సీఎం రేవంత్ మాటలు బాగానే తగులుతున్నాయిగా?

తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు ఉండటం రేవంత్ కు ఏ మాత్రం ఇష్టం లేదన్న హరీశ్.. ఈ కారణంతోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి కూర్చుంటున్నారన్నారు.;

Update: 2025-11-09 05:45 GMT

జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అంతా తానై నడిపిస్తున్న కేటీఆర్ కు తోడయ్యారు మాజీ మంత్రి హరీశ్. కీలక ఎన్నికల ప్రచార వేళలో తండ్రి మరణంతో.. ఆ విషాదంలో ఉన్న ఆయన.. పద్నాలుగు రోజులు గడవటంతో ఉప పోరుపై ఫోకస్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రత్యర్థులకు మంట పుట్టేలా మాట్లాడటంలో సీఎం రేవంత్ కు ఉన్న టాలెంట్ హరీశ్ ను బాగానే హర్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో హరీశ్ నోట ఘాటు వ్యాఖ్యలు రావటం గమనార్హం.

బీజేపీ.. బీఆర్ఎస్ మధ్యన బలమైన బంధం ఉందని తరచూ వ్యాఖ్యలు చేసే సీఎం రేవంత్ కు అదే తరహాలో హరీశ్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ కు చీకటి ఒప్పందం ఉన్న ఆయన.. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు ఉండటం రేవంత్ కు ఏ మాత్రం ఇష్టం లేదన్న హరీశ్.. ఈ కారణంతోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి కూర్చుంటున్నారన్నారు. పీజేఆర్ కొడుక్కు టికెట్ ఇవ్వని రేవంత్ రెడ్డికి ఆయన పేరు తీసే నైతికత లేదంటూ ధ్వజమెత్తారు. పీజేఆర్ ను మానసికంగా వేధించి చనిపోయేలా చేసిందే కాంగ్రెస్ అన్న హరీశ్..ముఖ్యమంత్రి రేవంత్ మానసిక పరిస్థితిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది.

రేవంత్ రెడ్డి భూదందాలు.. వసూళ్లతో పాటు హైడ్రాతో తెలంగాణ ఆదాయం పడిపోయినట్లుగా పేర్కొన్న హరీశ్.. వైఎస్సార్ ను రేవంత్ రెడ్డి విమర్శించలేదా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కట్టిన ప్రతిదాన్ని ఉపయోగించుకుంటూ అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి.. అప్పుల మీద పూటకో అబద్ధం చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. హరీశ్ రావు మాటల్ని చూస్తే.. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు బాగానే తగిలినట్లుగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపపోరులో భాగంగా వరుస పెట్టి ప్రచారాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్.. కేసీఆర్ పదేళ్ల పాలన మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయటం తెలిసిందే. ఆ మాటలకు కౌంటర్ ఇవ్వటమే లక్ష్యంగా హరీశ్ వ్యాఖ్యలు ఉన్నట్లుగా చెప్పొచ్చు.

Tags:    

Similar News