వీళ్లు మామూళ్లోలు కాదండోయ్.. రూ. 5 కోట్ల కోసం ఏం ప్లాన్ చేశారో తెలుసా?

బీమా డబ్బుల కోసం ఓ ముఠా ప్లాన్ చేయడంతోనే గంగాధర మర్డర్ కు గురయ్యారని పోలీసులు గుర్తించారు. అతడిపై రూ.5 కోట్ల విలువైన జీవితా బీమా, రూ.25 లక్షల ప్రమాద బీమా ఉన్నట్లు గుర్తించారు.;

Update: 2025-10-03 15:03 GMT

రూ. 5 కోట్ల బీమా కోసం ఓ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్, బ్యాంకు ఉద్యోగితోపాటు మరో నలుగురు వేసిన స్కెచ్ కర్ణాటక పోలీసుల వల్ల విఫలమైంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి భారీగా బీమా చేయించి అతడు చనిపోతే ఆ డబ్బు తీసుకోవాలని ప్లాన్ చేసిన నిందితులు ఓ కన్నడ థ్రిల్లర్ సినిమా కథ స్ఫూర్తితో పక్కా పథకం వేశారు. అయితే తాము బీమా చేయించిన వ్యక్తి ఆరోగ్యంగా తిరుగుతుండటంతో తమ ప్లాన్ వర్క్ అవుట్ కావడం లేదని భావించి, అతడి హత్యకు ఒడిగట్టారు. అయితే ఇక్కడే నిందితులు చేసిన పొరపాటు వల్ల పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు.

గత నెల 28న కర్ణాటకలోని హోస్పేట్ లో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మోటారు సైకిలిస్టు గంగాధర మరణించాడు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు రోడ్డు ప్రమాదంగా భావించి మృతుడి భార్యకు సమాచారం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. అయితే పోలీసులు చెప్పిన మాటలతో మృతుడి భార్య షాక్ కు గురైంది. పక్షవాతంతో సరిగా నడవలేని తన భర్త ద్విచక్ర వాహనం నడపడమేంటని? ఆమె ఎదురు ప్రశ్నించడంతో పోలీసులు కిన్నులయ్యారు. దీంతో మృతుడు సెల్ ఫోన్ కాల్ డేటాను సేకరించగా, మర్డర్ విషయం వెలుగు చూసింది.

బీమా డబ్బుల కోసం ఓ ముఠా ప్లాన్ చేయడంతోనే గంగాధర మర్డర్ కు గురయ్యారని పోలీసులు గుర్తించారు. అతడిపై రూ.5 కోట్ల విలువైన జీవితా బీమా, రూ.25 లక్షల ప్రమాద బీమా ఉన్నట్లు గుర్తించారు. డబ్బు కోసం ఆశపడిన గంగావతి మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ క్రిష్ణప్ప, బ్యాంకు ఉద్యోగి యోగరాజ్ సింగ్ తోపాటు మరో నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధరపై బీమా చేయించినట్లు చెబుతున్నారు. పక్షవాతంతో ఉన్న గంగాధర త్వరలో చనిపోతాడని భావించి డాక్టర్, బ్యాంకు ఉద్యోగి సహాయంతో నిందితులు భారీ మొత్తంతో బీమా చేయించారు. అతడు చనిపోతే వచ్చిన డబ్బు పంచుకోవాలని ప్లాన్ చేశారట, ఇందుకోసం గంగాధరకు నామినీగా ఓ మహిళ పేరును భార్యగా చూపి ఇన్సూరెన్స్ చేయించారు. ప్రీమియం డబ్బులు సైతం నిందితులే చెల్లించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

అయితే బీమా చేసిన తర్వాత, నిందితులు ఆశించినట్లు గంగాధర మరణించకపోవడంతో అతడిని చంపేయాలని డిసైడ్ అయ్యారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పథకం ప్రకారం గత నెల 28న గంగాధరను కిడ్నాప్ చేసి హత్యచేశారట. ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించేందుకు హోస్పేట్ శివారులో సండూరు మార్గం వద్ద మృతదేహాన్ని పడేసి కారుతో తొక్కించారు. అయితే మృతుడి భార్య చెప్పిన వివరాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో ముఠా గుట్టు రట్టైంది. ఈ వ్యవహారంలో పోలీసులు మరికొందరిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా గతంలో ఇలాంటి ఘోరాలకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News