జంతర్ మంతర్ లో ఏం జరుగుతుంది ?

జంతర్ మంతర్ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. అనేక కళాశాలలలో పరీక్షలను వాయిదా వేశారు.

Update: 2026-10-10 07:48 GMT

ఓట్ల నమోదులో అవకతవకలను ప్రశ్నిస్తూ కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరాయి. గత సెప్టెంబరు చివరి వారం నుండి మొదలయిన నిరసనలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి. ఎఐఎస్ఎ, ఎస్ఎఫ్ఐ, యువజన కాంగ్రెస్, మరియు ఇతర పౌర సమాజం సంఘాలు, వాటి సభ్యులు యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషన్, అంజలీ భరద్వాజ్ తదితరులు ఈ ఆందోళనలలో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే నేతృత్వంలో పిలుపునిచ్చారు. దీంతో అక్కడ నిరసనలకు అనుమతులు నిరాకరిస్తూ పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. అనుమతులు లేని నిరసనలు చట్ట విరుద్దం అని, ప్రజా భద్రత, ట్రాఫిక్, గత అనుభవాల నేపథ్యంలో ఆందోళనలకు అనుమతులు ఇవ్వడం లేదని పోలీసులు చెబుతున్నారు.

నిరసనలకు పిలుపు నేపథ్యంలో జంతర్ మంతర్ ప్రాంతం అంతా బారీకేడ్లతో దిగ్భంధం చేశారు. దాదాపు 25 వేల నుండి 40 వేల మంది పోలీసులను మోహరించినట్లు తెలుస్తుంది. డ్రోన్లు, బాడీ క్యామ్ లను వినియోగిస్తున్నారు. దాదాు 45 మెట్రో స్టేషన్లలోకి ఎవరూ ప్రవేశించకుండా మూసివేశారు. ఢిల్లీకి వచ్చే 250 రైళ్లను రద్దు చేశారు.

జంతర్ మంతర్ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. అనేక కళాశాలలలో పరీక్షలను వాయిదా వేశారు. పాఠశాలలు అన్నీ ఆన్ లైన్ కు మారిపోయాయి. గత రాత్రి నుండి వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం చేస్తున్నారు. రైళ్లు, బస్సులు, విమానాలు, కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తూ పోలీసులు అనుమానితులను అరెస్టు చేస్తున్నారు.

‘ఇది ప్రజాస్వామ్య పోరాటం. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు ఈ ఆందోళనలు ఆగవు. మోదీ, అమిత్ షాలు ఏమైనా చేయొచ్చు. కానీ మేము ఏం చేసినా ఆగము’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నాడు. జ్ఞానేష్ కుమార్ క్రిమినల్. అతనిని అరెస్టు చేయాలి. విచారించాలి అని టీఎంసీ నేత మహువా మొయిత్రా డిమాండ్ చేస్తున్నాడు.

‘దేశంలో బీజేపీకి ఓట్లు వేయని వారి ఓట్లను తొలగిస్తున్నారు. నేను నా కుటుంబంతో పాటు జంతర్ మంతర్ కు వెళ్తాను’ అని ఆప్ అధినేత, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అంటుండగా, ‘జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తేనే దేశంలోని యువత వెనక్కి తగ్గుతుంది. జంతర్ మంతర్ 2.0 జరిగి తీరుతుంది’ అని సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే స్పష్టం చేస్తున్నాడు.

ముఖ్యంగా జంతర్ మంతర్, సెంట్రల్ ఢిల్లీ, పార్లమెంట్ స్ట్రీట్, జనపథ్ ప్రాంతాలు భారీ భద్రతా వలయాల మధ్యన చిక్కుకున్నాయి. పరిస్థితులు గంటగంటకూ మారుతున్నాయి. ప్రస్తుతానికి జంతర్ మంతర్ వైపు ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు. ఈ దిగ్భంధాన్ని విపక్షాలు చేధించ గలుగుతాయా ? ఈ నిరసనలు ఆగాలంటే కేంద్ర ఎన్నికల కమీషనర్ రాజీనామా చేయాలి. మరి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందా ? అన్న సందేహాలే అందరి మనసులను తొలుస్తున్నాయి.

Tags:    

Similar News