కన్నడ రాజకీయాల్లో 'చెంబు' కలకలం

ప్రధాని మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు ఇచ్చారని కాంగ్రెస్ విమర్శల డోసు పెంచింది.

Update: 2024-04-21 06:16 GMT

‘‘కరువు, వరదల పరిహారం చెంబు, అందరి ఖాాతాలకు రూ.15 లక్షల జమ చెంబు, రైతుల ఆదాయం రెట్టింపు చెంబు, తాము కట్టిన వంద రూపాయల పన్నులో రూ.13 వాపసు చెంబు, రాష్ట్రం నుండి ఎన్నికైన 25 బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఇచ్చిన కానుక చెంబు’’ అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ శుక్రవారం నాడు వివిధ పత్రికల్లో ఇచ్చిన చెంబు ప్రకటనలు కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రధాని మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు ఇచ్చారని కాంగ్రెస్ విమర్శల డోసు పెంచింది.

ఇక శనివారం మోదీ ఎన్నికల ప్రచారసభ నిర్వహించిన ప్యాలెస్ మైదానం సమీపంలో కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సుర్జేవాలా నేతృత్వంలో చెంబులతో ర్యాలీ తీయగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ ‘‘ఒక్క కర్ణాటకకే కాదు మోడీ దేశం మొత్తానికి చెంబు ఇచ్చారని’’ ఎద్దేవా చేశారు.

ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చెంబు పేరుతో దిగజారుడు రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరైన మోడీ ముంతెడు మట్టిని ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో చెంబు రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News