హైదరాబాద్ vs బెంగళూరు : భాగ్యనగరం 'నెవెర్ బిఫోర్' రికార్డ్.. వైరల్ పోస్టు

హైదరాబాద్‌ నెట్‌వర్క్‌ను వాడుకుంటూ ఒక వ్యక్తి దాదాపు 82 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 1 గంట 12 నిమిషాల్లో దాటేశాడు.

Update: 2026-06-10 13:30 GMT

దక్షిణ భారత దేశానికి రెండు కళ్లు లాంటి హైదరబాద్, బెంగళూరు నగరాలపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఐటీ రంగానికి గుండెకాయ లాంటి రెండు నగరాల్లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. అయితే బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య చాలా తక్కువగా ఉంటుందని, హైదరాబాద్ మాదిరిగా బెంగళూరు ట్రాఫిక్ సిస్టం తీర్చిదిద్దాలంటే మరో దశాబ్దం పడుతుందని ఇటీవల ఓ టెకీ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. గూగుల్ మ్యాప్స్ స్క్రీన్‌షాట్ ను కూడా జత చేస్తూ హైదరాబాద్ ప్లానింగ్‌, బెంగళూరు ట్రాఫిక్ నరకానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ఆ టెకీ పెట్టిన పోస్టుపై హాట్ డిబేడ్ జరుగుతోంది.

హైదరాబాద్‌ నెట్‌వర్క్‌ను వాడుకుంటూ ఒక వ్యక్తి దాదాపు 82 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 1 గంట 12 నిమిషాల్లో దాటేశాడు. అంటే సగటున గంటకు 68 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగింది. ఇదే 82 కిలోమీటర్ల దూరాన్ని బెంగళూరులో దాటాలంటే కనీసం మూడు నుంచి నాలుగు గంటలు పడుతుందని అంటున్నారు. ఉదాహరణకు సిల్క్ బోర్డ్ జంక్షన్, వైట్‌ఫీల్డ్ లేదా ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్‌ను దాటుకుంటూ వెళ్లడానికి కనీసం 3 నుండి 4 గంటలు కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ వేగాన్ని అందుకోవడానికి బెంగళూరుకు మరో దశాబ్దం పడుతుందంటూ సదరు టెకీ చేసిన ట్వీట్ బెంగళూరు వాసులకు మంట పుట్టిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఔటర్ హైదరాబాద్ కి ప్లస్

హైదరాబాద్ నగర ప్రణాళికలో 158 కిలోమీటర్ల ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్ రోడ్ ఒక గేమ్ ఛేంజర్ గా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. నగరంలోపలకు రాకుండానే, సిటీ చుట్టుపక్కల ఉన్న శాటిలైట్ టౌన్‌షిప్‌లను, ఐటీ హబ్‌లను అనుసంధానించడంతో ఈ రోడ్డు అద్భుతంగా పనిచేస్తోందని కితాబునిస్తున్నారు. దీనికి తోడు గ్రిడ్ రోడ్ పాలసీ, వరుసగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు సిటీ లోపల కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ రహిత ప్రయాణాన్ని అందిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.

బెంగళూరు ఎందుకు వెనుకబడింది?

ఇదే సమయంలో బెంగళూరు అభివృద్ధి అనేది ఒక పద్ధతి ప్రకారం జరగలేదని అంటున్నారు. ఐటీ కంపెనీలు రావడం, జనాభా విపరీతంగా పెరగడం ఒకేసారి జరగడం వల్ల ట్రాఫిక్ సమస్య పెరిగిపోయిందని అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే బెంగళూరు పెరిఫెరల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ దశాబ్దాలుగా నత్తనడకన సాగుతోందని అంటున్నారు. సిల్క్ బోర్డ్ లేదా హెబ్బాల్ లాంటి కీలక జంక్షన్లలో బాటిల్‌నెక్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. మెట్రో పనులు వేగంగా సాగుతున్నప్పటికీ, ఐటీ కారిడార్లను పూర్తిస్థాయిలో అనుసంధానించడానికి చాలా సమయం పట్టిందని చెబుతున్నారు.

హైదరాబాద్ లోపల సంగతో..

అయితే, హైదరాబాద్ ట్రాఫిక్ పై నెటిజన్లు మరో వాదనను కూడా తెరపైకి తెస్తున్నారు. టెకీ షేర్ చేసిన మ్యాప్ కేవలం సిటీ బయట ఉండే 'ఔటర్ రింగ్ రోడ్' మాత్రమేనని, హైదరాబాద్ సిటీ లోపల కథేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. అమీర్‌పేట్, కూకట్‌పల్లి, సైబరాబాద్‌లోని అంతర్గత రోడ్లు, లేదా పాతబస్తీ పరిసరాల్లో పీక్ అవర్స్‌లో పరిస్థితి బెంగళూరుకు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. వర్షం పడితే ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడం చూస్తూనే ఉన్నామని కామెంట్ చేస్తున్నారు. కాగా, ఈ వైరల్ పోస్ట్ హైదరాబాద్‌కు ఒక ముందస్తు హెచ్చరికగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వేగంగా విస్తరించకపోతే, రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ కూడా మరో బెంగళూరులా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News