‘సోషల్‌’ విద్వేషం.. మూడేళ్ల జైలు ఖాయం..కొత్త చట్టం

స్మార్ట్‌ ఫోన్‌ చేతికి వచ్చాక.. సోషల్‌ మీడియా పెరిగాక.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంపై స్పందిస్తున్నారు. మరికొందరు ఇంకా ముందుకెళ్లి విద్వేషాలు వ్యాపింపజేస్తున్నారు.;

Update: 2025-06-24 03:31 GMT

స్మార్ట్‌ ఫోన్‌ చేతికి వచ్చాక.. సోషల్‌ మీడియా పెరిగాక.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంపై స్పందిస్తున్నారు. మరికొందరు ఇంకా ముందుకెళ్లి విద్వేషాలు వ్యాపింపజేస్తున్నారు. అవతలివారు గిట్టకుంటే వారిపై తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలకు సోషల్‌ మీడియా అనేది పెద్ద ఆయుధంగా మారింది. ఇందుకోసం ఏకంగా ప్రత్యేక నియామకాలే చేపడుతూ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో రోజురోజుకు పెరుగుతున్న విద్వేష పోస్టులకు అడ్డుకట్టేయాల్సింది ప్రభుత్వాలే. ఈ దిశగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్‌ విద్వేష కట్టడికి కొత్త చట్టం తెస్తోంది. దీనిద్వారా సోషల్ మీడియాలో విద్వేషాలు వ్యాప్తి చేస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై జిల్లా అధికారులకు మరిన్ని అధికారులు ఇవ్వాలని కన్నడ ప్రభుత్వం భావిస్తోంది.

సోషల్ మీడియాలో ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఈ చట్టాన్ని 'కర్ణాటక హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ బిల్లు-2025' పేరుతో తెస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను నియంత్రించే అధికారం కలెక్టర్లకు ఇవ్వనున్నారు. ప్రధానంగా విద్వేష ప్రసంగాలు, పోస్టులకు బెయిల్‌ ఇవ్వకుండా కేసుల నమోదే ఈ బిల్లు ఉద్దేశం. ఇక సోషల్ మీడియా సంస్థలు, టెలికాం కంపెనీలు రెచ్చగొట్టే కంటెంట్ ప్రసారం చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. విద్వేష ప్రసంగాలకు ఆర్థిక సాయం చేసినా.. ఇతర సాయం చేసినా వారూ దోషులే.

ఇక మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు.. ర్యాలీలు, బహిరంగ సభలు, లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని 30 రోజులు నిషేధించే అవకాశం కూడా కొత్త చట్టం ద్వారా రానుంది. పరిస్థితులను బట్టి దీన్ని మరో 30 రోజులు పొడిగించే వీలుంది. కాగా, ఈ చట్టంతో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలగదని అధికారులు చెబుతున్నారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చని.. అది విద్వేషానికి దారి తీసేలా ఉండకూడదని స్పష్టం చేశారు.

ఇక కొత్త చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటిని మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

కాగా, భారత దేశ టెక్‌ రాజధాని అయిన బెంగళూరు కర్ణాటక రాజధాని. లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేసే ఈ రాష్ట్రంలో టెక్నాలజీ కూడా బాగా వినియోగంలో ఉంటుంది. గత బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ కూడా సోషల్‌ మీడియా ద్వారానే పెద్ద ఉద్యమం నడిపింది.

Tags:    

Similar News