తెలంగాణాలో జనసేన పోటీ ...పొత్తులపై సస్పెన్స్...!
మొత్తం 32 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. దీనిని అధికారికంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్ ఫర్మ్ చేశారు.;
జనసేన 2019 తరువాత మరోసారి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తోంది. నిజానికి 2018లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. ఏపీ మీదనే ఫోకస్ చేస్తున్నట్లుగా పేర్కొంది. ఇపుడు మాత్రం తెలంగాణాలో ముందు తేల్చుకుని ఆ మీదట ఏపీలో ఫైట్ గట్టిగా ఇవ్వాలని డిసైడ్ అయింది.
మొత్తం 32 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. దీనిని అధికారికంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్ ఫర్మ్ చేశారు. తెలంగాణా ఎన్నికల బరిలోకి మేము దిగబోతున్నామని ఆయన కీలక ప్రకటన చేసారు.
తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని అంతా సిద్ధం చేశాం, నలభై మంది అభ్యర్ధులు కూడా రెడీ అయ్యారు. అయితే తెలంగాణా బీజేపీ కోసం తాము విత్ డ్రా అయ్యామని రెండేళ్ల క్రితం నాటి విషయాలను గుర్తు చేశారు. తెలంగాణాలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని పవన్ అనడం విశేషం.
ఇక ఆయన కొసమెరుపుగా ఒక మాట అన్నారు. పొత్తుల విషయం ఇంకా తేల్చుకోలేదని చెప్పుకొచ్చారు. అంటే తెలంగాణాలో జనసేన పొత్తులకు సిద్ధమని ఆయన సంకేతాలు ఇచ్చారు. మరి ఏపీలఒ టీడీపీతో బీజేపీతో పొత్తులను కొనసాగిస్తున్న జనసేన తెలంగాణాలో ఎవరితో కలసి వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంది
అదే టైంలో ఏపీలో చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన జనసేన ఆ సింపతీని తన పార్టీ వైపుగా మళ్ళించుకోవడానికి పోటీకి అభ్యర్ధులను పెట్టారని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ జనసేన పొత్తులు ఏపీ కంటే ముందే తెలంగాణాలో లిట్మస్ టెస్ట్ గా సెట్ చేసి పోటీకి దిగుతాయని అంటున్నారు.
అక్కడ కనుక ప్రజల రియాక్షన్ బాగా వస్తే రెండు పార్టీలకు రాజకీయ లాభం ఉంటే మంచి దూకుడుతో ఏపీలో కూడా ఈ పార్టీలు దూసుకుని వస్తాయని అంటున్నారు. దీనికి రెండు రోజుల క్రితం బాలయ్య కూడా తెలంగాణా పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ తెలంగాణాలో టీడీపీ ఎక్కడ లేదో చూపిస్తామని అన్నారు.
పొత్తుల విషయం చంద్రబాబు నిర్ణయిస్తారు అని అన్నారు. చంద్రబాబు బెయిల్ మీద వస్తే కనుక ఆయన ఏపీతో పాటు తెలంగాణా మీద కూడా ఫుల్ ఫోకస్ పెడతారు అని అంటున్నారు. జనసేన టీడీపీ కలిస్తే సెటిలర్స్ ఉన్న ఏరియాలలో బాగానే ఓట్లు రాబట్టుకోవచ్చు, కొన్ని గెలిచే సీన్ కూడా ఉంటుందని అంటున్నారు.
ఇక బీజేపీ విషయం కూడా ఇపుడు చర్చకు వస్తోంది. టీడీపీ జనసేన పోటీకి దిగితే బీజేపీ వారితో కలుస్తుందా లేదా అన్నది తెలంగాణా ఎన్నికలలోనే తెలుస్తుంది అంటున్నారు. ఒకవేళ అక్కడ కలిస్తే ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతాయి. అయితే ఆంధ్రా పార్టీలు అని జనసేన టీడీపీ మీద ముద్ర ఉండడం వల్ల కలిసే పరిస్థితి ఉండబోదని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ తెలంగాణలో జనసేన పోటీ అన్నది ఊరికే అనలేదని అంటున్నారు.
ఆయన అన్నీ ఆలోచించే వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేశారు అని అంటున్నారు. ఇక జనసేన పుట్టాక పార్టీ పెట్టాక తెలంగాణాలో పోటీ చేయడం ఇదే ఫస్ట్ టైం. మరి తెలంగాణాలో జనసేనకు ఉన్న బలం ఎంత అన్నది కూడా ఈ ఎన్నికల్లో తెలుస్తుంది అని అంటున్నారు.