పవన్ ను కెలికితే ఎలా ఉంటాదో వైసీపీని కవిత అడగాలా?
తాజాగా జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.;
మా రాష్ట్రం మాది. పక్క రాష్ట్రంతో మాకేంటి పని? అంటూ మాట్లాడే అలవాటు గులాబీ దండుకు ఎక్కువే. అవసరానికి తగ్గట్లు మాటలు మార్చేసే విషయంలో కేసీఆర్ అండ్ కోకు ఎక్కువే. తాజాగా జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.తన సోదరుడు కేటీఆర్ తో మంచి స్నేహం ఉన్న పవన్ ను కవిత ఎందుకు టార్గెట్ చేసినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
వైసీపీ అధినేత జగన్ తీరు నచ్చుతుందన్నంతవరకు ఓకే. ఎవరి ఇష్టాన్ని వారు బయటపెట్టుకోవటంలో తప్పు లేదు. అదే సమయంలో తనకు నచ్చని నేత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు కదా? జగన్ ను పొగిడేసే క్రమంలో పవన్ ను తప్పు పట్టేలా మాట్లాడిన మాటల వల్ల తనకు లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని కవితక్క ఎందుకు మిస్ అయినట్లు? అన్నది మరో ప్రశ్న.
అవసరం లేకున్నా అదే పనిగా పవన్ ను ఉద్దేశించి చేసే విమర్శలు.. ఆయన్ను కెలికినట్లుగా వ్యవహరించే వ్యవహారశైలి రాజకీయంగా ఎంత నష్టం జరుగుతుందన్న అంశంలో కవితకు పెద్దగా క్లారిటీ లేకున్నా.. వైసీపీ నేతలకు ఉన్న అనుభవం చాలా ఎక్కువని చెబుతారు. అవసరం ఉన్నా.. లేకున్నా పవన్ ప్రస్తావన తేవటం ద్వారా ఏదో సాధించినట్లుగా భావించే వైసీపీ వర్గాలకు ఎన్నికల ఫలితాలు ఎంతటి షాకిచ్చాయో తెలిసిందే.
ఎన్నికల తర్వాత నుంచి అవసరమైతే తప్పించి పవన్ ను కెలికే ప్రయత్నం చేయట్లేదు వైసీపీ నేతలు. ఇదంతా అధినేత ఆలోచనలకు తగినట్లుగానే జరుగుతుందని చెప్పాలి. అలాంటప్పుడు కవితకు ఆ మర్మం అర్థం కాకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. అవసరం లేని విషయాల్ని అస్సలే పట్టించుకోని తన తండ్రి బాటను వదిలేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ద్వారా లేనిపోని తిప్పలు ఎదురవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పవన్ ను కెలికే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టటం అవసరమన్న మాట బలంగా వినిపిస్తోంది. కవితక్క ఏం చేస్తారో మరి.