రాజుల కోటలో కొత్త లీడర్
విజయనగరం జిల్లా అంటేనే పూసపాటి వారి సంస్థానం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.;
విజయనగరం జిల్లా అంటేనే పూసపాటి వారి సంస్థానం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. సంస్థానాల కాలం నుంచి ఈనాటి ఆధునిక ప్రజాస్వామ్య యుగం దాకా వారిదే అక్కడ రాజ్యం. ఒక్క మాటలో చెప్పాలీ అంటే వారిదే శాసనం. వారి చేతిలోనే చక్రం ఉంటుంది. హవా వారే చలాయిస్తారు. అలా ప్రజాస్వామిక యుగంలో తొలి తరం నేత పీవీజీ రాజుతో మొదలుపెడితే ఈనాటికి అశోక్ గజపతిరాజు దాకా దశాబ్దాలుగా రాజకీయాలలో ఆధిపత్యం చేస్తూనే ఉన్నారు.
కీలక మార్పులతో :
ఇక గత పదేళ్ళుగా చూస్తే మెల్లగా అశోక్ గజపతిరాజు పట్టు తగ్గుతోంది. టీడీపీలో అశోక్ మాటకు తిరుగు లేదని అంతా అంటారు అయితే 2014లో ఆయనను తొలిసారి లోక్ సభకు పోటీ చేయించడంతో జిల్లాలో కొంత వరకూ ఆయన పట్టు సడలింది అని అంటారు. అయితే 2019లో ఆయన మళ్లీ తన పలుకుబడిని సాధించారు ఈసారి ఆయన కుమార్తెను రాజకీయ వారసురాలిగా ముందుకు తీసుకుని వచ్చారు. అయితే వైసీపీ ప్రభంజనంలో తండ్రీ కుమార్తె ఓటమి చూశారు 2024 ఎన్నికల్లో అయితే అశోక్ పోటీ నుంచి తప్పుకోగా కుమార్తె అదితి గజపతిరాజు రంగంలోకి దిగారు ఆమె విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.
నేరుగా రాజ్ భవన్ కి :
ఇక అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్ళిపోయారు కొద్ది నెలల క్రితం ఆయన గోవా గవర్నర్ గా నియమితులు అయ్యారు. దాంతో రాజుల కోటలో రాజకీయం కాస్తా భారీ మార్పులకు లోనవుతోంది. టీడీపీలో ఎల్లవేళలా అశోక్ చక్రం తిప్పే వారు అని అంతా అంటూంటారు. ఇపుడు ఆయన తప్పుకోవడంతో టీడీపీ అధినాయకత్వం కూడా జిల్లా రాజకీయాల మీద పూర్తి ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. సామాజిక రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలని చూస్తోంది అంటున్నారు.
కాపు కాసేది వారే :
ఇక తెలుగుదేశం పార్టీని జిల్లాలో నడిపించేంది కాపు కాసేది ఒక బలమైన సామాజిక వర్గంగా చెబుతున్నారు. ఇంతకాలం వారు చురుకుగా ఉన్నా రాజులకు గౌరవ మర్యాదలు ఇస్తూ వచ్చేవారు. ఇపుడు పెద్దాయన రాజకీయాల నుంచి తప్పుకోవడంతో కాపుల నుంచే సమర్ధ నేతలను ముందుకు తీసుకుని రావాలని చూస్తున్నారు. ప్రస్తుతం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున ఉన్నారు. ఈయన అదే సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో టీడీపీకి కొత్త ప్రెసిడెంట్ జిల్లాలో ఎవరు అన్న చర్చ మొదలైంది. అయితే వచ్చే ఆ నూతన నేత కూడా కాపుల నుంచే వస్తారు అని అంటున్నారు. జిల్లాలో అత్యధిక అసెంబ్లీ సీట్లలో కాపుల ప్రాబల్యం ఉండడంతో పాటు వైసీపీ నుంచి అదే సామాజిక వర్గం నేతలు రాజకీయంగా ముఖ్య పాత్ర పోషించడంతో సామాజిక కోణంలోనే గట్టిగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుని మరీ టీడీపీ హైకమాండ్ లెక్కలు వేస్తోంది అని అంటున్నారు.
జిల్లా మంత్రిగా :
ఇప్పటికే చూస్తే జిల్లా మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ అదే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అలాగే కీలక పదవులు కూడా కాపులకే ఇస్తున్నారు. ఈ జిల్లాలో తూర్పు కాపులు అధికంగా ఉన్నారు. వారంతా బీసీల కేటగిరీకి వస్తారు. టీడీపీ అంటే బీసీల పార్టీగా ముద్ర ఉంది. దాంతో తూర్పు కాపులకు పెద్ద పీట వేయడం ద్వారా రెండిందాలుగా లాభపడాలని చూస్తోంది అని అంటున్నారు. అదే సమయమో మరో బలమైన సామాజిక వర్గం వెలమలకు కూడా ప్రాముఖ్యత ఇస్తూ సమతూకం పాటించాలని నిర్ణయించారు. రానున్న రోజులలో కోట రాజకీయం కాస్తా వేరే రూట్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.