జగన్ జాగ్రత్త ...గవర్నర్ వద్దకు వైసీపీ !
ఏపీలో మెగా డీఎస్సీ రాజకీయ సమరంగా మారిపోయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని శాప్ ఆఫీసు వద్ద సోమవారం జరిగిన వైసీపీ నిరసన దరిమిలా ఇది మరింతగా రాజుకుంది.
ఏపీలో మెగా డీఎస్సీ రాజకీయ సమరంగా మారిపోయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని శాప్ ఆఫీసు వద్ద సోమవారం జరిగిన వైసీపీ నిరసన దరిమిలా ఇది మరింతగా రాజుకుంది. ఇపుడు ఏపీలో అరెస్టుల పర్వం సాగుతోంది. టీచర్ల మీద వైసీపీ నేతలు దాడి చేశారు అంటూ పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తూంటే వైసీపీ మరింత తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. ఫేక్ నిరసనలతో తమకు పోటీగా చేయించి తమపైన దాడులు చేశారని మండిపడుతోంది. దీని మీద తాము తగ్గేది లేదని జగన్ అంటున్నారు. వైసీపీ శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తే టీడీపీ ప్రోత్సాహంతో వారి మీద దాడులు జరిగాయని వైసీపీ అంటోంది. దీని మీద పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది తీవ్రమైన అంశం :
ఏపీలో శాంతియుతంగా నిరసనలు నిర్వహించుకునే అవకాశం లేదా అని జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. దీని మీద గవర్నర్ ని కలవాలని వైసీపీ నిర్ణయించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ కి మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలను వివరించడమే కాకుండా సీబీఐ విచారణ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ నాయకత్వంలో వైసీపీ బృందం కోరనుంది అని అంటున్నారు. అలాగే విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమాల నేపధ్యంలో వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేశారు అని గవర్నర్ దృష్టికి తీసుకుని రావాలని వైసీపీ నిర్ణయించింది. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది అని అంటున్నారు.
లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ :
మరో వైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాజాగా పర్యటించిన విద్యా శాఖ మంత్రి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ జగన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ జాగ్రత్తగా ఉండు అని ఆయన హాట్ కామెంట్స్ చేయడం విశేషం. మా టీచర్ల మీద వైసీపీ వారితో దాడులు చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విధంగా చేయాలని చూస్తే దబిడి దిబిడే అని గట్టిగానే స్పష్టం చేశారు. జగన్ మాదిరిగా తాను లేను అని ఆయన అన్నారు. జగన్ విదేశాలకు వెళ్ళాలీ అంటే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. తాము నిజాయితీగా ఉంటున్నామని తప్పు చేయడం అన్నది లేనే లేదని లోకేష్ స్పష్టం చేశారు.
చర్చకు సవాల్ చేసినా :
మెగా డీఎస్సీ మీద తాను చర్చకు సిద్ధం అని సవాల్ చేసినా జగన్ ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. తాము పారదర్శకంగా ఉన్నాం కాబట్టే చర్చకు పిలుస్తున్నామని అన్నారు. మెగా డీఎస్సీ మీద లేని పోని నిందలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని లోకేష్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఎన్నడూ లేని విధంగా జగన్ మీద లోకేష్ బిగ్ సౌండ్ చేశారు. జగన్ జాగ్రత్త అని నేరుగానే వార్నింగ్ ఇవ్వడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఏ కీలక మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.