కవిత పార్టీ మే లో.. డిపాజిట్స్ వస్తాయా?
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కవిత తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు.;
తెలంగాణ ఉద్యమ గడ్డపై 'బతుకమ్మ' సాక్షిగా సాంస్కృతిక కెరటమై ఎగిసిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు రాజకీయ విధిరాతను మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. కన్న తండ్రి నీడ నుంచి, సొంత పార్టీ ఛత్రం నుంచి బయటకు వచ్చి, మే నెలలో కొత్త పార్టీ ప్రకటనతో సమరశంఖం పూరిస్తున్నారు. అయితే గులాబీ తోటలో పెరిగిన కవితకు.. బయట ఎదురుకాబోయే రాజకీయ ఎండమావులు ఎదురొడ్డి నిలుస్తాయా? లేక ఆమె రాజకీయ ప్రస్థానానికి 'డిపాజిట్ల' గండం పొంచి ఉందా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అసలైన మిలియన్ డాలర్ల ప్రశ్న
తెలంగాణ రాజకీయ యవనికపై మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. బీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ గారాల పట్టి, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో అసలు కవిత పార్టీ మనుగడ సాగిస్తుందా? ఆమె వేస్తున్న అడుగులు ఆమెకు రాజకీయ పునర్జన్మను ఇస్తాయా లేక డిపాజిట్లు కూడా కష్టమేనా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది..
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కవిత తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. మే నెలలో తన కొత్త పార్టీని ప్రకటించేందుకు ఆమె ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ జాగృతిని ఒక రాజకీయ శక్తిగా మార్చడం ద్వారా రాష్ట్రంలో కేవలం భావోద్వేగాలే కాకుండా 'నిజమైన తెలంగాణ ఆకాంక్షల'ను నెరవేరుస్తామని ఆమె చెబుతున్నారు.
అయితే ఆమె లక్ష్యం కేవలం పార్టీ స్థాపనే కాదు... సొంత అన్న కేటీఆర్, బావ హరీష్ రావులకు రాజకీయంగా సవాల్ విసరడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ వివాదాల నుంచి బయటపడి, తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకుని సృష్టించుకోవాలని ఆమె భావిస్తున్నారు.
సిద్దిపేట నుంచే సమరశంఖం: హరీష్ రావుకు చెక్ పెట్టడమే లక్ష్యమా?
కవిత తన కొత్త పార్టీ తరపున సిద్దిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సిద్దిపేట ఎందుకంటే ఇది కేసీఆర్ కుటుంబానికి కంచుకోట, హరీష్ రావుకు ప్రాణప్రదం. ఒకవేళ ఇక్కడి నుంచి కవిత పోటీ చేస్తే అది కేవలం అసెంబ్లీ సీటు కోసం కాకుండా కేసీఆర్ రాజకీయ వారసత్వంపై తన హక్కును చాటుకోవడమే అవుతుంది. ఇక మరో సీటు బోధన్.. తన పాత నియోజకవర్గమైన నిజామాబాద్ పరిధిలో ఉన్న బోధన్ నుంచి పోటీ చేయడం ద్వారా తన పాత కేడర్‌ను ఆకర్షించాలని ఆమె చూస్తున్నారు.
సవాళ్ల సుడిగుండంలో కొత్త పార్టీ: డిపాజిట్లు దక్కుతాయా?
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కవిత ముందున్న మార్గం పూలబాట కాదు. ఆమె పార్టీకి ప్రధానంగా ఎదురయ్యే సవాళ్లున్నాయి. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఆమెకు ఉన్నంత బలం ఇప్పుడు లేదు. ఆమె వెంటే నడిచే నాయకులు ఎంతమంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సోషల్ మీడియాలో టీవీ చర్చల్లో ఆమె పేరు వినిపిస్తున్నా, అది ఓట్లుగా మారుతుందా అన్నదే పెద్ద ప్రశ్న. గతంలో షర్మిల, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వంటి వారు పెట్టిన పార్టీలకు పట్టిన గతే కవిత పార్టీకి పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి, బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ ఉంది. ఈ మూడు భారీ శక్తుల మధ్య నాలుగో శక్తిగా ఎదిగి డిపాజిట్లు కాపాడుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. లిక్కర్ స్కామ్, అవినీతి ఆరోపణల నీడ నుంచి ఆమె ఎంతవరకు ప్రజలను తనవైపు తిప్పుకోగలరనేది కీలకం.
ఇదొక జూదమా?
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఒకప్పుడు కేసీఆర్ కూడా ఒంటరిగానే ప్రయాణం మొదలుపెట్టారు. కానీ కవిత పరిస్థితి వేరు. తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి అన్నతో విభేదించి సొంతంగా ఎదగడం అనేది అతిపెద్ద రిస్క్. ఆమె తనపై ఉన్న రాజకీయ ముద్రను చెరిపేసి ప్రజల మనసు గెలిస్తేనే కనీసం డిపాజిట్లు దక్కే అవకాశం ఉంటుంది. లేదంటే ఇది మరో రాజకీయ ప్రయోగంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.