కన్నాను తట్టిలేపిన జగన్!
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పల్నాడు టూర్ కాదు కానీ మాజీ మంత్రి టీడీపీలో చేరి 2024లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ ఒక్కసారిగా బిగ్ సౌండ్ చేశారు;
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పల్నాడు టూర్ కాదు కానీ మాజీ మంత్రి టీడీపీలో చేరి 2024లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ ఒక్కసారిగా బిగ్ సౌండ్ చేశారు. జగన్ ని అసలు ఎందుకు సత్తెనపల్లి వస్తున్నారు అని ప్రశ్నించారు. రెంటపాళ్ళ లో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు మృతికి కారణం జగనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తప్పుడుగా సర్వేలు చేసి ఇచ్చిన డేటాను నమ్ముకుని నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ కట్టి పది కోట్లకు పైగా నష్టపోయారు అని కన్నా చెప్పారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్ర అవమానాలు ఎదురవడంతో, తట్టుకోలేకనే నాగమల్లేశ్వరరావు గత ఏడాది జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణకు జగన్ రావడం సిగ్గు చేటు అన్నారు.
జగన్ ని నమ్ముకుని ఎందరో మునిగారు అని కన్నా తీవ్ర వ్యాఖ్యలే చేశారు . ఆయన కుటుంబంతో సహా అందరూ మోసపోయిన వారే అని అన్నారు. జగన్ అరాచక పాలనను భరిచలేక ప్రజలు గత ఏడాది కేవలం 11 సీట్లు ఇచ్చారని ఈసారి అవి కూడా ఆయనకు రావని కన్నా హాట్ కామెంట్స్ చేశారు. జగన్ అరాచక శక్తులకు మద్దతుగా ఉండడమేంటని నిలదీశారు.
ఇదిలా ఉంటే కన్నా గత ఎన్నికల్లో గెలిచాక మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అది దక్కకపోవడంతో మౌనంగానే ఉంటూ వస్తున్నారు. ఆయన అసెంబ్లీలో కూడా ఏ అంశం మీద కూడా పెద్దగా మాట్లాడటం లేదు అని అంటున్నారు ఇక సత్తెనపల్లిని ఆయన పట్టించుకోవడం లేదని దాంతో వర్గ పోరు హెచ్చిందని కూడా ప్రచారం సాగింది.
కన్నా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వార్తలు ఇంతకాలం వచ్చాయి. ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు అని కూడా చెప్పుకున్నారు. అయితే కన్నా ఇపుడు సడెన్ గా యాక్టివ్ అయ్యారు. ఎంత యాక్టివ్ అయ్యారు అంటే జగన్ వస్తున్నారు అనగా ఒక రోజు ముందు సత్తెనపల్లి లోని వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకుని వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు.
ఇక సత్తెనపల్లిలో అంబటి రాంబాబు భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. పార్టీలో పెద్దగా కదలిక లేదు అని అంటున్నారు. ఈ సమయంలో జగన్ వస్తే పార్టీ పుంజుకుంటుంది అని వైసీపీ నేతలు ఆశిస్తున్న నేపథ్యంలో ఉన్న వైసీపీ కౌన్సిలర్లే టీడీపీలో చేరిపోవడం అంటే భారీ షాక్ అని అంటున్నారు. జగన్ రాక సందర్భంగా పార్టీ బలపడుతుందని అనుకుంటే ఉన్న వారే జంప్ చేయడమేంటని వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇదిలా ఉంటే కన్నాలో ఒక్కసారిగా కనిపించిన ఈ యాక్టివ్ నెస్ ని చూసిన టీడీపీ వర్గాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కన్నాని మొత్తానికి తట్టిలేపి మరీ వైసీపీ కౌన్సిలర్లను కోల్పోయారు అని ఫ్యాన్ పార్టీ మీద సెటైర్లు పడుతున్నాయి.