అవునా కవితమ్మ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా?

ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవితకు ప్రజాసమస్యలు గుర్తుకొస్తున్నాయి

Update: 2024-02-24 06:00 GMT

ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవితకు ప్రజాసమస్యలు గుర్తుకొస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు సమస్యలపై మాట్లాడని కవిత ఇపుడు మాత్రం పదేపదే సమస్యలను ప్రస్తావిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు విషయం ఏమిటంటే మహిళలకు ఉద్యోగాల్లో వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేయాలని, గురుకులాల్లో విద్యార్ధినుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తానని, అందరూ తనతో కలిసి రావాలని కవిత పదేపదే పిలుపిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పదేళ్ళు అధికారంలో ఉన్నది తమ పార్టీయే. ముఖ్యమంత్రిగా పనిచేసింది తన తండ్రి కేసీయారే అని అందరికీ తెలుసు. అయితే అప్పట్లో మహిళలకు ఉద్యోగాల్లో వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఏరోజు డిమాండ్ చేయలేదు. అప్పటి నుంచే గురుకులాల్లో విద్యార్ధినుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటిపై స్పందించాలని, విచారణ జరిపించాలని, బాద్యులపైన చర్యలు తీసుకోవాలని ఏరోజు డిమాండ్ చేయలేదు. ఇక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటుచేయాలన్న డిమాండ్ కూడా విచిత్రంగానే ఉంది.

Read more!

తాము అధికారంలో ఉన్నపుడు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటుచేయమని కవిత తన తండ్రి కేసీయార్ ను ఎందుకు అడగలేదు ? విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత అడిగితే, కేసీయార్ ప్రయత్నిస్తే ఎవరైనా అడ్డుకున్నారా ? అధికారంలో ఉన్నంతకాలం హ్యాపీగా ప్రోటోకాల్, పదవులను అనుభవించిన కవితకు ఇపుడు ప్రజాసమస్యలు గుర్తుకురావటమే విచిత్రంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో కూడా కవిత పెద్ద డ్రామానే నడిపినట్లు అప్పట్లో కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఎందుకంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని డిమాండ్ చేసిన కవిత తమ పార్టీలో, ప్రభుత్వంలో రిజర్వేషన్ అమలుగురించి ఎప్పుడూ మాట్లాడులేదు. 33 శాతం అసెంబ్లీ టికెట్లు ఇవ్వమని కాని, మంత్రివర్గంలో 33 శాతం మంది మహిళలను తీసుకోమని కాని కేసీయార్ను ఎందుకు డిమాండ్ చేయలేదో. ముందు తన తండ్రి నుండి రిజర్వేషన్ అమలుకు ప్రయత్నించకుండా జాతీయస్ధాయిలో నానా హడావుడి చేయటాన్ని అప్పట్లో చాలామంది తప్పుపట్టారు. ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే కవిత సమస్యలు గుర్తుకు రావటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News