కమల్ హాసన్‌కు కన్నడ చరిత్ర తెలియదా?.. సీఎం సిద్దరామయ్య ఫైర్

'లోకనాయకుడు' కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెద్ద వివాదానికి దారితీశాయి.;

Update: 2025-05-28 10:08 GMT

'లోకనాయకుడు' కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెద్ద వివాదానికి దారితీశాయి. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కన్నడ భాషకు ఉన్న గొప్ప చరిత్ర గురించి కమల్‌కు తెలియదంటూ ఎద్దేవా చేశారు. "కన్నడ భాషకు గొప్ప చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్, అతనికి ఆ విషయం తెలియదు" అని కమల్ హాసన్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి.

ఈ వివాదం మరింత తీవ్రమైంది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా కమల్ హాసన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కమల్ హాసన్ తన మాతృభాషను కీర్తించే ప్రయత్నంలో కన్నడ భాషను అగౌరవపరిచారని ఆయన పేర్కొన్నారు. కమల్ హాసన్ తన అప్ కమింగ్ మూవీ 'థగ్ లైఫ్' ఆడియో లాంచ్‌ సందర్భంగా చెన్నైలో మాట్లాడుతూ.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ మొదట తమిళ భాషపై తన లోతైన అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ ఉయిరే ఉరవే తమిళ్ (నా ప్రాణం, నా కుటుంబం తమిళం) అని అన్నారు.

అదే వేదికపై ఉన్న శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి, "నటుడు శివరాజ్‌కుమార్ నా కుటుంబ సభ్యుడు, మరొక రాష్ట్రంలో నివసిస్తున్నాడు. మీ భాష తమిళం నుంచే పుట్టింది. కాబట్టి మీరు కూడా ఆ వరుసలో చేరిపోయారు" అని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. విజయేంద్ర కమల్ హాసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'థగ్ లైఫ్' ఆడియో లాంచ్ సందర్భంగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు "వెంటనే కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని" డిమాండ్ చేశారు.

ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా విజయేంద్ర .. "కళాకారులకు ప్రతి భాషను గౌరవించే సంస్కృతి ఉండాలి. కన్నడతో సహా అనేక భారతీయ భాషల్లో నటించిన నటుడు కమల్ హాసన్, కన్నడను అవమానించడం అహంకారానికి పరాకాష్ఠ" అని పేర్కొన్నారు. "కన్నడ శతాబ్దాలుగా భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఒక ప్రముఖ భాష" అని ఆయన చెప్పారు.

మంగళవారం 'థగ్ లైఫ్' సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరులో ఉన్న కమల్ హాసన్, కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు తనను నిలదీయడానికి రాకముందే వేదికను విడిచివెళ్లినట్లు సమాచారం. కర్ణాటక రక్షణ వేదికే (ప్రవీణ్ శెట్టి వర్గం) అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. కర్ణాటకలో వ్యాపారం చేయాలనుకుంటున్నారు. మీ సినిమాలు చూపించాలనుకుంటున్నారు. అప్పుడు కన్నడను అవమానించడం ఆపాలని హెచ్చిరించారు. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత రాజుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News