జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా ఇతనే..?

జూబ్లీహిల్స్ లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గట్టిగా ప్రయత్నిస్తోంది. ఎవరి అంచనాలకు అందని వ్యూహాలను రచిస్తోంది.;

Update: 2025-10-13 05:41 GMT

జూబ్లీహిల్స్ లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గట్టిగా ప్రయత్నిస్తోంది. ఎవరి అంచనాలకు అందని వ్యూహాలను రచిస్తోంది. ఇది వచ్చే ఎన్నికలకు గీటురాయిగా తీసుకుంటామని చెప్తోంది. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ కేవలం ఒక ఉప ఎన్నిక కాదు.. ఇది ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మక సమరం. హైదరాబాద్‌ కు హృదయంగా ఉన్న ఈ ప్రాంతం నియోజకవర్గం బహుళ మతాల, వర్గాల ఓటర్లతో కూడిన సమీకరణాల కేంద్రం. రాబోయే ఎన్నికల దశను సూచించే సూచికగా మారుతుంది.

పార్టీల కసరత్తు

బీఆర్ఎస్‌ తమ పార్టీ నుంచి సునీతను ప్రకటించింది. కాంగ్రెస్‌ నవీన్‌ యాదవ్‌ పేరును ప్రకటిస్తూ తన బలాన్ని చూపించే ప్రయత్నం చేసింది. ఇక బీజేపీ మాత్రం చివరి నిమిషం వరకు లెక్కలు వేసుకుంటూ వ్యూహాత్మక చర్చలతో ముందుకెళ్లింది. తెలంగాణలో పట్టు పెంచుకోవాలనే సంకల్పంతో బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఒక ‘టెస్టింగ్‌ గ్రౌండ్‌’ లాంటిదని చెప్పవచ్చు. ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత పేర్లతో జాబితా వెళ్లినప్పటికీ చివరి నిమిషంలో దీపక్‌రెడ్డి వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. అయితే, పార్టీ తుది ప్రకటనలో కొంత వ్యూహాత్మక ఆలస్యం చేయడం గమనార్హం.

ఇది యాదృచ్ఛికం కాదు.. బీజేపీ తన అభ్యర్థిని చివరి నిమిషంలో ప్రకటించడం వెనుక భారీ వ్యూహం ఉందని నిపుణులు చెప్తున్నారు. నియోజకవర్గంలో సుమారు లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్నందున, అభ్యర్థి ఎంపికలో సామాజిక సమీకరణాల సున్నితత్వాన్ని పార్టీ స్పష్టంగా పరిగణనలోకి తీసుకుంటోంది.

తెరపైకి దీపక్ రెడ్డి పేరు..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దీపక్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేసి 25,866 ఓట్లు సాధించారు. ఆ సమయంలో గెలుపు సాధించకపోయినా, ఆయనకు స్థానికంగా ఉన్న మద్దతును పార్టీ గుర్తించింది. ఈసారి మళ్లీ ఆయన్ని బరిలోకి దించాలని భావించడం ద్వారా ఓటర్లను ఆకర్షించాలనే ప్రయత్నం చేసింది. మాధవీలత పేరు కూడా పరిగణనలోకి వచ్చినా, ఆమెకు నగరవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ జూబ్లీహిల్స్‌ లాంటి నియోజకవర్గంలో స్థానికత కీలకం కావడంతో, దీపక్‌రెడ్డి వైపే పార్టీ మొగ్గు చూపూలా కనిపిస్తుంది.

చివరి నిమిషం సర్ప్రైజ్‌

బీజేపీ తరచూ ఉపయోగించే ఒక వ్యూహం ‘ఎదురుచూపే’ అభ్యర్థిని చివరి నిమిషం వరకు ప్రకటించదు. పార్టీ అంతర్గతంగా చర్చలతో స్థానిక అసంతృప్తిని నివారిస్తుంది. అలాగే మీడియాను అటెన్షన్ కు గురి చేస్తుంది. కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో సైతం ఇదే పద్ధతి ఉపయోగించింది. జూబ్లీహిల్స్‌లో ఇదే వ్యూహం తిరిగి అమలవుతుందనిపిస్తోంది. అభ్యర్థిని ప్రకటించే సమయానికే ప్రచారం ఊపు తెచ్చేలా చేయడం. దీని ద్వారా మొదటి రోజునుంచే ‘హైలైట్‌’ ఎఫెక్ట్‌ సృష్టించవచ్చు అని పార్టీ భావిస్తుంది.

బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మౌన పోటీ

బీఆర్ఎస్‌ అభ్యర్థి సునీతకు స్థానిక స్థాయిలో బలమైన మద్దతు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను పార్టీ అంచనా వేయలేకపోతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ యువతలో ప్రభావం చూపుతారని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. బీజేపీ ప్రవేశం రెండు పార్టీలకూ సవాల్‌గా మారనుంది. జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోటీ తప్పదని నిపుణులు అంటున్నారు. ఇది రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఒక మూడ్‌ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌ వంటి నియోజకవర్గాల్లో ఓటర్ల మద్దతు ఎలా ఉందో, బీజేపీ ఆ దిశను అంచనా వేసుకునే అవకాశం ఇది.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం కేవలం ఒక అభ్యర్థి ఎంపిక కాదు.. ఇది పార్టీ భవిష్యత్‌ దిశకు సంబంధించిన సూచిక. తెలంగాణలో తాము స్థిరపడిన పట్టు చూపించాలంటే నగర రాజకీయాల్లో గెలుపు తప్పనిసరి. బీఆర్ఎస్‌ తన స్థానిక బలం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్‌ కొత్త ముఖంతో ఓటర్లను ఆకర్షించుకోవాలనే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి దీపక్‌రెడ్డిని అనూహ్యంగా తెరపైకి తెచ్చింది.

ఎన్నో ఎదురు చూపుల మధ్య జూబ్లీహిల్స్‌ బైపోల్‌ తెలంగాణ రాజకీయ వేదికపై పెద్ద ‘సిగ్నల్‌ సీటు’గా మారబోతోంది. ఇక్కడి ఫలితం కేవలం ఒక అభ్యర్థి గెలుపు కాదు.. మూడు పార్టీల భవిష్యత్‌ దిశను నిర్ణయిస్తుంది.

Tags:    

Similar News