జోగి కేసులో కీలక మలుపు.. పోలీసుల చేతిలో లెక్కల పుస్తకం
సిట్ అధికారుల కథనం ప్రకారం జనార్దనరావు 2021లో నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన ఫార్ములాను చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ అందజేశాడు.;
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ నిందితుడిగా ఉన్న కల్తీ మద్యం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏ1 అద్దేపల్లి జనార్దనరావు, ఏ2 అద్దేపల్లి జగన్మోహనరావును కస్టడీలోకి తీసుకుని విచారించిన సిట్, ఎక్సైజ్ పోలీసులు కల్తీ మద్యం లెక్కలకు సంబంధించిన పుస్తకాన్ని సేకరించారని చెబుతున్నారు. దీంతో నిందితుల పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించినట్లు అయిందని అంటున్నారు. నిందితుల్లో ఎవరెవరికి ఎంతెంత మొత్తం చెల్లించారో ఆ పుస్తకంలో స్పష్టంగా రాసినట్లు చెబుతున్నారు. ప్రధానంగా కల్తీ మద్యం తయారు చేయడానికి ఉపయోగించిన ఫార్ములాకు రూ.2.50 కోట్లు చెల్లించారని అంటున్నారు. ఈ మొత్తం చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ, ఆయన కుమారుడు సుదర్శన్ అందుకున్నట్లు సిట్ విచారణలో బయటపడిందని ప్రచారం జరుగుతోంది.
నిందితులు అద్దేపల్లి జనార్దనరావు సోదరులను విచారించిన సమయంలో మరో నిందితుడు కట్టా రాజు వద్ద లెక్కల డైరీ ఉన్నట్లు సిట్ అధికారులకు తెలియజేశారని అంటున్నారు. అద్దేపల్లి సోదరులను పోలీసులు రెండు విడతలుగా కస్టడీలోకి తీసుకున్నారు. గతంలో ఒకసారి కస్టడీలోకి తీసుకుని నాలుగు రోజులు విచారించారు. తాజాగా మరో రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ విచారణలో నిందితులు కీలక విషయాలను వెల్లడించారని అంటున్నారు. అంతేకాకుండా జనార్దనరావు ఆఫ్రికాకు వెళ్లేముందు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. అయితే వారు చెప్పిన సమాచారం రైటా, రాంగా అని తెలుసుకోడానికి సిట్, ఎక్సైజ్ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి పాస్వర్డ్ ఉండటం వల్ల తెరచుకోలేదని సమాచారం.
సిట్ అధికారుల కథనం ప్రకారం జనార్దనరావు 2021లో నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన ఫార్ములాను చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ అందజేశాడు. ఆయనకు గోవా, బెంగళూరుల్లో డిస్టలరీల్లో పనిచేసిన అనుభవం ఉందని నిందితులు తెలిపారని సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే తొలుత ఫార్ములాను అద్దేపల్లి జనార్దనరావుకు ఇచ్చేందుకు బాలాజీ అంగీకరించలేదని, మిశ్రమం మొత్తం తానే చేస్తానని, దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని బాలాజీ చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడికి తొలుత రూ.25 లక్షలు అందజేశారని, అలా మొత్తం బాలాజీ అతడి కుమారుడికి కలిపి రూ.2.5 కోట్లు చెల్లించారని సిట్ ఆధారాలు సేకరించింది. ఈ మొత్తంలో రూ.కోటి వరకు ములకల చెరువు డెన్ నుంచే సరఫరా చేశారని అంటున్నారు.
నిందితులు అద్దేపల్లి సోదరులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కల్తీ మద్యం లెక్కలు రాసుకున్న డైరీని మరో నిందితుడు కట్టా రాజు నుంచి స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఇక మద్యం సీసాలు, మూతల కొనుగోలుకు నిందితులు భారీగా ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులకు మూతలు పంపిణీ చేసిన విజయవాడకు చెందిన మనోజ్ కుమార్ జైన్ అలియాస్ ముతా మనోజ్ ను పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈతడి అరెస్టు సమయంలో పోలీసులు ముందుగా పొరపాటున మనోజ్ కొఠారి అనే పేరును చేర్చారు. దీంతో తనకు మద్యం కేసుతో సంబంధం లేదని ముత్తా మనోజ్ పోలీసులను బురిడీ కొట్టేంచే ప్రయత్నం చేశాడు.
అయితే నిందితులు అద్దేపల్లి జనార్దనరావు బ్యాంకు స్టేట్మెంట్లు ఆధారంగా ప్లాస్టిక్ సీసాలు, మూతలను మనోజ్ కుమార్ జైన్ అలియాస్ మూతా మనోజ్ వ్యవహారాన్ని నిర్ధారించుకున్నారు. అదేసమయంలో కోర్టులో మనోజ్ కొఠారి పేరును తొలగించి ఆ ప్లేసులో ముతా మనోజ్ పేరు చేర్చాలని మెమో దాఖల చేశారు. కాగా, ఒక సిల్వర్ మూత ధర మార్కెట్లో 25 నుంచి 30 పైసలు ఉండగా, మనోజ్ కుమార్ జైన్ మాత్రం అద్దేపల్లి సోదరుల నుంచి రూ.1.50 వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ప్లాస్టిక్ సీసా ధర రూ.1.50 ఉంటే దాన్ని రూ.2.50 నుంచి రూ.3కు విక్రయించి నిందితుల నుంచి దోచుకున్నాడని పోలీసులు వెల్లడించారు.