కామినేని రాయబారం ఫలించేనా ..!
ఉమ్మడి కృష్ణాజిల్లా కైకలూరు ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు కామినేని శ్రీనివాసరావు.. రాయబార రాజకీయాలు చేస్తున్నారని తెలిసింది.;
ఉమ్మడి కృష్ణాజిల్లా కైకలూరు ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు కామినేని శ్రీనివాసరావు.. రాయబార రాజకీయాలు చేస్తున్నారని తెలిసింది. పార్టీ కీలక నాయకుడితో ఆయనకు ఉన్న సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో కూటమి సర్కారులో మంత్రి పీఠం కోసం ఆయన ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీలో అగ్రనాయకుడు ఒకరు జోక్యం కూడా చేసుకున్నట్టు సమాచారం. ఇది బహిరంగ రహస్యమేనని అంటున్నారు.
అయితే.. క్లారిటీ రాకపోయినా.. కామినేనిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ మాత్రం సాగుతుండ డం గమనార్హం. 2014-19 మధ్య ఉన్న టీడీపీ-బీజేపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని చక్రం తిప్పారు. కానీ, తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సామాజిక వర్గాల ప్రభావం కారణంగా బీసీ నాయకుడికి బీజేపీ ఈ పదవిని ఇప్పించింది. ఇప్పుడు కూడా అదే శాఖను బీజేపీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ చూస్తున్నారు.
అయితే.. బీజేపీ బలమైన మద్దతు ఉన్న నేపథ్యంలో తమకు రెండు పదవులు ఇవ్వాలన్న చర్చ ఉంది. దీనిపై అంతర్గంగా కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. అయితే.. చంద్రబాబు మాత్రం ఒక మంత్రి వర్గ స్తానాన్ని మాత్రమే బీజేపీకి కేటాయించారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరిగితే.. ఆ ఒక్కస్థానాన్నితమకు ఇవ్వా లని కామినేని ద్వారా రాయబారం జరుగుతున్నట్టు తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.
ఇప్పుడున్న పరిస్థితిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కామినేనికి అవకాశం ఇస్తే.. ఇదే సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడిని మంత్రి పీఠం నుంచి తప్పించాల్సి ఉంటుంది. లేకపోతే.. మెజారిటీ సామాజిక వర్గం కమ్మలు పెరిగిపోయే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. అయినప్పటికీ.. కామినేని తరఫున గతంలో రాజ్యాంగ బద్ధమైన పెద్ద పదవిని అలంకరించిన కీలక నాయకులు ఇద్దరు రాయబారం చేస్తున్నారని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.