కళాకు ఆ పదవి ఇస్తున్నారా.. క్లారిటీ ఇదే.. !
పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు.. కళా వెంకట్రావు పేరు అనూహ్యంగా తెరమీదికి వచ్చింది.;
పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు.. కళా వెంకట్రావు పేరు అనూహ్యంగా తెరమీదికి వచ్చింది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగానే కాకుండా.. 2014-19 మధ్య రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.గత ఎన్నికల్లో తనకు కలిసి వచ్చిన ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నా.. కూటమి ఈక్వేషన్లలో భాగంగా ఆయనకు ఈ సీటు దక్కలేదు.
ఇక, తాజాగా ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి చైర్మన్‌ను చేయనున్నారంటూ.. ఓ వర్గం మీడియాలో ప్రచారం ప్రారంభం అయింది. అయితే.. ఇది జగన్ అనుకూల మీడియా కాకపోవడంతో పాటు తరచుగా చంద్రబాబుకు అనుకూలంగా ఉండే మీడియా కావడం ఈ వార్తకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడును తప్పించనున్నారని.. ఈ స్థానంలో కళాకు అవకాశం ఇవ్వనున్నారని అంటున్నారు.
దీనిపై తాజాగా టీడీపీలోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వ్యక్తిగతంగా కళా.. మంచి నాయకుడు కావడంతోపాటు.. భక్తి పరుడు కూడా కావడం గమనార్హం. హిందూత్వం పట్ల ఆయనకు సంపూర్ణ విశ్వాసం కూడా ఉంది. దీంతో ఈ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. ఇప్పటికిప్పుడు బీఆర్ నాయుడును తప్పించే అవకాశం ఉద్దేశం కూడా సీఎం చంద్రబాబు కు లేదని సీనియర్లు చెబుతున్నారు. టీటీడీ చైర్మన్ పదవిలో ఎవరు ఉన్నా.. ఆరోపణలు సహజమేనని అంటున్నారు.
అయితే.. వచ్చే ఎన్నికలకు ముందు మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ కళాను ప్రత్యక్ష రాజకీయాలను తప్పించాలని అనుకుంటే.. ఆయనను నొప్పించకుండా.. టీటీడీ పదవిని ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలోనూ పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఇలానే ఎన్నికలకు ముందు పదవి ఇచ్చారు. అయితే.. ఆయన చైర్మన్‌గా ఉండి కూడా.. 2019లో మైదుకూరు నుంచి పోటీ చేశారు. కానీ.. కళాను తప్పించే అవకాశం ఉందో లేదో తెలియాల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం అయితే.. నాయుడును తప్పించే ఉద్దేశం పార్టీకి లేదని చెబుతున్నారు.