పాక్ కు ఉప్పందించిందా? ఉగ్రదాడికి ముందు పహల్గాంకు జ్యోతి మల్హోత్రా..

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలపై హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయ్యారు.;

Update: 2025-05-19 07:50 GMT

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలపై హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయ్యారు. ఆమె కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్ర దాడికి కొద్ది నెలల ముందు ఆమె ఆ సున్నితమైన ఈ పహల్గాం ప్రాంతాన్ని సందర్శించినట్లు దర్యాప్తులో బయటపడింది.

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడికి సుమారు మూడు నెలల ముందు జ్యోతి మల్హోత్రా అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఆమె అక్కడ వీడియోలు కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. పహల్గాంకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమె పాకిస్థానీ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని భద్రతా సంస్థలు తీవ్రంగా అనుమానిస్తున్నాయి. ఈ కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

గూఢచర్యం ఆరోపణలపై గత వారం హరియాణా పోలీసులు జ్యోతిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఆమె పాకిస్థాన్ ఇంటర్‌-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో సంబంధాలున్నట్లు భావిస్తున్న పాకిస్థాన్ హైకమిషన్‌ ఉద్యోగి డానిష్‌తో సన్నిహితంగా మెలిగినట్లు తేలింది. డానిష్ జ్యోతిని ట్రాప్ చేసి, ఆమె ద్వారా సమాచారం రాబట్టాలని ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు.

ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్‌గా వ్యవహరిస్తున్న జ్యోతి మల్హోత్రా 'Travel With Jo' పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోంది. 2023లో ఆమె పాకిస్థాన్‌లో పర్యటించిన సమయంలో డానిష్‌తో పరిచయం ఏర్పడింది. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా డానిష్‌తో ఆమె నిరంతరం సంప్రదింపులు జరిపింది. డానిష్ సూచనల మేరకు ఆమె అలీ అహ్సాన్ అనే మరో వ్యక్తిని కలిసింది. ఇతడు జ్యోతిని పాకిస్థాన్‌కు చెందిన నిఘా, రక్షణ విభాగాధికారులకు పరిచయం చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

పహల్గాం దాడికి ముందు జ్యోతి పలుమార్లు పాకిస్థాన్‌లో పర్యటించిందని, ఒకసారి చైనాకు కూడా వెళ్లి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. 'ఆపరేషన్ సింధూర్' అనంతర ఉద్రిక్తతల సమయంలోనూ ఆమె దిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో నిర్ధారించారు. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని జ్యోతి పాకిస్థానీ వ్యక్తులకు చేరవేసిందని అధికారులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాను పోలీసులు విచారిస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా భారత్‌లో నిలిపివేశారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News