భారత్‌ పై అమెరికా వివాదాస్పద వ్యాఖ్యలు!

అమెరికా ప్రత్యర్థి దేశాలయిన చైనా, రష్యా గురించి జో బైడెన్‌ వ్యాఖ్యలు చేసినా ఇబ్బంది లేదు కానీ మిత్ర దేశాలు భారత్, జపాన్‌ గురించి కూడా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Update: 2024-05-03 08:32 GMT

ప్రపంచ సూపర్‌ పవర్‌ గా ఎదగాలని దూసుకుపోతున్న చైనాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చైనా ఇరుగుపొరుగు దేశాలైన భారత్, జపాన్‌ లకు అమెరికా చాలా పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు ముకుతాడు వేయడమే లక్ష్యంగా అమెరికా.. భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్‌ కూటమిని కూడా ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో మిత్ర దేశాలైన భారత్, జపాన్‌ లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్‌ భయపడుతుందని జో బైడెన్‌ తాజాగా హాట్‌ కామెంట్స్‌ చేశారు. చైనా, రష్యా, జపాన్‌ గురించి కూడా ఆయన ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ప్రత్యర్థి దేశాలయిన చైనా, రష్యా గురించి జో బైడెన్‌ వ్యాఖ్యలు చేసినా ఇబ్బంది లేదు కానీ మిత్ర దేశాలు భారత్, జపాన్‌ గురించి కూడా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మిత్ర దేశాలను తక్కువ చేసేలా ఈ వ్యాఖ్యలు ఉండటం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ దేశాలు వలసదారులను ఆహ్వానించడానికి ఏమాత్రం ఇష్టపడవని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు.

వలసలను ఆహ్వానించడానికి సిద్ధంగా లేవు కాబట్టే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందడం లేదని జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. ఈ దేశాలకు భిన్నంగా అమెరికా వలసదారులకు ఆహ్వానం పలుకుతోందని.. దీంతో తమ దేశాభివృద్ధికి వారు సహకరిస్తున్నారని తెలిపారు.

Read more!

ఈ నేపథ్యంలో మిత్ర దేశాలు భారత్, జపాన్‌ గురించి జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌ హౌస్‌ ప్రతినిధి వివరణ ఇచ్చారు. మిత్ర దేశాలయిన భారత్, జపాన్‌ పట్ల జో బైడెన్‌ కు అమితమైన గౌరవం ఉందని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని పేర్కొన్నారు. ఈ మేరకు జో బైడెన్‌ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అమెరికా దిద్దుబాటు చర్యలకు దిగింది.

జో బైడెన్‌ తన మిత్ర దేశాలను ఎంత గౌరవిస్తారో తమకంటే ఆ దేశాలకే తెలుసని వైట్‌ హౌస్‌ ప్రతినిధి కరీన్‌ జీన్‌ గుర్తు చేశారు. భారత్‌ తో తమకు సుధృఢ సంబంధాలున్నాయన్నారు. గత మూడేళ్లుగా వీటిని ఎంతో పటిష్టం చేసుకున్నామని తెలిపారు. దేశాల ఆర్థిక వ్యవస్థకు వలసదారులు ఎంత కీలకమో చెబుతూ జో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారని.. ఇందులో ఎలాంటి దురుద్దేశం, తమ మిత్ర దేశాలను తక్కువ చేయాలన్న ఉద్దేశం తమకు లేదని వెల్లడించారు.

Tags:    

Similar News