లిక్కర్ రవాణా స్కాం కేసు.. వైసీపీ నేతలకు ముప్పేనా?
ఏపీ మద్యం స్కాం కేసుకు అనుబంధంగా మద్యం బాటిళ్ల రవాణాలోనూ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలకు సిట్ పోలీసులు ఉచ్చుబిగిస్తున్నారని అంటున్నారు.;
ఏపీ మద్యం స్కాం కేసుకు అనుబంధంగా మద్యం బాటిళ్ల రవాణాలోనూ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలకు సిట్ పోలీసులు ఉచ్చుబిగిస్తున్నారని అంటున్నారు. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, విజయవాడలోని సూర్యారావుపేట పోలీసు స్టేషన్ లో పోలీసులు మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మద్యం బాటిళ్ల రవాణా స్కాం కేసులో తమ పేర్లు తప్పించాలని కోరుతూ కారుమూరి తండ్రి కొడుకులు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. దీంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల విషయంలో రాజీ లేదన్న సంకేతాలను ప్రభుత్వం ఇస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
మద్యం బాటిళ్ల రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు సునీల్ తోపాటు మరికొందరు వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరంతా ప్రాంతాల వారీగా రవాణా కాంట్రాక్టులు తీసుకుని ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సిట్ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో కారుమూరి కోడలు కీర్తి అకౌంటులో రూ.9.4 కోట్లు డిపాజిట్ అయినట్లు సిట్ ఆధారాలు సంపాదించిందని చెబుతున్నారు. అంతేకాకుండా కారుమూరి కుటుంబ సభ్యులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను సిట్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. మద్యం రవాణాకు సంబంధించి సబ్ కాంట్రాక్టులు పొందిన కారుమూరి కుటుంబ సభ్యులు 85 శాతం డబ్బును తమ అకౌంట్లలో డిపాజిట్ చేయించుకున్నారని సిట్ ఆరోపిస్తోంది. వీరిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సివున్నందున ముందస్తు బెయిలు ఇవ్వొద్దని సిట్ హైకోర్టును అభ్యర్థించింది. దీనిపై హైకోర్టు ఈ నెల 18న తీర్పు ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో కారుమూరి కుటుంబంతోపాటు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇతర వైసీపీ నేతల పరిస్థితి ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆయా నేతలు, వారి అనుచరుల అకౌంట్లకు మద్యం రవాణా డబ్బు జమ అయిందని సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించిందని అంటున్నారు. నిర్దేశిత ధరలకు మించి అధికంగా రవాణా చార్జీలు వసూలు చేశారని వీరిపై ప్రభుత్వం అభియోగాలు మోపుతోంది. ఎఫ్ఐఆర్ వేయకముందే పలువురిని అదుపులోకి తీసుకుని బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు.
వాస్తవానికి ఈ రవాణా కాంట్రాక్టును న్యూఢిల్లీకి చెందిన సిగ్మా సంస్థకు అప్పగించారు. పేరుకే ఈ సంస్థకు కాంట్రాక్టు అప్పగించినా శ్రీ సుదర్శన్ కనస్ట్రక్షన్ సంస్థే చక్రం తిప్పిందని సిట్ ఆరోపిస్తోందని చెబుతున్నారు. సుదర్శన్ సంస్థ వెనుక మాజీ మంత్రి కారుమూరి కుటుంబ సభ్యులు ఉన్నారని చెబుతూ, వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను సిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీకి చెందిన మాజీ మంత్రి కారుమూరి కుటుంబ సభ్యులతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులకు ఇబ్బందులు తప్పేలా లేవని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఈడీ కూడా దృష్టి సారించిందనే ప్రచారం మరింత హీట్ పుట్టిస్తోందని చెబుతున్నారు.