జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసుల రియాక్షన్ ఇదే.. ఎస్పీ కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా ఆ సంఘం అడ్ హాక్ కమిటీ సభ్యుడు సాకే త్రిలోక్ నాథ్ మాట్లాడుతూ.. అమరవీరుల దినోత్సవం రోజున పోలీసుల త్యాగాలను స్మరించుకునే వేళ, జేసీ.;
తాడిపత్రి టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ నోరు పారేసుకున్నారు. 'తుపాకులు నీ వద్దే కాదు.. నా వద్ద కూడా ఉన్నాయి. రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా..' అంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. దీనిపై పోలీసు అధికారులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు!
అవును... తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత వృత్తిలో ఉన్న అధికారిని కించపరిచేలా మాట్లాడిన జేసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 'మాదగ్గరా తుపాకులున్నాయి'అనే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
జిల్లా పోలీసు అధికారుల సంఘం డిమాండ్ ఇదే!:
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఆ సంఘం అడ్ హాక్ కమిటీ సభ్యుడు సాకే త్రిలోక్ నాథ్ మాట్లాడుతూ.. అమరవీరుల దినోత్సవం రోజున పోలీసుల త్యాగాలను స్మరించుకునే వేళ, జేసీ.. ఏఎస్పీ యూనిఫాంను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే సమయంలో.. తాడిపత్రిలో ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారంటే దానివెనుక ఏఎస్పీ కృషి ఎంతో ఉందని తెలిపారు.
సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మంత్రి పోలీసుశాఖను ఎలా పటిష్ఠం చేయాలని ఆలోచిస్తుంటే జేసీ మాత్రం పోలీసులను కించపరిచేలా మాట్లాడారని అన్నారు. కిందిస్థాయి అధికారులు తప్పు చేస్తే పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలే తప్ప ఇలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడొద్దని, పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయొద్దనీ ఈ సందర్భంగా హితవు పలికారు.
'బెదిరింపులకు పాల్పడటం నేరం'!:
తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన వేళ ఎస్పీ జగదీష్ స్పందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజునే ఓ పోలీసు అధికారిపై బెదిరింపు ధోరణిలో మాట్లాడటం బాధాకరమని అన్నారు. కుదిరితే రెండు మంచి మాటలు చెప్పాలి.. వీలైతే వారి త్యాగాలను స్మరించుకోవాలి.. అంతేతప్ప ఇలా దౌర్జన్యానికి దిగడం తగదన్నారు.
ఇదే సమయంలో... నిజాయతీ గల అధికారిపై బెదిరింపులకు పాల్పడటం నేరమని పేర్కొన్న ఎస్పీ జగదీష్... జేసీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘మాదగ్గరా తుపాకులున్నాయి’ అంటూ జేసీ వ్యాఖ్యనించడంపైనా స్పందించిన ఆయన... ఈ విషయంలో న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.