భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇంకా అమెరికా దగ్గరే కొన్ని చిక్కులు!
| భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని, ఇంకా కొన్ని అంశాలు అమెరికా వైపు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఒప్పందం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న చర్చల్లో చాలావరకు సమస్యలు పరిష్కార మయ్యాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. అయితే ఇంకా తేలాల్సిన కొన్ని అంశాలు అమెరికా వైపే ఉన్నాయని ఆయన చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడిన జైశంకర్.. చర్చలు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. త్వరలోనే ఒప్పందం పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే చివరి దశలో చర్చలు కాస్త ఆలస్యమైనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇలాంటి వ్యవహారాలకు సమయం పడుతుందని అన్నారు.
చర్చల సందర్భంగా భారత్ కంటే అమెరికా వైపే ఎక్కువ మార్పులు చోటు చేసుకున్నాయని జైశంకర్ వెల్లడించారు. అయితే ఏయే అంశాల్లో అమెరికా వెనక్కి తగ్గిందనే వివరాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు.
ఈ ఒప్పందం విషయంలో భారత్‌కు కొన్ని స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. అమెరికాతో వ్యాపారం పెరగడం ఒక్కటే కాకుండా, ఇతర దేశాలతో పోటీపడే రంగాల్లో మన కంపెనీలకు మెరుగైన అవకాశాలు రావాలని కేంద్రం భావిస్తోంది. ఒప్పందం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం ఉండాలని జైశంకర్ కూడా స్పష్టం చేశారు.
మరోవైపు, ఒప్పందం ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. చర్చల్లో మిగిలిన అంశాలు పరిష్కారమైతేనే రెండు దేశాలు తుది నిర్ణయానికి రానున్నాయి. అప్పటివరకు ఈ వాణిజ్య ఒప్పందంపై ఎదురుచూపులు తప్పేలా లేవు.