నో రాజీ....ఎక్కువ సీట్లలోనే జనసేన ?

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ విషయంలో జనసేన పక్కా క్లారిటీతో ఉంది. ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేకుండా బలం ఉన్న చోట్ల పోటీకి సిద్ధపడాలని చూస్తోంది.

Update: 2026-09-22 15:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ విషయంలో జనసేన పక్కా క్లారిటీతో ఉంది. ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేకుండా బలం ఉన్న చోట్ల పోటీకి సిద్ధపడాలని చూస్తోంది. ఇక పిఠాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో కూటమి బలంగా ఉండాలని గట్టిగా కోరుకున్నారు. అదే సమయంలో జనసేన ఆత్మగౌరవానికి భంగం కలగకుండా అంతా కలిసి ముందుకు సాగుతామని అన్నారు. ఇక పవన్ ఆద్వర్యంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర కీలక నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా జనసేన బలం ఉన్న చోట పోటీ పడాలని నేతలు పేర్కొన్నట్లుగా తెలిసింది. అంతా కూర్చుని ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధిస్తామని కూడా జనసేనలో ఒక నమ్మకం కనిపిస్తోంది.

కార్యకర్తలకు చాన్స్ గా :

స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జనసేన కార్యకర్తలకు మంచి అవకాశంగా చూస్తున్నారు. పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన వారికి ఈ విధంగా అధికార పదవులు దక్కుతాయని అందువల్ల వారిని ప్రోత్సహించాలని జనసేన భావిస్తోంది అని అంటున్నారు. ఈ విషయంలో కూటమి పార్టీలను ఒప్పించి అయినా ఎక్కువ సీట్లు తీసుకోవాలని జనసేన చూస్తోంది అంటున్నారు. జనసేన బలం కూడా బాగా పెరిగింది అని విశ్లేషిస్తున్నారు. దాంతో ఈసారి తమ వాటా కూడా పోటీ చేసే విషయంలో ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ సైతం జనసేన బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 నాటి ఫార్ములా అన్నది కుదరదు అన్నట్లుగా జనసేన తేల్చేసింది అని అంటున్నారు. 15 శాతం సీట్లతో జనసేన పోటీ చేయదని ముందే చెప్పినట్లుగా 30 శాతం సీట్లను తీసుకుంటుందని అంటున్నారు.

క్యాడర్ వేడి తగ్గింది :

ఇదిలా ఉంటే పిఠాపురంలో బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ జనసేన క్యాడర్ వేడి తగ్గిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తగ్గిన వేడిని మళ్లీ ఎలా తీసుకుని రావాలో తనకు బాగా తెలుసు అన్నారు. అధికారంలోకి వచ్చామని మెత్తబడితే కుదరదు అని క్యాడర్ కి ఆయన సందేశం ఇచ్చారు. ఇంకో వైపు చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఏర్పాటు చేసిన ఫైవ్ మెన్ కమిటీ పనితీరు మీద పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కమిటీ పనితీరు బాగా లేదని అన్నారు. ఎలా సెట్ చేయాలో కూడా చూస్తామని అన్నారు. పిఠాపురంలో క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

పనులు ఎలా చేయాలో తెలుసు :

తాను పిఠాపురంలోనే కూర్చుంటే పనులు కావని అన్నారు. ఏ పనులకు ఎక్కడ ఈ తీగ కదపాలో తనకు తెలుసు అని పవన్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఉప్పాడ తీరం రక్షణ గోడ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చామని పవన్ చెప్పారు. పిఠాపురాన్ని ఒక మోడల్ అసెంబ్లీ నియోజకవర్గంగా అభివృద్ధి విషయంలో చేస్తామని అన్నారు. ఈ విషయంలో చిత్త శుద్ధితో పనిచేస్తామని పవన్ స్పష్టం చేశారు.

కృతజ్ఞత ఎక్కువ :

ఇదే సందర్భంలో పవన్ మరి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు కృతజ్ఞత ఎక్కువ అని అన్నారు. అలాగే ఎవరైనా కష్టంలో ఉంటే అండగా నిలుస్తాను అన్నారు. ఇది ఈ నేల నుంచి భారతీయ సంస్కృతి నుంచి తాను నేర్చుకున్నాను అని చెప్పారు. అదే సమయంలో జనసేన కోసం ప్రజల కోసం తాను చేయాల్సినవి చేస్తాను అని కూడా చెప్పారు. మొత్తానికి పవన్ కృతజత అలాగే కష్టాల్లో అండగా ఉన్నామని చేసిన వ్యాఖ్యలు దేని గురించి అన్నది ఇపుడు చర్చ సాగుతోంది.

Tags:    

Similar News