ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ట్రేడ్? హార్దిక్ పాండ్యా కోసం పంజాబ్ కింగ్స్ 'బ్లాంక్ చెక్' ఆఫర్.. నిజమెంత?
పంజాబ్ కింగ్స్ యాజమాన్యం హార్దిక్‌కు వచ్చే మూడు సీజన్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఐపీఎల్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా మెగా వేలానికి ముందో లేక ట్రేడింగ్ విండో ఓపెన్ అయినప్పుడో వచ్చే వార్తలు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక సంచలన వార్త క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే... ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడింగ్‌కు రంగం సిద్ధమవుతోందా? ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ గూటికి చేరబోతున్నాడా? సోషల్ మీడియా కథనాల ప్రకారం.. ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎలాగైనా తమ జట్టులోకి లాక్కోవాలని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గట్టి పట్టుదలతో ఉందట. దీని కోసం వారు ముంబై ఇండియన్స్‌కు ఒక భారీ 'మెగా ఆఫర్' ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యాకు బదులుగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ముంబైకి పంపేందుకు సిద్ధమయ్యారు. దీనితో పాటు భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్ మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ను కూడా ముంబైకి ఇచ్చేలా చర్చలు సాగుతున్నట్లు టాక్. ఒకవేళ ముంబై ఈ ఆఫర్‌కు ఓకే చెబితే.. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ, సంచలనాత్మక ఆటగాళ్ల మార్పిడి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘బ్లాంక్ చెక్’.. ఫ్రాంచైజీలో 10% వాటా!
పంజాబ్ కింగ్స్ యాజమాన్యం హార్దిక్‌కు వచ్చే మూడు సీజన్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా హార్దిక్ పాండ్యాకు ‘బ్లాంక్ చెక్’ ఆఫర్ చేయడంతో పాటు, ఫ్రాంచైజీలో 10 శాతం వాటాను కూడా ప్రతిపాదించినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా, అతని సన్నిహితురాలు మహీకా శర్మను ప్రీతి జింటా తన నివాసానికి ఆహ్వానించి ఈ విషయంపై చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ రియాక్షన్ ఏంటి? నీతా అంబానీ పట్టుబట్టారా?
మరోవైపు ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం హార్దిక్ పాండ్యాను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రి నీతా అంబానీ హార్దిక్‌ను ముంబై జట్టులోనే కొనసాగించాలని గట్టిగా కోరుకుంటున్నట్లు సమాచారం. గత సీజన్‌లో ఎన్నో వివాదాలు, విమర్శల మధ్య హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్ నుండి ముంబైకి తీసుకొచ్చి కెప్టెన్సీ అప్పగించారు. కాబట్టి అంత సులభంగా అతడిని వదులుకునే ప్రసక్తే లేదని ముంబై క్యాంప్ భావిస్తున్నట్లు టాక్.
ఇందులో ఎంతవరకు నిజముంది?
సోషల్ మీడియాలో ఈ వార్త ఎంత జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ.. దీనిపై ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు కానీ, లేదా స్వయంగా హార్దిక్ పాండ్యా కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడికి ఫ్రాంచైజీలో వాటాలు ఇవ్వడం లేదా బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేయడం అంత సులభం కాదు. రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ కేవలం సోషల్ మీడియా ఊహాగానాలు మాత్రమే. ఐపీఎల్ అభిమానులను ఆకర్షించడానికి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న కథనాలుగానే వీటిని పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో దీనిపై ఏవైనా అధికారిక అప్‌డేట్స్ వస్తే చూడాలి.