లైంగిక వేధింపుల నేత నామినేషన్‌.. నభూతో నభవిష్యతి!

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ దేశవ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చుకున్నారు

Update: 2024-05-04 11:30 GMT

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ దేశవ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళా రెజ్లర్లకు సానుభూతి దక్కింది. బ్రిజ్‌ భ్రూషణ్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి. మహిళా రెజ్లర్లకు ఫురుష రెజ్లర్లు, బాక్సింగ్‌ క్రీడాకారులు, అథ్లెట్లు మద్దతు తెలిపారు. నెలల తరబడి ఢిల్లీలో నిరసనలు నిర్వహించారు.

అయితే బ్రిజ్‌ భూషణ్‌ పై ఈగ కూడా వాలలేదు. ఆయన బీజేపీ ఎంపీ కావడమే ఇందుకు కారణం. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌ లో కైసర్‌ గంజ్‌ ఎంపీగా ఉన్న బ్రిజ్‌ భూషణ్‌ ఆ చుట్టు పక్కల స్థానాలను కూడా ప్రభావితం చేయగలరు, ఆయన సామాజికవర్గంలోనూ బ్రిజ్‌ భూషణ్‌ కు గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంటే బ్రిజ్‌ భూషణ్‌ సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడ్డ కేంద్ర ప్రభుత్వం ఆయనపై చర్యలకు వెనుకాడిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో గతేడాది జనవరిలో సాక్షి మలిక్, బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనలు ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేదు. అయితే బీజేపీలోనే బ్రిజ్‌ భూషణ్‌ పై నిరసనలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం లోక్‌ సభ ఎన్నికలు జరుగుతుండటంతో బీజేపీ హైకమాండ్‌ ఆయనను పక్కనపెట్టింది. అయితే ఆయన కుమారుడికే కైసర్‌ గంజ్‌ సీటిచ్చింది. గత మూడు పర్యాయాలుగా బ్రిజ్‌ భూషణ్‌ ఎంపీగా ఉన్నారు. మొత్తం మీద ఆయన ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఆయనకు బదులుగా ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు.

Read more!

ఈ నేపథ్యంలో తన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ నామినేషన్‌ సందర్భంగా బ్రిజ్‌ భూషణ్‌ తన సత్తా చాటారు. యూపీ రాజకీయాల్లో తనకున్న పట్టు ఏంటో చూపించారు. ఏకంగా 700 కార్లు, పది వేలకు మందికి పైగా నేతలు, కార్యకర్తలు, అనుచరులతో ర్యాలీ నిర్వహించారు. దీనికి పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు సైతం హాజరు కావడం గమనార్హం.

నామినేషన్‌ కార్యక్రమంలో అందరూ కుర్చీల్లో కూర్చుంటే బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం రాజులాగా సోఫాలో కూర్చుని దర్పం ఒలకబోశారు. కాగా ఉత్తరప్రదేశ్‌ లో విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో బ్రిజ్‌ భూషణ్‌ పాపులర్‌ అయ్యారు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాల్లో ఆయనకు పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడికి బీజేపీ సీటు ఇచ్చింది.

Tags:    

Similar News