదిలా ఉంటే కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో ప్రచారం కోసం మాట్లాడుతున్నారు అన్న చర్చ సాగుతోంది. ఆమె ఏమి మాట్లాడాలనుకుంటున్నారు, ఏమి మాట్లాడుతున్నారు అన్నది అర్థం కావడం లేదని అంటున్నారు. ఆమె మాటలు ఆమె చేస్తున్న వ్యాఖ్యల మీద బయట ఇదే డిస్కషన్ అవుతోంది. కవిత ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, కానీ ఆమె చేస్తున్న విమర్శలు కానీ రాజకీయ వ్యాఖ్యానాలు కానీ పరిణితి లేకుండానే చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆమె ఏ రోజు ఎవరిని టార్గెట్ చేస్తారో కూడా అర్థం కావడం లేదని అంటున్నారు. ఒక రోజు ఆమె హరీష్ రావు మీద ఘాటు అయిన విమర్శలు చేస్తారు. ఆ మరుసటి రోజు హరీష్ రావుని క్షమిస్తాను అంటారు, ఆ వెంటనే మరో నేత మీద మండిపడతారు, ఇలా ఆమె చేస్తున్న విమర్శలకు విలువ ఉంటుందా అన్న చర్చ సాగుతోంది.

మైలేజ్ రావడం లేదా :

ఇక కవిత హరీష్ రావుని తిడుతూ ఒక రోజు స్టేట్మెంట్ ఇస్తారు, ఆ మరుసటి రోజే సంతోష్ రావుని ఘాటుగా విమర్శిస్తారు. వీళ్లే నన్ను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారు అని ఆమె అంటారు, ఇదంతా సోషల్ మీడియాలో మైలేజ్ కోసం ఆమె ఇలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అయినా సరే ఆమె అనుకున్న మైలేజ్ రావడం లేదని కూడా వినిపిస్తోంది. తాజాగా ఆమె నిజామాబాద్ మీటింగులో మాట్లాడుతూ తాను హరీష్ రావుని సంతోష్ రావుని క్షమిస్తానేమో కానీ ప్రశాంత్ రెడ్డిని అసలు క్షమించను అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆమె బాధ ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదని అంటున్నారు.

ఫక్త్ ఫ్యామిలీ పంచాయతీగా :

కవిత మాట్లాడుతున్నది చూస్తే ఫక్తు ఫ్యామిలీ పంచాయతీగానే ఉంది. ఆమె బీఆర్ఎస్ నుంచి ఆ మధ్యన సస్పెండ్ అయ్యారు. ఈ రోజుకీ ఆమె అదే మాట మాట్లాడుతున్నారు. ఇదంతా జనంలో సానుభూతి కోసమే అని అంటున్నారు. అయితే అది రాకపోవడంతో ఆమె ఎవరెవరినో ముందు పెట్టి విమర్శలు చేస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ కేసీఆర్ ది. దాని వ్యవహారాలు మొత్తం చూస్తోంది కేటీఆర్. మరి ఒకరు తండ్రి అయితే మరొకరు అన్నయ్య, ఇలా సాగే ఫ్యామిలీ పంచాయతీలో ప్రశాంత్ రెడ్డికి కానీ మరొకరికి కానీ ఏమి సంబంధం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కి ఎవరైనా కవిత గురించి చాడీలు చెబితే వింటారా, ఆయన ఎంతటి సీనియర్ నాయకుడో అందరికీ తెలుసు కదా అంటున్నారు. పైగా కుమార్తె గురించి తండ్రికి చెప్పే పరిస్థితి ఉంటుందా అని అంటున్నారు. తనను పార్టీ నుంచి బయటకు పంపాలన్నా ఉంచాలన్నా కేసీఆర్ కి కేటీఆర్ కే సర్వాధికారాలు ఉంటాయని ఆమెకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ వారిని వదిలేసి వేరే వాళ్లను అంటే లాభమేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

రెడ్లను దూరం చేసుకుంటే :

తెలంగాణా రాజకీయాల్లో రెడ్లు బలమైన శక్తిగా ఉన్నారు. నిజానికి బీఆర్ ఎస్ రెండు సార్లు అధికారంలోకి రావడానికి రెడ్లు కూడా ప్రధాన కారణం అని చెబుతారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి పార్టీ పరంగానే ఓటు బ్యాంక్ ఉంది కానీ సొంతంగా సామాజిక వర్గం ఓట్లు ఎంత అన్న చర్చ వస్తోంది. అలాంటిది రెడ్ల మీద విరుచుకుపడితే కవిత కొత్త పార్టీకి కూడా లాభమేంటి అని అంటున్నారు. అయినా సరే కవిత ప్రతీ జిల్లా తిరుగుతూ అక్కడ రెడ్డి నాయకుల మీద నోరు పారేసుకుంటున్నారు అని అంటున్నారు. ఆమె ఈ మధ్యనే నల్గొండ జిల్లాకు వెళ్లి జగదీశ్వర రెడ్డిని అంటే ఆయన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు అని అంటున్నారు. ఆ తర్వాత ఆమె నుంచి నో కామెంట్ అన్నట్లుగా ఫుల్ సైలెంట్ అయిపోయారని చెబుతున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్ళి మరో రెడ్డి ఆయనను అంటే ఆయన కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చేశారు.

రాజకీయం చేయడం అంటే :

ఇపుడు నిజామాబాద్ వెళ్ళి ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. నిజానికి కవిత తన పార్టీ బీసీల కోసం అని చెప్పుకుని తిరుగుతున్నారు కానీ బీసీలతో ఆమెకు సంబంధం ఏంటని బీసీ సంఘాలే ప్రశ్నిస్తున్నారు. రాజకీయం చేయడం అంటే ఇది కాదు కదా అని కూడా అంటున్నారు. తమ పార్టీ విధానాలు చెప్పుకోవాలి, నిర్మాణాత్మక విమర్శలు చేయాలి, అధికార పార్టీ తప్పులు ఉంటే ఎత్తి చూపాలి కానీ తమ కుటుంబ పంచాయతీలు జనంలో ఎత్తుకుని కన్నీరు పెట్టినా లేక ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినా నష్టం తప్ప లాభం ఏమి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి కవిత రాజకీయం అంతా సోషల్ మీడియాలో హైప్ కోసం అన్నట్లుగానే ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

Tags:    

Similar News