నిండు స‌భ‌లో క‌విత క‌న్నీరు.. సంతోష్, హరీశ్‌లను క్షమిస్తా కానీ ప్రశాంత్ రెడ్డిని వదలనంటూ శపథం

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు, ఆమె భావోద్వేగ ప్రకటనలు పెను దుమారం రేపుతున్నాయి.

Update: 2026-08-31 17:15 GMT

ఎన్నికల సమరంలో శత్రువు విసిరే బాణాలైనా తట్టుకోవచ్చు... కానీ కడుపున పుట్టిన ఆడబిడ్డలా.. ప్రాణంగా భావించిన పార్టీ కోసం జైలు గోడల మధ్య నరకం చూసి వస్తే.. సొంత ఇంటి ముంగిట్లోనే పరాయిదాన్ని చేసి నెట్టేస్తే ఆ గుండె రగిలే ఆవేదన ఎంతటిదో నిండు సభలో కవిత కన్నీటి బొట్లై రాలింది. "తండ్రిలాంటి కేసీఆర్ ప్రేమకు నన్ను దూరం చేసిన ఆ శకునిని ప్రాణం ఉన్నంతవరకు క్షమించను" అంటూ కళ్లల్లో నీళ్లతోనే పగబట్టిన శపథం చేస్తుంటే... నిజామాబాద్ వేదిక మూగబోయింది.. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది.

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు, ఆమె భావోద్వేగ ప్రకటనలు పెను దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ అగ్రనాయకత్వంపై వరుస దాడి చేస్తున్న కవిత.. తొలిసారిగా తన సొంత గడ్డ నిజామాబాద్ బహిరంగ సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వేదికపైనే కన్నీరు పెట్టుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

తండ్రీకూతుళ్ల మధ్య శకుని పాత్ర

ఈ సభలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కవిత అత్యంత తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. మహాభారతంలోని ‘శకుని’తో ఆయనను పోలుస్తూ తన తండ్రి కేసీఆర్‌కు తనకు మధ్య పూడ్చలేని దూరం పెరగడానికి ప్రశాంత్ రెడ్డే ప్రధాన కారణమని ఆరోపించారు. "మా ఇంట్లో కూర్చొని అన్నం తిన్న వ్యక్తే నాపై కుట్రలు చేసి తండ్రీకూతుళ్లను వేరు చేశారు. సంతోష్ రావు, హరీశ్ రావులను భవిష్యత్తులో ఎప్పుడైనా క్షమిస్తానేమో కానీ ప్రశాంత్ రెడ్డిని మాత్రం ఎప్పటికీ క్షమించను" అని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేసినా వెంటపడి మరీ ఓడిస్తానని.. ఆయనకు ఇక ప్రజాజీవితం లేకుండా చేస్తానని సవాల్ విసిరారు.

సానుభూతి వ్యూహం.. కేసీఆర్‌కు ప్రశ్నలు

తాను బీఆర్ఎస్ కోసం ఎంతో కష్టపడ్డానని.. పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లానని గుర్తుచేసుకున్న కవిత.. "ఒక ఆడబిడ్డకు కష్టం వస్తే ఆదుకోవాల్సింది పోయి ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారా?" అని ప్రశ్నించారు. ఈ భావోద్వేగ ప్రశ్న ద్వారా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజల నుంచి సానుభూతి పొందే వ్యూహాన్ని ఆమె అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చుక్క నీరు కూడా రాలేదని.. దీనివల్ల ప్రజలకు వచ్చిన ఉపయోగమేమిటని ప్రశ్నించడం ద్వారా ప్రాంతీయ సెంటిమెంట్‌ను కూడా ఆమె తన అజెండాలోకి తెచ్చారు.

కేసీఆర్ మౌనం వీడాల్సిందేనా?

ఇప్పటివరకు కవిత చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు స్పందించినప్పటికీ నేరుగా కేసీఆర్‌ను ఉద్దేశించి వేసిన ప్రశ్నలకు పార్టీ వద్ద స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. సొంత కుమార్తె సంధించిన ప్రశ్నలకు కేసీఆర్ స్వయంగా స్పందిస్తారా లేదా మౌనాన్నే ఆశ్రయిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను భవిష్యత్తులో గెలుచుకుంటామని ప్రకటించడం ద్వారా.. తన భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి నిజామాబాద్‌నే వేదికగా మార్చుకోబోతున్నారని కవిత స్పష్టమైన సంకేతాలిచ్చారు.

Tags:    

Similar News