స్నానం చేసే మెషిన్లు.. ఇంకెవరో జపానోడిదే ఈ టాలెంట్

సాంకేతిక మాయాజాలంతో ఇప్పటికే అత్యంత బలవంతుడిగా మారిన మనిషి.. తన సుఖాల కోసం చేసుకునే ఏర్పాట్లు చూసినప్పుడు ఆశ్చర్యానికి గురి కావాల్సిందే.;

Update: 2025-11-29 07:35 GMT

మనిషి పరిణామక్రమాన్ని చూస్తే.. పొట్ట నింపుకోవటానికి చెట్టుకున్న యాపిల్ తినటం దగ్గర్నుంచి.. నిప్పును.. చక్రాన్నితయారు చేయటం.. వందలాది ఏళ్లుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్న వైనం తెలిసిందే. ప్రకృతిలో కోట్లాది జీవచరాలు ఉన్నప్పటికి.. బుద్ధి జీవి మనిషికి ఉన్న టాలెంట్ ముందు మరెవరైనా సరే చిత్తు కావాల్సిందే. అందుకేనేమో భూమి మీద ఉన్న ప్రాణులన్నింటికి సమాన వాటా ఉన్నప్పటికి మనిషికి ఉన్న మెదడుతో మిగిలిన వారందరి మీదా అధిపత్యాన్ని సంపాదించటమే కాదు.. అంతకంతకూ బలోపేతం అయ్యేందుకు నిర్విరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

సాంకేతిక మాయాజాలంతో ఇప్పటికే అత్యంత బలవంతుడిగా మారిన మనిషి.. తన సుఖాల కోసం చేసుకునే ఏర్పాట్లు చూసినప్పుడు ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. నేచురల్ గా చేసుకునే అంశాలకు సైతం మెషిన్ల సాయంతో మరింత సౌఖ్యాన్ని అనుభవించేందుకు సిద్ధం చేసే కొన్ని వస్తువులు ఆసక్తికరంగా మారుతుంటాయి. ఇప్పడు అలాంటి ఆవిష్కరణను ప్రదర్శించారు జపనీయులు. మురికి పట్టిన దుస్తుల్ని ఉతికేసే వాషింగ్ మెషిన్ తరహాలో.. ఎంచక్కా మనిషి సైతం ఒకసారి క్యూబ్ లోకి వెళ్లి కూర్చుంటే.. చక్కగా ఉతికేయటమే కాదు.. మర్చిపోలేని అనుభూతిని కలిగించేలా హ్యుమన్ వాషింగ్ మెషిన్ ను సిద్ధం చేశారు.

బట్టల్ని ఉతికినట్లే.. మనుషుల స్నానాలకు మెషీన్ సాయం తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్. దీనికి మిరాయ్ అన్న పేరు పెట్టారు. కేవలం పదిహేను నిమిషాల్లో మనిషిని శుభ్రం చేయటం దీని లక్ష్యం. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఈ హ్యుమన్ వాషింగ్ మెషిన్ సామాన్యుల కోసం కాకుండా కేవలం ఎలక్ట్రానిక్ ఎక్స్ పోలో ఎగ్జిబిట్ చేసేందుకు రూపొందించారు. కానీ.. ఎక్స్ పోలో దీనికి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత దీన్ని అమ్మకాలకు సిద్ధం చేయాలన్న ఆలోచనకు కంపెనీ వచ్చింది.

జపాన్ కు చెందిన సైన్స్ అనే సంస్థ ఆరేళ్ల పాటు కష్టపడి ఈ మెషిన్ ను తయారు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో టోక్యోలో నిర్వహించిన ఒసాకా - కాన్సాయ్ ఎక్స్ పోలో దీన్ని ప్రదర్శించిన వేళ.. దీన్ని ఒకసారి ప్రయత్నిస్తామంటూ రిక్వెస్టు చేసుకున్నోళ్లు ఎందరో తెలుసా? అక్షరాల 40 వేల మంది. దీంతో.. ఈ మెషిన్ ను కమర్షియల్ గా తీసుకొచ్చే ఆలోచనను ఈ కంపెనీ చేసింది. అయితే.. ఈ హ్యుమన్ వాషింగ్ మెషిన్ ను విరివిరిగా అందుబాటులోకి తీసుకురాకుండా.. కేవలం లిమిటెడ్ ప్రజలకు మాత్రమే అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇంతకూ దీని ధర ఎంత ఉంటుంది? అన్న ప్రశ్నకు కంపెనీ సమాధానం చెబుతోంది. అనధికారికంగా దీని ధర రూ.3కోట్లకు పైనే ఉంటుందని చెబుతున్నారు. ఒక మీటరు వెడల్పు.. 2.5 మీటర్ల లోతు.. 2.6 మీటర్ల ఎత్తు ఉండే ఈ మెషిన్ చూసేందుకు ఒక పాడ్ మాదిరి కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లిన తర్వాత మనిషి పూర్తి శరీరాన్ని క్లీన్ చేయటమే కాదు.. డ్రై చేస్తుంది కూడా.

ఇందులోకి వెళ్లిన తర్వాత శరీరానికి ఉన్న మురికిని మాత్రమే కాదు.. డెడ్ సెల్స్ ను కూడా తీసేస్తుంది. స్కిన్ కండిషన్ కు తగ్గట్లుగా తన క్లీనింగ్ సైకిల్ ను మార్చుకుంటుంది. క్లీనింగ్ వేళ హాయిగా.. రిలాక్స్ అయ్యేందుకు వీలుగా వీడియోలు.. మ్యూజిక్ ను ప్లే చేస్తారు. స్నానం మొత్తం పావుగంటలోనే పూర్తి అవుతుందని కంపెనీ స్పష్టం చేస్తోంది.

ఒకసారి లోపలకు వెళ్లి కూర్చున్న తర్వాత ఇక చేసేదేమీ ఉండదు. ఎంచక్కా ఒంటిని మెషిన్ కు అప్పజెప్పి హాయిగా రిలాక్స్ కావటమే. కమర్షియల్ అవసరాలకు మాత్రమే వీటిని సరఫరా చేస్తామని.. అది కూడా లిమిటెడ్ ఎడిషన్ లోనూ అందుబాటులోకి తెస్తామని కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏమైనా.. రానున్న రోజుల్లో సాంకేతికత ఏ స్థాయికి వెళ్లనుందన్న దానికి ఈ హ్యుమన్ వాషింగ్ మెషిన్ ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News