'జూబ్లీహిల్స్'పై మళ్లీ జంఝాటమే!
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జంఝాటం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యవహారం మరోసారి ఆసక్తిగా మారింది.;
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జంఝాటం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యవహారం మరోసారి ఆసక్తిగా మారింది. నిన్న మొన్నటి వరకు మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కే టికెట్ దక్కుతుందని అనుకున్నా.. మంత్రి పొన్న ప్రభాకర్ వ్యాఖ్యల ద్వారా.. ఆయనను కాదన్నట్టుగా సంకేతాలు వచ్చాయి. జూబ్లీహిల్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో నెల రోజుల్లోనే దీనికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కనీసం 6 మాసాల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికి మూడు మాసాలకు పైగా పూర్తయింది.
దీంతో అన్ని పార్టీల్లోనూ.. జూబ్లీహిల్స్ వ్యవహారం ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి కుమారుడికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాగంటి తనయుడిని నిలబెట్టడం ద్వారా సింపతీ ఓటు బ్యాంకును దూసుకోవచ్చన్నది బీఆర్ ఎస్ చెబుతున్న మాట. ఇదిలావుంటే.. ఒకప్పుడు నేత చనిపోయిన నియోజకవర్గంలో సానుభూతి కోసం.. ఇతర పార్టీలు పోటీకి పెట్టేవి కాదు. కానీ, ఖమ్మంలో బీఆర్ ఎస్ హయాంలో కాంగ్రెస్‌నేత చనిపోయినప్పుడు.. బీఆర్ ఎస్ పార్టీ సానుభూతి చూపలేదన్నది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ.
అప్పట్లో కనీసం కాంగ్రెస్ అభ్యర్థనను కూడా కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదని.. కాబట్టి, ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయంలో తాము కూడా సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక, బీజేపీ కూడా ఇక్కడ నుంచి పోటీకి రెడీ అవుతోంది. అభ్యర్థి విషయంలో ఈ పార్టీలోనూ అనేక మంది రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం గతంలో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌కే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కొన్నాళ్ల కిందట చర్చ జరిగింది. దీనికి అజారుద్దీన్ కూడా సై అన్నారు. కానీ, మారుతున్న పరిణామాలు.. రాజకీయ లెక్కల నేపథ్యంలో 'ఎవరికి ఇచ్చినా.. అందరూ ఐక్యంగా ఉండి గెలిపించాలి'' అనే మాట మంత్రి పొన్నం నోటి నుంచి రావడంతో అజారుద్దీన్ విషయంలో వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అయితే.. తనకు టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా అయిన బరిలో నిలుస్తానని.. తన అనుచరులు, పార్టీ సన్నిహితుల వద్ద అజారుద్దీన్ చెబుతున్నారు. తాను గతంలో పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని.. ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోయినా.. భరిస్తున్నా నని ఆయన అంటున్నారు. కానీ, లెక్కకు మిక్కిలిగా నాయకులు పెరుగుతుండడం. అధిష్టానం కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్న నేపథ్యంలో పొన్నం వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బీఆర్ ఎస్ మాత్రం సైలెంట్‌గా సింపతీని గెయిన్ చేసుకునే వ్యూహానికి సాన పడుతోందని తెలుస్తోంది. మాగంటికి ఉన్న ఇమేజ్‌ను ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయనుందని సమాచారం.