ఆ ఓట్లు మావే అంటున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి...ఎవరా ఎంపీలు ఏమా పార్టీలు ?
దేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. మామూలుగా చూస్తే ఇవి రాజ్యాంగబద్ధమైన పదవికి జరిగే ఎన్నికలు.;
దేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. మామూలుగా చూస్తే ఇవి రాజ్యాంగబద్ధమైన పదవికి జరిగే ఎన్నికలు. పైగా పరోక్ష ఎన్నికలు. వీటికి అంతగా రాజకీయ ప్రాముఖ్యత అయితే ఉండదు. కానీ ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితులు పోటా పోటీగా ఉన్న రాజకీయ వాతావరణం ఒక వైపు ఎన్డీయే మరో వైపు ఇండియా కూటమి మోహరించి ఉన్న తీరు ఇవన్నీ కూడా ఉప రాష్ట్రపతి ఎన్నికలను పూర్తిగా ఆసక్తికరంగా మార్చేశాయి.
మెజారిటీ ఎన్డీయేకు ఉన్నా :
ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి ఎన్నికలలో లోక్ సభ రాజ్యసభ ఎంపీలు ఓటు చేస్తారు అలా చూస్తే ఎలక్ట్రోల్ కాలేజిలో మొత్తం 788 దాకా ఎంపీ ఓట్లు ఉంటే అందులో సగానికి పైగా ఓట్లు వచ్చిన వాఏ ఉప రాష్ట్రపతి అవుతారు. అలా చూసుకుంటే 392 ఓట్లు ఎవరికి వస్తే వారే నెగ్గుతారు. సంఖ్యాబలం చూస్తే కనుక ఎన్డీయేకు 422 మంది దాకా ఎంపీలు ఉన్నారు ఇంకా వైసీపీ వంటి పార్టీల మద్దతు కూడా ఉంది. దాంతో గెలుపు సులువు అని భావిస్తున్నారు.
ఇండియా కూటమి ధీమా :
మరో వైపు చూస్తే ఈ ఎన్నికల్లో సంఖ్యా బలం ఎన్డీయే కూటమికి ఉన్నా కూడా తమకూ చాన్స్ ఉందని ఇండియా కూటమి భావిస్తోంది అదెలా ఉంటే ఎన్డీయే కూటమి నుంచి తమకు ఈ సమయంలో ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయని ఆశిస్తునారు. అంతే కాదు ఇండియా కూటమి ఎన్డీయే కూటమి రెండింటిలోనూ లేని పార్టీల నుంచి ఓట్లు కూడా ఎక్కువగా తమవైపు టర్న్ అవుతాయని భావిస్తున్నారు.
ఇండీ కూటమిలో లేని ఎంపీల మద్దతు :
ఇండియా కూటమిలో లేని ఎంపీల నుంచి కూడా తనకు మద్దతు దక్కుతోందని ఆ కూటమి తరఫున ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంటున్నారు. ఇండియా కూటమిలో లేని వ్యక్తులూ తనకు మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్నారని ఆయన చెబుతూ ఒక సంచలనమే రేపారు. అలా తనకు దన్నుగా ముందుకు వస్తున్న వాళ్లందరికీ తన ధన్యవాదాలు అని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలలో పర్యటిస్తున్న ఆయన ఈ రకమైన ప్రకటన ఇవ్వడంతో అది అతి పెద్ద చర్చకు తావిస్తోంది. ఏ పార్టీల నుంచి ఎంపీలు మద్దతు ఇస్తున్నారు ఏమా కధ అన్నది అంతా ఆలోచిస్తున్నారు.
పార్టీలకు అతీతంగానే :
తన అభ్యర్ధిత్వం పట్ల పార్టీలకు రాజకీయాలకు అతీతంగానే మద్దతు దక్కుతోందని ఆయన అంటున్నారు. తనకు ఉన్న అర్హతలు అలాగే విలువలను గమనించి దాని ఆధారంగానే పార్టీలకు అతీతంగా తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలని పార్లమెంటు ఉభయ సభల ఎంపీలను ఆయన గట్టిగానే కోరుతున్నారు. అలా తన పట్ల చాలా మంది అభిమానం చూపిస్తున్నారు అన్నారు
క్రాస్ జరుగుతుందా :
సాధారణంగా రాజ్యంగ పదవులకు ఎన్నికలు జరిగితే విప్ జారీ చేయడం అన్నది ఉండదు. ఎవరికి నచ్చిన అభ్యర్ధికి వారు ఓటు వేసుకోవచ్చు. ఇందతా రహస్య పద్ధతిలో సాగుతుంది. దాంతోనే ఇపుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల మీద అంతా చర్చించుకుంటున్నారు రాజకీయ పార్టీలు తన హోదాలో కూటములకు మద్దతు ఇచ్చినా అందులో ఉన్న ఎంపీలు ఆత్మ ప్రబోధం ప్రకారం ఓటు వేస్తే అపుడు పరిస్థితి ఏమిటి అన్న చర్చ సాగుతోంది. అలా క్రాస్ అయ్యే ఓట్లు ఏ పార్టీ నుంచి ఉండొచ్చు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. సహజంగా చూస్తే తెలుగు వారుగా ఉన్న సుదర్శన్ రెడ్డికి ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఓట్లు వస్తాయని అంటున్నారు.
అయితే ఏపీ నుంచి చూస్తే అన్ని ఓట్లూ ఎన్డీయే అభ్యర్ధికే అన్నది ఇప్పటి పరిస్థితి బట్టి తెలుస్తోంది. తెలంగాణాలో చూస్తే బీజేపీ ఎంపీల ఓట్లు ఎన్డీయేకు పడతాయి. ఇక బీఆర్ఎస్ ఓట్లు లెక్క చూడాల్సి ఉంది. ఏపీలో చూస్తే తమ సాటి తెలుగు వారు అన్న అభిమానంలో పార్టీలను పక్కన పెట్టి ఓట్లేసే ఎంపీలు ఉన్నారా ఉంటే ఏ పార్టీలో ఉన్నారు అన్నదే బిగ్ డిస్కషన్ గా ఉంది. ఏది ఏమైనా తనకు ఇండియా కూటమి వెలుపల ఎంపీల మద్దతు దక్కుతోందని ఆయన చేసిన ప్రకటన మాత్రం తెలుగు రాజకీయాల్లో ఎక్కువగా ప్రకంపనలు పుట్టించేలా ఉంది అని అంటున్నారు