జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఉప రాష్ట్రపతి పదవికి అనూహ్యంగా బరిలోకి వచ్చిన వారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన దాదాపుగా యాభై ఏళ్ళ పాటు న్యాయవాద వృత్తిలో ఉంటూ సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.;
ఉప రాష్ట్రపతి పదవికి అనూహ్యంగా బరిలోకి వచ్చిన వారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన దాదాపుగా యాభై ఏళ్ళ పాటు న్యాయవాద వృత్తిలో ఉంటూ సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఏడున్నర పదుల వయసులో ప్రస్తుతం విశ్రాంత న్యాయమూర్తి గా ఉన్న ఆయన ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీదారుగా నిలిచారు. దేశ రాజకీయాల్లో చూస్తే కనుక ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా ఉంది. రాజ్యాంగ బద్ధ పదవులలో రెండవ కీలకమైన పదవి ఉపరాష్ట్రపతి. ఈ పదవి మీద సుదర్శన్ రెడ్డి ఆలోచనలను మీడియాతో తాజాగా పంచుకున్నారు. అసోం పర్యటనలో భాగంగా గౌహతిలో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.
న్యాయమూర్తి లాగా ఉండాలి :
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆరు న్యాయమూర్తిగానే వ్యవహరించాలి అని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇది ఒక సాధారణమైన రాజకీయ పదవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చున్న వారికి ఉండాల్సిన లక్షణాలు న్యాయంగా వ్యవహరించడం, ప్రతీ అంశం మీద హేతుబద్ధంగా ఆలోచనలు చేయడం, పక్షపాత రహితంగా ఉండడం అని ఆయన విశ్లేషించారు. ఎంతో ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వారు ఈ విధంగానే వ్యవహరించాలన్నది తన భావనగా చెప్పారు. రాజకీయాలతో ఆ పదవికి ముడి పెట్టడం తగదని ఆయన అన్నారు న్యాయంగానే ఉంటూ అందరినీ సమానంగా చూసే మౌలిక లక్షణాలు కలిగి ఉండాలని అన్నారు.
గెలుపు ధీమాతోనే :
ఇండియా కూటమి అభ్యర్ధిగా పోటీలో ఉన్న సుదర్శన్ రెడ్డి గెలుపు ధీమాను కలిగి ఉన్నారు. ఎలక్ట్రోల్ కాలేజీ లెక్కలలో ఎన్డీయే కూటమికి అధిక మెజారిటీ కనిపిస్తున్నా ఆయన మాత్రం గెలుస్తాను అంటున్నారు. ఇది రాజకీయాలకు సంబంధించిన ఎన్నిక కాదని అంటున్నారు. అంతే కాదు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసే అవకాశం లేదని ఆన్నారు. అందువల్ల ఎవరికి వారుగా ఆత్మ ప్రబోధం మేరకే ఓటు వేస్తారు అని అందుకే తన గెలుపు మీద ధీమా ఉందని చెబుతున్నారు. తనకు అనేక మంది ఎంపీల మద్దతు ఉందని ఆయన అంటున్నారు. తటస్థ పార్టీలతో పాటు ఆప్ లాంటి పార్టీలు నామినేషన్ రోజే మద్దతు ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు.
అందరికీ ఓటు హక్కు ఉండాల్సిందే :
కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మీద కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్చగా పక్షపాత రహితంగా దేశంలో ఎన్నికలు జరిపించే విషయంలో ఈసీ పాత్ర ఎన్నదగినది అన్నారు. ఈసీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా పేర్కొన్నారు. కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ లేక లింగ వివక్ష పేదరికం కానీ ఇలా ఏ అంశం కూడా ఓటరు కి ఉండే పవిత్రమైన ఓటు హక్కు నుంచి దూరం చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగానే ఈసీ కార్యకలాపాలు ఉండాలని అన్నారు.
గట్టి పోటీకి రెడీ :
ఇదిలా ఉంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి బలమైన అభ్యర్థి అన్న భావనను అయితే ఆయన కలుగజేశారు. ఆయన తనకు న్యాయ వ్యవస్థలో ఉన్న విశేష అనుభవంతో పాటు రాజ్యంగం మీద ఉన్న అవగాహన తన నిండు జీవితంలో సాధించిన అనుభవం అన్నీ కలసి మేళవించి మీడియా ముందు కానీ లేక ఎంపీలు పార్టీల సమావేశాలలో కానీ స్పూర్తివంతమైన సందేశాన్నే ఇస్తున్నారు. రాజ్యాంగ బద్ధ పదవులలో ఉండేవారు ఎలా వ్యవహరించాలో ఆయన చెబుతున్న తీరు సైతం ఆకట్టుకుంటోంది. ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ప్రచారం కానీ ఆయన నిబద్ధత కానీ అనుభవం కానీ ఏ మేరకు ఫలితాలను అనుకూలంగా చేస్తాయో చూడాల్సి ఉంది.