బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ: భార్య జిల్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు.. అసలేం జరిగింది?

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు తాజాగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ అవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.;

Update: 2025-05-19 12:46 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు తాజాగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ అవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వార్త వెలువడిన వెంటనే, బైడెన్ భార్య జిల్ బైడెన్‌పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బైడెన్ అనారోగ్య విషయం ఆమెకు ముందే తెలుసని, అయినప్పటికీ ఆయనను బలవంతంగా మీడియా ముందుకు నెట్టివేసి అవమానపరిచారని నెటిజన్లు, కొందరు విమర్శకులు మండిపడుతున్నారు.

-జిల్‌పై ఆరోపణలు.. వృద్ధుల వేధింపుల కేసు పెట్టాలని డిమాండ్

బైడెన్ ఆరోగ్యం క్షీణించినా, ఆయన వ్యవహారశైలి సరిగా లేకపోయినా, బహిరంగ వేదికలపై ఆయన ఇబ్బంది పడుతున్నా జిల్‌ కావాలనే వాటిని పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. తాజా క్యాన్సర్ నిర్ధారణ తర్వాత ఈ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. జిల్ బైడెన్‌పై వృద్ధుల వేధింపుల కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

-ట్రంప్ అనుమానం.. వైద్యుడి పోస్ట్

ఈ వ్యవహారంపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. డాక్టర్ జిల్‌కు తన భర్తలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించడంలో ఎలా విఫలమయ్యారని ఆయన ప్రశ్నించారు. నిజానికి, ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించడం సాధ్యమేనని, ఇది బోన్ మెటాస్టేసెస్ కావడానికి 5-7 ఏళ్లు పట్టవచ్చని ఓ వైద్యుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 2025 మేలో మెటాస్టాటిక్ క్యాన్సర్ నిర్ధారణ అయితే, దాని లక్షణాలు ఐదారేళ్ల ముందే కనిపించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్‌ను ట్రంప్ రీట్వీట్ చేస్తూ, "ఇదో మరో కప్పిపుచ్చుడా???" అని అనుమానం వ్యక్తం చేశారు.

- వైట్‌హౌస్‌లో పారదర్శకత లోపం: మాజీ ఉద్యోగి లారోసా వ్యాఖ్యలు

బైడెన్ పాలనా కాలంలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ, మాజీ ప్రెస్ సెక్రటరీ లారోసా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైట్‌హౌస్‌లో బైడెన్ కుటుంబం కనీసం చిన్న చిన్న విషయాలను కూడా దాచిపెట్టడానికి ప్రయత్నిస్తుందని, ఇది వారి వ్యవహారశైలి అని లారోసా పేర్కొన్నారు. ప్రెస్ కవరేజ్ గురించి అబద్ధాలు చెప్పడం, కుక్క కాటు వంటివి కూడా దాచిపెట్టారని, ఇలాంటి చిన్న విషయాల్లోనే పారదర్శకత లేకపోతే, పెద్ద విషయాలను ఎలా దాచిపెడతారో ఊహించవచ్చని ఆమె అన్నారు.

-నెటిజన్ల ఫైర్.. జిల్‌పై తీవ్ర విమర్శలు

ఇక సోషల్ మీడియాలో జిల్ బైడెన్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. వృత్తి రిత్యా డాక్టర్ అయి ఉండి, భర్త ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే గుర్తించలేదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కొందరు ఆమెను "దెయ్యం"గా అభివర్ణిస్తున్నారు. మతిమరుపు, క్యాన్సర్ ఉందని తెలిసి కూడా ఆయన్ను బయటకు పంపిందని ఆరోపిస్తున్నారు. "మీ జీవిత భాగస్వామికి ఇలా చేయడం మీరు ఊహించుకోండి?" అని ప్రశ్నిస్తున్నారు.

"జిల్ బైడెన్ ప్రేమగల భార్య కాదు. ఆమె కేవలం అధికార దాహం గలది. అందుకే మతిమరుపు, క్యాన్సర్‌తో బాధపడుతున్న భర్తను మీడియా ముందుకు నెట్టివేసింది. ఇది ప్రేమ కాదు, స్వార్థం" అని కొందరు నెటిజన్లు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే ఆమె "నిజమైన డాక్టర్ కూడా కాదు" అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద, జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ తర్వాత జిల్ బైడెన్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి, ఆమె ఉద్దేశాలను ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News