జనాభా పెంచండి.. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపేయండ్రోయ్.. కేంద్రం షురూ చేసింది..
దేశంలో జనాభా నియంత్రణ కోసం దశాబ్దాలుగా అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ విధానాలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.
దేశంలో జనాభా నియంత్రణ కోసం దశాబ్దాలుగా అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ విధానాలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. భారత్‌లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతుండటం.. కొన్ని రాష్ట్రాల్లో జననాల రేటు రీప్లేస్‌మెంట్ స్థాయి కంటే దిగువకు పడిపోవడంతో భవిష్యత్‌లో వృద్ధ జనాభా పెరగడం.. పనిచేసే వయసు జనాభా తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణకు సంబంధించిన ప్రోత్సాహకాలు, నిరుత్సాహక విధానాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ- పీఎం) సూచించింది.
ఈఏసీ- పీఎం ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. భారత్ మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 1.9కి పడిపోయింది. ఇది జనాభా స్థిరంగా ఉండేందుకు అవసరమైన రీప్లేస్‌మెంట్ స్థాయి 2.1 కంటే తక్కువ. బిహార్, ఉత్తరప్రదేశ్‌లను మినహాయిస్తే దేశంలోని టీఎఫ్ఆర్ సుమారు 1.6గా ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీఎఫ్ఆర్ 1.4, తెలంగాణలో 1.5, కర్ణాటకలో 1.5, కేరళలో 1.3, తమిళనాడులో 1.3గా నమోదైందని ఈఏసీ- పీఎం వివరించింది.
కుటుంబ నియంత్రణ ప్రోత్సాహకాలపై పునరాలోచన
తగ్గుతున్న జననాల నేపథ్యంలో కుటుంబ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కొన్ని ప్రోత్సాహకాలు, రెండు పిల్లల నిబంధన ఆధారంగా ఉన్న కొన్ని నిరుత్సాహక విధానాలను పునఃపరిశీలించాలన్నది ఈ చర్చలో ప్రధాన అంశంగా మారింది. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునే వారికి ఇచ్చే పరిహారం, ఆరోగ్య కార్యకర్తలకు అందించే కొన్ని ప్రోత్సాహకాలు వంటి అంశాలను సమీక్షించాల్సిన అవసరాన్ని నివేదిక ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి.
అదేవిధంగా ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేసే నిబంధనలను కూడా పునఃసమీక్షించాలని సూచనలు ఉన్నాయి. ఇటువంటి నిబంధనలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రూపాల్లో అమల్లో ఉన్నాయి. అయితే వీటిని తొలగించడం లేదా మార్చడం అనేది కేంద్రం ఒక్కటే తీసుకునే తక్షణ నిర్ణయం కాదు.. సంబంధిత రాష్ట్రాల చట్టాలు, విధానాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువ
భారత్ జనాభా విషయంలో ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంటోంది. ఒకప్పుడు అధిక జనాభా పెరుగుదల దేశానికి ప్రధాన సవాలుగా ఉండగా.. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో తక్కువ జననాలు, వృద్ధ జనాభా పెరుగుదల కొత్త సమస్యగా మారుతున్నాయి. ఈఏసీ- పీఎం ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే రెండు దశాబ్దాలకు పైగా రీప్లేస్‌మెంట్ ఫెర్టిలిటీ కంటే దిగువన ఉన్నాయి. ఫలితంగా భవిష్యత్‌లో వృద్ధుల సంఖ్య పెరగడంతో పాటు పనిచేసే వయసు జనాభా వాటా తగ్గే పరిస్థితి ఏర్పడవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
అయితే మరోవైపు కుటుంబ నియంత్రణ సేవలను పూర్తిగా నిలిపివేయడం అనే అర్థంలో ఈ చర్చను చూడటం సరైంది కాదు. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ఎన్.ఎఫ్.హెచ్ఎస్ వివరాల ప్రకారం దేశంలో గర్భనిరోధక వినియోగ రేటు 66.7 శాతం నుంచి 69.1 శాతానికి పెరిగింది. అలాగే గర్భధారణను ఆలస్యం చేయాలని లేదా నివారించాలని కోరుకుంటున్నప్పటికీ ఎలాంటి గర్భనిరోధక పద్ధతిని ఉపయోగించని వారి మొత్తం అవసరం 9.4 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గింది.
అందువల్ల ప్రస్తుతం దేశంలో జరుగుతున్న చర్చ కుటుంబ నియంత్రణను పూర్తిగా రద్దు చేయాలా అనే దానికంటే.. ప్రాంతాల వారీగా మారుతున్న జనాభా పరిస్థితులకు అనుగుణంగా విధానాలను ఎలా మార్చాలి అన్నదానిపై ఎక్కువగా కేంద్రీకృతమైంది. ఒకవైపు జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అవసరం కొనసాగుతుండగా.. మరోవైపు తక్కువ జననాలున్న రాష్ట్రాల్లో కుటుంబాలను పెంచేందుకు అనుకూలమైన సామాజిక, ఆర్థిక విధానాల అవసరం పెరుగుతోంది.
భారత్ ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచి జనాభా సమతుల్యత వైపు తన విధాన దృష్టిని మార్చాల్సిన దశలోకి ప్రవేశిస్తోందన్నది ఈ నివేదికల ద్వారా స్పష్టమవుతున్న ప్రధాన అంశం.