ఆ ఇద్దరు నేతల వాచీల ధర... వాచిపోయేంత

కర్ణాటక రాజకీయం రోజురోజుకూ రంజుగా మారుతోంది. ఇది కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే కాదు. కాంగ్రెస్ లో సీఎం సిద్ధరామయ్య వర్సెస్ డిప్యూటీ సీఎం డీకేశివకుమార్ గా వార్తలకెక్కుతోంది.;

Update: 2025-12-05 09:30 GMT

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతికి ఉన్న వాచీ ధర తెలుసా? పోనీ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేతికి ఉన్న వాచీ ఖరీదు తెలుసా? లక్షల్లో ఉంటుంది...వాచిపోయే ధరలతో వారికి వాచీలు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఇవి సగటు కన్నడిగుని ప్రశ్నలు కాదండోయ్...ప్రతిపక్షం బీజేపీ సంధిస్తున్న బాణాలు...దీంతో కర్ణాటక రాజకీయం ఇపుడు ఇద్దరు నేతల వాచీల చుట్టూ తిరుగుతోంది.

కర్ణాటక రాజకీయం రోజురోజుకూ రంజుగా మారుతోంది. ఇది కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే కాదు. కాంగ్రెస్ లో సీఎం సిద్ధరామయ్య వర్సెస్ డిప్యూటీ సీఎం డీకేశివకుమార్ గా వార్తలకెక్కుతోంది. కాంగ్రెస్ పాలనలోకి వచ్చి రెండున్నరేళ్ళు అవుతోంది...రాష్ట్రానికి ఏం ఒరిగింది...ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమేరకు అమలయ్యాయి. సగటు ఓటరు సంతోషంగా ఉన్నారా లేదా ఇవి కదా ప్రతిపక్షం ప్రశ్నించాల్సింది...అధికార పక్షం ఆలోచించాల్సింది. కానీ ఇవేవీ పట్టనట్లు గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో పవర్ షేరింగ్ నాటకానికి తెరలేస్తే...ప్రతిపక్షం బీజేపీ ఆ నాటకం ఎలా రంజుగా సాగాలా అని ఉచిత కామెంట్లతో కాలం గడిపేస్తోంది అన్న విమర్శలు వినవస్తున్నాయి.

గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఆ పార్టీ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చక్రం తిప్పిన మాట వాస్తవం. డీకే అందరినీ కూడగట్డడంలో..పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడంలో కీలకంగా వ్యవహరించారు. వారిద్దరి చాణక్య వ్యూహరచన వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో సీఎం సీటు ఎవరికి అన్న విషయంగా ప్రతిష్టంభన నెలకొన్న మాట వాస్తవం. అధిష్టానం చివరికి సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపింది. కారణం...ఎంపీ ఎన్నికల్లో తను చక్రం తిప్పి అత్యధిక కాంగ్రెస్ ఎంపీలను ఢిల్లీకి పంపిస్తానని సిద్ధరామయ్య చెప్పడమే. అప్పట్లో కేంద్రంలో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం కాబట్టి కాంగ్రెస్ కాదనలేక సీఎం కుర్చీ సిద్ధరామయ్యకు కట్టబెట్టింది. అప్పుడే అయిదేళ్ల పాలనలో ఇద్దరు నేతలకు చెరిసగం అన్న ఒప్పందం అయ్యింది. ఆ సగం కాలం పూర్తయిన నేపథ్యంలో డీకే పావులు కదుపుతుండటంతో సిద్ధరామయ్య లోపాయికారీగా వ్యూహాలు రచిస్తూనే ...అల్పాహార విందు రాజకీయాలకు తెరలేపారు.

సీఎం సిద్ధరామయ్య ఇడ్లీ, ఉప్మా,కేసరిబాత్ తో అల్పాహారం విందుకు ఉపముఖ్యమంత్రిని ఆహ్వానించగా....తానేమీ తక్కువ కాననన్నట్లు సీఎంను విందుకు ఆహ్వానించి అతనికి నచ్చిన నాన్ వెజ్ వండి వార్చారు డీకే. ఈ రెండు విందులూ అధిష్టానం సూచనతో జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పుడు బాల్ ఢిల్లీలో ఉంది. సీఎంగా సిద్ధరామయ్య కొనసాగుతారా? లేదా డీకే కొత్త సీఎం అవుతారా అన్నది వేచి చూడాలి. ఈలోగా ప్రతిపక్షంగా ఉంటున్న బీజేపీ కొత్త టాపిక్ తెరపైకి తెచ్చింది. అదే సీఎం డిప్యూటీ సీఎంల చేతికున్న వాచీల ధర లక్షల్లో ఉందని...అది ఎవరిచ్చారో...ఇన్ కంటాక్స్ రిటర్న్స్ లో ప్రస్తావించారా లేదా అని ప్రశ్నిస్తున్నారు.

అల్పాహార విందు పరంపరలో ఇద్దరు నేతలు తమ చేతికి ధరించిన వాచీలు చాలా ఖరీదైవనవని... కార్డియల్ సంస్థకు చెందిన ఆ వాచీల ధర ఎంతలేదన్నా రూ.40 లక్షల పైమాటే అంటోంది బీజేపీ. సిద్ధరామయ్య సీఎం అయిన సందర్బంగా దుబాయికి చెందిన పారిశ్రామిక వేత్త రూ.70 లక్షల విలువగల హోబ్లాత్ వాచీ కానుకగా సమర్పించారు. సదరు పారిశ్రామిక వేత్తకు మేలు చేసేందుకే సీఎంకు వాచీ కానుకగా లభించిందని...ఇదంతా క్విడ్ ప్రోకో అని బీజేపీ ఊదరగొట్టడంతో చేసేది లేక సిద్ధరామయ్య ఆ వాచీని సచివాలయం మ్యూజియంకు ఇచ్చేశారు. మరి ఇపుడు సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే తమ వాచీలను ఏం చేస్తారో చూడాలి...పాపం కాలం కలసి రాకపోవడం అంటే ఇదేనేమో.

Tags:    

Similar News