తెలంగాణ ఎమ్మెల్యేల తీరేంటి.. కాంగ్రెస్ వదిలేసిందా?!
దీనివల్ల అంతా రేవంత్ చూసుకుంటారు అనే ధోరణి పార్టీ అధిష్టానం లో ఉన్నట్టు స్పష్టమవుతుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయింది. అయితే, ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పని తీరు పై ఒక అధ్యయనంగానీ.. ఒక నివేదిక కానీ వచ్చినట్టు కనిపించడం లేదు. అసలు పార్టీ పరంగా కూడా ఈ తరహా చర్యలు చేపట్టడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో వన్ మాన్ ఆర్మీ వ్యవస్థ నడుస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనివల్ల అంతా రేవంత్ చూసుకుంటారు అనే ధోరణి పార్టీ అధిష్టానం లో ఉన్నట్టు స్పష్టమవుతుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేల బలం, వారు అనుసరిస్తున్న తీరు, వ్యవహరిస్తున్న పనితీరు వంటివి ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ బోల్తా పడింది ఇక్కడే. అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో ఎలా ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉన్న వ్యతిరేకతను ఆయన గమనించలేకపోయారు. మొహమాటలు, బంధుప్రీతి కావచ్చు,, మరో కారణం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో ఎమ్మెల్యేలకు ఉన్న వ్యతిరేకతను అంచనా వేయలేని కారణంగా కేసీఆర్ తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నారు.
ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంచనా వేసే వ్యవస్థను కూడా కాంగ్రెస్ పార్టీ నడిపించలేకపోతోంది. దీనిపై ఒక్క మాట కూడా చర్చకు రావడం లేదు. ఏదో తూతూ మంత్రంగా రాష్ట్రస్థాయిలో సమావేశాలు పెట్టడం, హెచ్చరికలు జారీ చేయడం వరకే పరిమితం అవుతున్నారు. అంతే తప్ప ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు.. ప్రజలకు చేరువ అవుతున్నారా లేదా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారా లేదా అనే అంశాలపై ఎక్కడా మానిటరింగ్ చేసే వ్యవస్థ లేకపోవడం గమనార్హం.
ఏ ప్రభుత్వానికైనా రెండున్నర సంవత్సరాల పాలన అత్యంత కీలకం. ఈ రెండున్నరేళ్లలో ప్రజల నాడి ఏ విధంగా ఉంది.. అని పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనికి మూల కారణం ఎమ్మెల్యే వ్యవహరించే పనితీరును బట్టి ఆధారపడుతుంది. ఈ విషయాన్ని గ్రహించారా.. లేకపోతే గ్రహించి కూడా వదిలేశారా.. అనేది చూడాలి. ఏదేమైనా పార్టీ అధిష్టానం కేవలం రేవంత్ రెడ్డి పై ఆధారపడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కానీ వ్యక్తి రాజకీయాలు కొన్నాళ్ల వరకే పని చేస్తాయి. తర్వాత ప్రజల్లో వచ్చే సానుకూలత, సానుభూతి వంటివి మాత్రమే పార్టీలను గెలిపిస్తాయి. దీనికి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ మేలుకుంటుందా లేదా అనేది చూడాలి.